నాకేమో ఆకలి
అంతులేని ఆకలి
ఆ అపారమైన ఆకలిని
బడి మెట్లక్కి తీర్చుకునేందుకు యత్నిస్తూ
ఇంద్రధనస్సు రంగుల్ని కలగంటూ
ఆకలి మంటలు చల్లార్చుకుంటూ
ఆశల నిచ్చెనలు ఆకాశానికేస్తున్న క్షణాన
నా ఆకాంక్షల కాలరాస్తూ
కాలరేఖల ఆంక్షలు ..
లాక్ డౌన్ లు ,
స్కూల్ షట్ డౌన్ లూ…
ఆన్లైన్ క్లాసుల ఆచరణలూ..
విఫలమవుతూన్న నన్ను
నా బడి.., చిటారుకొమ్మన
మిఠాయి పొట్లంలాగా ఊరిస్తూ
నిన్నటివరకూ
గుట్టుగా కాలం వెళ్లమార్చిన నేను
కటిక చీకట్లో…
కొరోనా కాలంలో
ఆకలి తీర్చుకోవాలంటే
టీవీ, ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కడ తేగలను?
పాఠాలు ఎలా వినగలను?
ఇచ్చిన ప్రశ్నలకు జవాబులెలా ఇవ్వగలను?
అంతా అయోమయం ..
బడికిపోతే ఆ పూటైనా
నా కడుపు నింపేపని తప్పుతుందనే అమ్మ
పత్తి చేలో కలవబోతే
పదో పరకో చేతిలో పడతాయనే నాన్న
నలుగురు టీచర్ల నడుమ ఉంటే
మెదడుకు మేత దొరుకుతుందనుకునే నేను
బీజం వేసుకుంటూన్న నా ఆశలకు
మారాకులు తొడిగించే
ప్రయత్నం చేస్తుంటాను
కానీ, ఈ పరీక్షా సమయంలో
పొడుచుకొస్తున్న ప్రశ్నలకు
నా దగ్గర లేని
జవాబుకోసం అన్వేషిస్తూ ..
కాలం గీసిన అడ్డుగీతల్ని
సరిచేసుకునే క్రమంలో
టెలీ క్లాసులకోసం
పక్కింటి టివి దగ్గరకు పోతే
మన్నుదిన్నపాములాగా
పడివున్న మామ చూపులు
బొంతపురుగై నా ఒళ్ళంతా
ఆశగా నిమురుతున్నాయి
వాట్సాఅప్ క్లాసుల గురించి
పక్కింటి అన్నకు చెప్తె ..
దానిదేముందీ ..వాడుకో
నా ఫోన్ నీదేననుకో .. అన్నాడు
నా చేతిలో ఫోన్ చేసే చమత్కారాలు
అన్నీ ఇన్నీ కావని ఉబ్బితబ్బిబ్బవుతున్న వేళ
ఆయన్న పెట్టాడో మెలిక
బుక్కెడు బువ్వ కోసం వెతుకులాడే
మా అవ్వయ్యలు ఇవ్వలేని
ఫోన్ తానిస్తాడట ..
నా దగ్గరే ఎప్పటికీ ఉంచుకోవచ్చట
అదీ.. తాను చెప్పినట్లు చేస్తేనే
తానేమి చెబుతున్నాడో ..
తనకేమి కావాలని అడుగుతున్నాడో
ఆ చూపుల్లో అర్ధమయింది
నేనేం చెయ్యను ?
అతని ఆకలి తీర్చడమా ..
నా చదువాకలి తీర్చుకోవడమా ..?
తలకిందులై వేలాడదీస్తూన్న
జీవిత పాఠం
నా ముందో పెద్ద ప్రశ్న నిలిపింది.
– వి. శాంతి ప్రబోధ.