“కేసీఆర్ కి ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గంపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందనీ..
. ‘తెలంగాణ దళిత బంధు పథకం’ ప్రకటించి, దీని అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని పేర్కొంటూ బీజీపీ నాయకురాలు విజయ శాంతి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ప్రకటనలో ఆమె.. “పథకం అమలులో నిర్లక్ష్యం కనబరిస్తే సహించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక కూడా చేశారు. ఈ నిర్ణయం వెనుక లోగుట్టు ఏమిటో ప్రజలకు ఆమాత్రం తెలియదనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటుండదు. ఈ నియోజకవర్గంలోని 20 వేల పైచిలుకు కుటుంబాల కోసం రూ.2 వేల కోట్ల మేర ఖర్చుచేస్తామని ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్‌ను ఎంచుకోవడమంటే… ఆ పథకాన్ని ముందుగా ఇక్కడ అమలుచేసి, ఫలితాలను బట్టి లోటుపాట్లు సరిచేసి, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని అమలు చెయ్యాలి. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు స్కీంకు ఇప్పటికే రూ.1200 కోట్లు కేటాయించామన్నారు. ఇక తెలంగాణలోని సుమారు 20 లక్షల దళిత కుటుంబాల కోసం 2 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి.
అసలు అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా?… సీఎంగారి లెక్క ప్రకారం ఇదంతా కార్యరూపం దాల్చడానికి 165 సంవత్సరాలు పడుతుంది. చూస్తుంటే దళిత సీఎం… దళితులకు 3 ఎకరాల భూమి… అంటూ కేసీఆర్ గారు మరచిన వాగ్దానాలు… దళిత ఉపముఖ్యమంత్రులకు దక్కిన మర్యాద లాగే ఈ దళిత బంధు కూడా ప్రకటనలకే పరిమితమయ్యే వ్యవహారం అనిపిస్తోంది. ఒకవేళ ఉపఎన్నికల నేపథ్యంలో విపక్షాలు కోర్టుకెక్కి ఆపితే… దళితులకు వచ్చే సొమ్మును అడ్డుకున్నారంటూ ప్రతిపక్షాలపై నింద మోపి, దీనిని ప్రచారాస్త్రం చేసుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. హుజూరాబాద్‌పై సీఎంగారి అంతులేని ప్రేమకు బీజాలు ఎప్పుడో పడ్డాయి. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా ఈ నియోజకవర్గంలోనే దర్శనమిస్తూ రోడ్లు, ఫంక్షన్ / కమ్యూనిటీ హాళ్ళు అంటూ జనంపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ సహా హుజూరాబాద్ పట్టణం… ఇంకా నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి అంటూ వందల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. నియోజకవర్గంలో మరిన్ని పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. తెలంగాణ అంటే హుజూరాబాద్ మాత్రమే అన్నట్టుగా సర్కారు పోకడ కనిపిస్తోంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగారు చేసే వాగ్దానాల అమలు గురించి హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల ప్రజల్ని అడిగితే బాగా చెబుతారు అని ప్రకటనలో పేర్కొన్నారు.