Take a fresh look at your lifestyle.

అం‌దరి కళ్ళూ హుజూరాబాద్‌ ‌పైనే

తెలంగాణా రాష్ట్ర సమితిలో అధినాయకత్వానికి మొన్నటి వరకు సన్నిహితుడు, మంత్రివర్గ సహచరుడు, తెలంగాణ ఉద్యమకారుడు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఈటల రాజేందర్‌కు మధ్య వ్యక్తిగత రాజకీయ విభేదాలు తలేత్తడంతో మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ ‌బర్తరఫ్‌, ‌తదనంతరం ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన అనంతరం హుజురాబాద్‌ ‌రాజకీయాలు వేడెక్కాయి. ఈటల రాజీనామా స్పీకర్‌ ఆమోదించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరు నెలల్లో ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఎప్పుడైనా నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఉపఎన్నికలు ఎప్పుడు వొచ్చినా ఎదుర్కునేందుకు టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ముఖాముఖి పోటీ పడుతుండగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఇతమిత్థమైన నిర్ణయానికి రాలేకపోతున్నది. పలువురు రాష్ట్ర మంత్రులు నియోజకవర్గంలో పాగావేయగా, పోటాపోటీగా బిజెపి నాయకులు సైన్య సమీకరణ మొదలెట్టారు. పార్టీలన్నీ అక్కడే మకాం వేశాయి. ఎప్పుడు జరుగుతాయో తెలియని ఉపపొరు కోసం ఇప్పటి నుండే, ప్రణాళికలు రచిస్తున్నారు. కసరత్తులు మొదలు పెట్టారు. గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు, మంది,మార్బలంతో పాటు సొమ్ము కూడా కుమ్మరించేందుకు తెరతీస్తున్నాయి.

