Take a fresh look at your lifestyle.

హుస్నాబాద్‌ ‌రణరంగం

  • పరిహారం కోసం భూ నిర్వాసితుల ధర్నా
  • పోటీగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన
  • గౌరవెల్లి భూ నిర్వాసితులకు టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు మధ్య రగడ
  • ఎమ్మెల్యే కాంపు ఆఫీస్‌ ‌దగ్గర పోటాపోటీ నిరసనలు
  • భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి
  • పోలీసులు, ప్రజలు పరస్పరం దాడులు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. రణరంగంగా మారింది. గౌరవెళ్లి రిజర్వాయర్‌ ‌నిర్వాసితులైన గూడాటిపల్లి వాసులపై నిన్న(సోమవారం) తెల్లవారు జామున పోలీసుల లాఠీచార్జికి నిరసనగా మంగళవారం హుస్నాబాద్‌లో వరంగల్‌-‌సిద్ధిపేట రహదారిపైన రాస్తారోకోకు దిగారు. లాఠీచార్జికి నిరసనగా నిన్న మొదలైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలో భాగంగా నిర్వాసితులు, పలువురు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ‌క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్దయెత్తున తరలివచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

హుస్నాబాద్‌ ‌బస్టాండ్‌ ‌సమీపంలోని మల్లెచెట్టు చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ధర్నా సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, భూ నిర్వాసితుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సందర్భంలోనూ పోలీసులు, ఆందోళనకారులు కూడా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఒక దశలో లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ‌వచ్చే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామనీ భూ నిర్వాసితులు మొండికేశారు.

రెండ్రోజుల్లో మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ‌పట్టించుకోవడం లేదనీ భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వరంగల్‌-‌సిద్ధిపేట ప్రధాన రహదారిపైన వంటావార్పు, రాస్తారోకో నిర్వహించారు. తమకు పరిహారం ఇవ్వకుండా సర్వే చేయడానికి వీలు లేదంటూ ఆందోళన చేస్తున్న గౌరవెళ్లి రిజర్వాయర్‌ ‌నిర్వాసితులను కట్టడి చేసే క్రమంలో పోలీసులు బలప్రయోగానికి దిగడాన్ని అటు ప్రజలు, ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే భూములు కోల్పోతున్న నిర్వాసితులపై సోమవారం తెల్లవారు జామున పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్‌ ‌పార్టీ మంగళవారం హుస్నాబాద్‌ ‌నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చింది.

భూ నిర్వాసితులకు మద్ధతుగా కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేతలు శ్రీరాంచక్రవర్తి, పద్మ తదితరులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, హుస్నాబాద్‌లో భూ నిర్వాసితులు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ‌క్యాంపు కార్యాలయం ముట్టడి సంఘటనలో కొందరు పోలీసులను టార్గెట్‌ ‌చేసి పైపులు, ఇతర పరికరాలతో దాడిచేసి కొట్టడం వల్ల హుస్నాబాద్‌ ఏసిపి సతీష్‌ ‌తలకు గాయమైందనీ పోలీస్‌ ‌వర్గాలు తెలిపారు. మొత్తంగా గత రెండ్రోజులుగా హుస్నాబాద్‌ ‌ప్రాంతం యుద్ధభూమిని తలపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంతో తెలియక హుస్నాబాద్‌ ‌ప్రాంతమంతా నివురుగప్పిన నిప్పులా ఉంది.

Leave a Reply