Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ ‌కౌంట్‌ ‌డౌన్‌ ‌స్టార్ట్ ‌కెసిఆర్‌ ‌వర్సెస్‌ ఈటలగా పరిశీలకుల భావన

మండువ రవీందర్‌రావు
హుజూరాబాద్‌ ‌కౌంట్‌డౌన్‌ ‌మొదలైంది. నిన్నటివరకు పండుగ సంబురాల్లో మునిగి తేలిన రాజకీయ పార్టీల కార్యకర్తలు మళ్ళీ ప్రచారానికి సిద్ధమైనారు. ఈ నెల ముప్పయవ తేదీన ఇక్కడ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలు వోటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్‌లోని వోటర్లలో దళితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టిఆర్‌ఎస్‌ అదునుచూసి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నా, తమ పార్టీని గెలిపించుకునేందుకు ఏమైనా చేస్తామన్న ధోరణిలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ వెఖరి కనపడుతున్నది. హుజూరాబాద్‌లో అధికారికంగా ఉప ఎన్నిక సమయాలు ప్రకటించకముందు నుండే ఇక్కడ రణరంగ వాతావరణం నెలకొంది. గత మే నెలవరకు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌పైన భూ కబ్జాకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం క్షణాలమీద నిర్ణయం తీసుకుని రాజేందర్‌ను మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ ‌చేసిన విషయం తెలియంది కాదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు ఈటల తన శాసనసభ్యత్వాన్ని కూడా ఒదులుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యత ఏర్పడింది. రాజీనామా చేసిన మరుసటి రోజు నుండే ఈటల రాజేందర్‌ ఈ ‌నియోజవర్గంలో తన భవిష్యత్‌ ‌మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టాడు.

ఊరూరా తిరిగి అందరి అభిప్రాయలు తెలసుకుని టిఆర్‌ఎస్‌ను ఢీ కొనాలంటే మరో గట్టి పార్టీ మద్దతు తప్పక ఉండాలన్న నిర్ణయంతో బిజెపి తీర్థం తీసుకున్న రాజేందర్‌కు ఆ పార్టీ కూడా సముచిత పదవులిచ్చి గౌరవించింది. బిజెపి అత్యున్నత నిర్ణాయక కమిటి నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌కు ప్రత్యేక అహ్వానితుడిగా ఆయన్ను గుర్తించింది. ప్రధానంగా ఆ పార్టీ అభ్యర్థిగా ఆయన్ను హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుకూడా పర్యటిస్తుండడంతో ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్నది ముఖాముఖి పోరాటమనడంలో ఎలాంటి సందేహంలేదు. కాంగ్రెస్‌ ‌దీనితోనైనా పోయిన పరువును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అనుకున్నంతగా దూసుకుపోలేకపోతున్నది. ఈ క్రమంలో తీవ్రపోటీ బిజెపి వర్సెస్‌ ‌టిఆర్‌ఎస్‌గా మారింది. మరో విచిత్రకర పరిణామమేమంటే ఇక్కడ జరుగుతున్న పోటీ పార్టీ మధ్య కాకుండా వ్యక్తుల మధ్య జరుగుతున్నదంటున్నారు. కెసిఆర్‌ ‌వర్సెస్‌ ఈటలగా దీన్ని అభివర్ణించుకుంటున్నారు. ఈటల చెబుతున్నట్లు ప్రజలంతా తమ వైపు ఉండి, ఆయన్నే గెలిపిస్తే ఎలా ఉంటుందన్న విషయమై ‘రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వొస్తాయి’ అని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఒక విధంగా వొచ్చే శాసనసభ ఎన్నికలకు ఇవి రెఫరెండంగా భావిస్తున్నారు. అందుకే ఈ స్థానాన్ని ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకోవడానికి అనేక ఎత్తులు జిత్తులు వేస్తున్నారు.

ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శించుకుంటున్నారు. ఇరు పక్షాలవారు ఎదుటిపక్షంపై అవినీతి ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. చివరకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. టిఆర్‌ఎస్‌ ‌విద్యార్థి విభాగాల నేత జగన్‌పై బిజెపి దాడులు చేస్తే, టిఆర్‌ఎస్‌ ‌డబ్బులు పంచుతున్నదని బిజెపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ జరుగుతున్నది ఉప ఎన్నికలే. ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతున్న రెండు పార్టీలు కూడా ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంటే, మరోటి కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల కూడా ఈ ఎన్నికకు ప్రధాన్యత ఏర్పడింది. జరుగుతున్న పరిణామాల దృష్ఠ్యా ముందస్తు చర్యగా ఎన్నికల అధికారులు కేంద్ర బలగాలను కూడా రప్పించుకున్నారు. ప్రతీ మండల స్థాయిలో సిసి కెమారాలు, డ్రోన్‌ ‌కెమరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు ఇప్పటిరకు పలు జిలెటన్‌ ‌స్టిక్స్, ‌డిటోనేటర్లు, మద్యం, గంజాయిలను స్వాదీనం చేసుకున్నారంటేనే ఇక్కడ మద్యం, డబ్బు ఎలా విచ్చలవిడిగా చేతులు మారుతుందన్నది స్పష్టమవుతున్నది.

అసలు రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అనేక సాధారణ, ఉప ఎన్నికలతో పోలిస్తే హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఆత్యత ఖరీదతైనదిగా భావిస్తున్నారు. ఇరు పార్టీలు కూడా డబ్బును నీళ్ళ ప్రాయంగా వెచ్చిస్తున్నారన్నది విస్తృత ప్రచారంలో ఉన్నది. కాగా ప్రభుత్వం కూడా పథకాల రూపంలో కోట్లాదిరూపాయలను ఇక్కడ గుమ్మరిస్తున్నది. సుమారు రెండు వేలకు పైగానే నిధులు రిలీజ్‌ అయి ఉండవచ్చంటున్నారు. వీటికితోడు వివిధ కార్మిక వర్గాలు, కులాల వారిగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వోటింగ్‌ ‌శాతం పెంచుకోవాలని టిఆర్‌ఎస్‌ ఆలోచిస్తున్నది. అయితే ఆత్మగౌరవం మీద మంత్రివర్గం నుండి బయటికి వొచ్చిన ఈటలకు ఆదే ఆత్మగౌరవంతో తనకు వోటేస్తారన్న గట్టినమ్మకంతో ఉన్నారు. భవిష్యత్‌ ‌రాజకీయాల్లో సమూల మార్పుకు కారణంగా మారుతుందనుకుంటున్న ఈ ఉప ఎన్నికకు కౌంట్‌ ‌డౌన్‌ అయితే మొదలైంది.

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

Leave a Reply