Take a fresh look at your lifestyle.

ఆకలి గీతం…

చమురు మంటలంటుకుంటున్నాయి.
చెమట చుక్కలు ధారలై పారంగ.
సెంచరీల వైపు పరుగులు తీస్తున్నాయి.
రెండు కాళ్ళ చక్రాలు ఊడి పడేలా.
నువ్వు గద్దెనెక్కించిన వారి చేతిలో
నువ్విప్పుడు బందీవి.
శిరం తెగిపోయి..రుధిరపు దారలు పారంగా..
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ
ప్రాణాలోదులుతున్న పిచ్చోడివి.

కడుపులో కాలే ఆకలి మంటలకంటే
నిత్యావసరాల మంటల్లో దహించుకు
పోతున్నావ్‌.
‌కరెన్సీ కట్టలు లేకపోతే కష్టాలే ఇపుడు.
పేద వాడు ఇపుడు సగం చచ్చిన శవం.
వాడి కంచంలో అన్నీ కష్టాల కన్నీళ్లే.
నాలుకు మెతుకులు నోట్లోకి వెళ్లాలంటే
వాడి జేబుకు చిల్లలు తప్పవు.
మల్లెపువ్వుల్లాంటి బుక్కెడు బువ్వ
వాడి ఉదరానికి చేరాలంటే
చెమట చుక్కలు నదిలా పారక తప్పదు.

పోటీపడి ఓటేసి నువ్వు నిర్మించుకున్న
ఈ జాతి వనంలో….
ఆకులన్ని రాలిపోయి
చెట్లన్నీ ఎండిపోయి
ధరల మంటల్లో దహించుకు పోతున్నాయి.

నీకిప్పుడు అండగా నిలిచేదెవరు…?
నీ గోడు వినేదేవరు…?
కార్పొరేట్లకు కార్పెట్లు పరిచి
నీ కడుపునే దోచే నయా జమాన ఇది.
నీ కన్నీళ్లతోనే కడుపు నింపుకో.
ఏ పేదోడి గుండెల్ని తవ్వినా…
అంతా శూన్యమే…చిక్కి పోయిన దేహమే.

వాళ్ళకిపుడు భవిష్యత్తుకు మార్గం
చూపేవారు కావాలి.
కొంచెం చేయ్యందించి ఒడ్డుకు
చేర్చే వారు కావాలి.
రూపమెరుగని ఆకలి మంటల్ని
ఆర్పేవారు కావాలి ఇపుడు.
– అశోక్‌ ‌గోనె, 9441317361

Leave a Reply