ఉప ఎన్నికను ఎదుర్కునేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే సన్నద్ధమైంది. ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను కెసిఆర్‌ ‌ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరొందిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు భుజస్కంధాలపై పెట్టారు. నియోజకవర్గంలోని హుజురాబాద్‌, ‌జమ్మికుంట మున్సిపాలిటీలకు, హుజురాబాద్‌, ‌జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్‌ ‌మండలాలకు పార్టీ ప్రత్యేక ఇంచార్జిల నియామకం పూర్తయింది. ఈటల బీజేపీ పార్టీలో చేరిన వెంటనే హుజూరాబాద్‌లో ఎన్నికల రాజకీయ వేడి రగుల్కున్నది. ఇంత కాలం హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అం‌టే ఈటల, ఈటల అంటే టీఆర్‌ఎస్‌ అన్నట్లుగా ఉండేది. ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేయడంతో ఉపఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో చక్కదిద్దుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈటల వైపు వెళ్లకుండా కట్టడి చేసుకోవడం, ఈటలకు పోటీగా దింపడానికి సరైన అభ్యర్థిని వెతుక్కోవడంలో ఆ పార్టీ తలమునకలవుతున్నది. సొంత పార్టీలోనే కాకుండా ఇతర పార్టీ నుంచి కూడా ఈటలపై పోటీచేసే సత్తా ఉన్న వారి కోసం అన్వేషణ ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయంలో హుజూరాబాద్‌ ‌నియోజకవర్గ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగనుంది. నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీల ప్రచారం మొదలైంది. నియోజకవర్గంలో ఇప్పటికే టీఆరెస్‌ ‌పార్టీ ఫెక్సీలు, బ్యానర్లు, వాల్‌ ‌పెయింటింగులు వెలిశాయి. ఈటల బలప్రదర్శన, మంత్రుల పర్యటనలు, తాయిలాల ప్రకటన, అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుండటంతో రసకందాయంగా తయరయింది. ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీలలో హుజురాబాద్‌లో ఏమి జరగబోతుందోననే ఆసక్తి ఏర్పడింది. ఈటలను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌, ఆత్మగౌవం పేరుతో టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఈటల ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతూ రాజకీయ పరిణామాలను రోజుకో మలుపు తిప్పుతున్నారు. నువ్వా నేనా అన్నట్టు హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో ఈటల వర్సెస్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌సాగుతున్నది. ఉపఎన్నిక ఇరువురికి చావో రేవో అన్న చందంగా ఉంది. ఈటల గెలిస్తే ఆయన బలం మరింత పుంజుకుంటుంది. ఓడితే ఈటల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ‌దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. మంత్రులు అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందిస్తూనే పార్టీకి ఈటల ద్రోహం చేశారంటూ ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నంలో ఉన్నారు. హుజూరాబాద్‌లో మంత్రులు గంగుల కమలాకర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌ ‌మకాం వేసి పరిస్థితులను గమనిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌ ‌కుమార్‌లను హుజురాబాద్‌లో రంగంలోకి దింపింది. గ్రామాలు, మండలాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతో పాటు ఈటల వర్గాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతున్నది. కెసిఆర్‌ ఎత్తులు మొదటి నుంచి తెలిసిన ఈటల రాజేందర్‌ ‌హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో తనదైన వ్యూహరచనతో పై ఎత్తులు వేస్తూ ముందుకెళుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటలపై పోటీకి బీసీ అభ్యర్థిని నిలపాలా, రెడ్డీ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రెడ్డీ అభ్యర్థిని రంగంలోకి దింపాలా అనే విషయంలో అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. హుజూరాబాద్‌లో అధికారపార్టీ అభ్యర్థి విషయమై రోజుకో పేరు తెరపైకి వొస్తున్నది. ఈటల బీసీ కావడం, ఈటల సతీమణి రెడ్డి సామాజిక వర్గ కావడంతో బీసీ, రెడ్డీ సామాజిక వర్గాల వోట్లు ఈటలకు ప్రతిసారి కొంత సానుకూలంగా వొస్తున్నాయి. దీంతో బలమైన రెడ్డి అభ్యర్థిని ఈటలపై పోటీకి దింపాలనే కోణంలోనూ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ఉద్యమ నాయకులకు, టీఆర్‌ఎస్‌ ‌నాయకులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తు ఈటల ఉద్యమ నాయకులను రంగంలోకి దింపుతున్నారు. నియోజకవర్గంలో బాధ్యతలను ఉద్యమ నేతలు స్వామి గౌడ్‌, ‌విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్‌కు అప్పజెప్పనున్నారు. వీరంతా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు కావడంతో రంగంలోకి దింపి ప్రభుత్వ నేతల వ్యూహాలకు చెక్‌ ‌పెట్టాలని ఈటల భావిస్తున్నారు. ఉద్యోగుల మద్దతు కోసం మాజీ ఉద్యోగ సంఘం నేత స్వామిగౌడ్‌కు హుజరాబాద్‌ ‌నియోజకవర్గంలో చురుకైన బాధ్యత అప్పగించే యోచన సాగుతున్నది. బీజేపీలో చేరాక ఈటల నియోజకవర్గం వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. రాజేందర్‌ ‌సతీమణి జమునకు అడుగడుగునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, రాజీనామా అనంతరం మొదటిసారి వొచ్చిన రాజేందర్‌కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. అనుచరులు, ప్రజలతో మమేకం అవుతున్నారు. కేసీఆర్‌ ‌తనకు అన్యాయం చేశారని, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ‌ముఖ్య నేతలంతా తిష్టవేసినా ప్రజలు నమ్మరన్నారు. ప్రభుత్వ అహంకారానికి ఘోరీ కడతారన్నారు. ఈటల భార్య జమున గ్రామాలలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళుతున్నారు. ఉపఎన్నికలో భర్త గెలుపు ఖాయమనే ధీమా కనబరుస్తున్నారు. గత ఎన్నికలకంటే అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు. ఎంత ధనం ప్రవహించినా, ప్రలోభాలకు గురిచేసినా ఈటలకే వోటేసేందుకు సిద్ధమన్నట్టున్నారని చెబుతున్నారు. బీజేపీ కోర్‌ ‌కమిటీ సభ్యులు వివేక్‌ ‌వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు, మాజీ ఎంఎల్‌ఏ ఏనుగు రవీదంర్‌ ‌రెడ్డితో కలసి నియోజకవర్గ పర్యటనకు వొచ్చిన ఈటలకు బీజేపీ కార్యకర్తలు, పార్టీతో సంబంధం లేకుండా అభిమానులు ఘన స్వాగతం పలికారు. తదనంతరం జమ్మికుంటలో సైతం కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపుకోసం బీజేపీ వ్యూహరచనలో భాగంగా మండల ఇంఛార్జ్‌లను ప్రకటించింది బీజేపీ.

హుజురాబాద్‌ ‌రూరల్‌ ‌రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జమ్మికుంట- ఎంపీ అర్వింద్‌, ‌జమ్మికుంట రూరల్‌- ‌మాజీ ఎమ్మెల్యే ధర్మారావు వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి, కమలాపూర్‌- ‌కూన శ్రీశైలం గౌడ్‌ను ఇంఛార్జ్‌లుగా నియమించింది. నియోజకవర్గ కోఆర్డినేర్‌గా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ప్రకటించింది. హుజూరాబాద్‌ ‌కాంగ్రెస్‌లో అయోమయం ఏర్పడింది. దుబ్బాక, సాగర్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు, ఎమ్మెల్సీ పోరు, స్థానిక సంగ్రామం.. ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ ‌స్కోర్‌ ‌కార్డ్ ఓపెన్‌ ‌చేయలేకపోయింది. నాయకుడు లేని పార్టీ పరిస్థితి. ఈ దశలో ఈటల వ్యవహారం కాంగ్రెస్‌కి మరింత తలనొప్పిగా మారింది. హుజూరాబాద్‌లో బీజేపీకి ఎప్పుడూ బలం లేదు, కాంగ్రెస్‌ ‌మాత్రమే అక్కడ టీఆర్‌ఎస్‌కి పోటీ ఇస్తున్నది. ఇప్పుడు ఈటల బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్‌ ‌తన వోటు బ్యాంకుని కాపాడుకోవాల్సిన పరిస్థితి. కనీసం ఇప్పుడైనా టీపీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే..ఆ ఉత్సాహంతో హుజూరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పనిచేసే అవకాశం ఉంది. పీసీసీ పీఠం ఇస్తే..నియోజకవర్గం మొత్తం కలియదిరిగి పార్టీకి జవసత్వాలు తెస్తానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సాగర్‌ ఉపఎన్నికల సాకుతో టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేసిన అధిష్టానానికి, ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముంచుకు రావడంతో ఆ తంతు పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్‌ ‌నేతలు చేజారకుండా ఉండాలంటే, వారిలో భరోసా నింపే ప్రయత్నం చేయాలి. ఉపఎన్నిక పోటీపై అధిష్ఠానం దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు. పిసిసి అధ్యక్షుని ఎన్నిక, ఎంపిక విషయంలోనే ఏకాభిప్రాయానికి రాలేకపోయిన నేతలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించి యోచిస్తున్న దాఖలాలు లేవు. ముక్కోణపు పోటీ అయితే ఒక వైపు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి అయిన బిజెపికి, లేదా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెరాసకు దీటుగా ఎదుర్కునే సత్తా కనబడడం లేదు. ఎక్కడ ఎన్నిక జరిగినా, ఉపఎన్నిక జరిగినా ఆర్భాటం, అట్టహాసం విపక్షానిదని, గెలుపు తెరాస దేనని జిహెచ్‌ఎం‌సి, రాజ్యసభ, నాగార్జునసాగర్‌ ‌ఫలితాలు రుజువు చేసాయని, భవిష్యత్తు కూడా అంతేనని తెరాస శ్రేణులు ధైర్యం ప్రదర్శిస్తున్నాయి.

Leave a Reply