Take a fresh look at your lifestyle.

ఆకలి పాదం అడుగేసింది…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. తాజాగా మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది. పొట్టపోసుకునేందుకు వెళ్లిపోయిన వలస జీవులు కలో గంజో తాగి ప్రాణం నిలుపుకునేందుకు పుట్టిన ఊరిని వెదుక్కుంటూ పిల్లాజెల్లాతో వెనుదిరిగి వచ్చిన దుర్భర స్థితి అది. ప్రాణాల పెనుగులాటల మధ్య వలసల జీవితం ఊగిసలాడింది.

వర్ణనాతీతమైన వలస కార్మికుల జీవన దైన్యానికి కరోనా కాలంలో హృదయం ద్రవించేలా అక్షర రూపమిచ్చారు కొండూరి కోటిబాబు. దుఃఖపు జీరల్ని బ్రతుకు ధారలుగా మార్చుకునేందుకు వలస కార్మికులు పడ్డ వేదనకు కోటిబాబు కవిత్వం ప్రతిరూపంగా నిలిచింది.
ఆకలి పాదముద్రలు తారీఖుల ఆనవాళ్లంటూ అధునాతన అధ్యయన ముద్రలు వాటి గుర్తులేనని చెబుతారు. నడకకు ఆధముడు, అధికుడు లేడంటూ దుర్భర జీవన దుస్థితిని కోటిబాబు వెల్లడిస్తారు.

నెత్తిన మూట
కొంగున బిడ్డ
కడుపుల మంట
దారి పట్టిన పాదాల పగుళ్ల మందారాలు
వలసెల్లిన జన సంద్రాలు
అంటూ ఊరు కాలికెందూరమో అన్న వలస కార్మికుని ఆందోళనతో కూడిన ఆత్రుతను, భయాన్ని శోకరూపంగా వ్యక్తపరిచారు. కరోనా కల్లోలిత ప్రపంచంలో ప్రాణాన్ని కాపాడుకోవడానికి స్వీయ రక్షణే శిరోధార్యమంటారు. వందలు,వేలమైళ్లు నడిచి ఆవిరైన పాదానికి ఆపాయమో, ఆపదో తెలియదంటారు.
ఆకళ్లతో అలుపెరగని
పోరు సల్పు పాదచారుల
గమనంపై గుదిబండలా
గురిచూసిన కరోనాకు
ఆవిరైన పాదాలెన్నో
అని వేదన చెందారు.
ఆ పాదాలకెంత తెగింపు
ఆ పాదాల పటుత్వం ముందు
వజ్రాలు చిన్నబోవా
అంటూ పట్టుసడలని పాదాల నడకకు శిరసాభివందనం చేశారు. కరుణామృతమైన పాదాలకు రక్తమై అంటుకున్న నడక కష్టాలను హృదయద్రావకంగా కవిత్వీకరించారు. నిస్సహాయతల మధ్య ఆకలి ఆర్తనాదాలను ఘోషలుగా వినిపించారు. మనిషి బరువును మడిమలకెత్తుకున్న పాదాలు అంటూ కదిలించే పదప్రయోగం చేశారు.  పెరసిక్మలెత్తరో, మూతకి గుడ్డా లేకుండా వైద్యుని సెత్తరో/ ఆడ్ని బతికిచ్చి పంపుండ్రి, పసిపానం  సారూ, మందుబిల్ల సేదంటడు, నుదేస్తే గుక్కెడతడు అమ్మనొదిలి ఉండలేడని, కరోనా మహమ్మారికి బలైన పసిప్రాణాల హృదయ విధారక ఘోషను కన్నీటి దృశ్యంగా మలిచి చూపారు. మైళ్లు నడిస్తే పాదాల నొప్పుల సలపరాలతో ఏర్పడిన పెనుబొబ్బల పగుళ్లతో  రక్తస్రావం జరిగి కుతకుతలైన పాదాలు అంటూ వలస కార్మికుల చిత్రవదను వివరించారు. ఆద్రతతో  హృదయాన్ని తాకే విధంగా పదాల వినియోగం ఈ కవితల్లో కనిపిస్తుంది. ఎట్లుండో ఏందో బిడ్డ అనడంలో పేదపేగుల మమకారాపు ఆందోళనను శోధించి చూపించారు.

ఇంత కాఠిణ్యమా అని కరోనాను ప్రశ్నిస్తారు. మరుచూపును కూడా లేకుండా ముప్పు తెచ్చిన కరోనా అలజడిని నిరసించారు. దేశ చిత్రపటం వలస కార్మికుడి పాదంలా మారిపోయిందన్న వేదనను వ్యక్తం చేస్తారు. అంతు చిక్కని మాయాజాలమైన కరోనాకు ఎదురొడ్డి పోరాడాలంటారు. పేదల బతుకు చిత్రాన్ని కరోనా కర్కశం నేపథ్యంలో హృదయ ధ్రావంకంగా చిత్రించారు. వలసొచ్చిన ఓటరుకు రాజకీయ ఓదార్పుల తతంగాన్ని పాకులాడే ప్రయత్నాలన్నారు. కరోనా కాలంలో జనవేదన, ఉక్కిరి బిక్కిరి చేసిన పరిస్థితులను స్పష్టంగా చెప్పారు. ఖాళీ నడకన వేల కిలోమీటర్ల దూర భారాన్ని కాళ్లతో కొలుస్తూ పాదాలు అనుభవించిన చిత్రవధకు అక్షరరూపమిచ్చి మానవీయతను మేల్కొలిపే  ప్రయత్నం  చేశారు. తారుఖుల ఆనవాళ్లణ్నీ/ తరాలు నడిచిన ఆకలి పాదముద్రలే అంటూ ఆవిరైన పాదాలతో అంతమైనా బతుకులను స్మరిస్తారు. సామాన్యుడికి అందని వైద్యం ఏ ప్రయోజనాల కోసం అని పాలక వ్యవస్థను ప్రశ్నించారు. మంచోడో.. చెడ్డోడో ఎవరైతేనేం ప్రాణభీతి ఒక్కటే కాబట్టి ముప్పును తప్పించుకునేందుకు ధైర్యంగా అడుగేయడమే ముఖ్యమని తేల్చి చెబుతారు.

పరిస్థితులకు, పరిసరాలకూ స్పందించడం మనిషి నైజం. దృశ్యం మనసును మెలిపెడుతూ సంఘర్షణలా మారినపుడే మనసు భాష పట్టుతప్పి పటుత్వ పంధాను ఎన్నుకుంటుంది. మనసులో గోలపెడుతున్న గొంగళి సృజనాత్మక రంగులద్దుకున్న సీతాకోకచిలుకై రివ్వున ఎగిరి వస్తుంది… మన బాధ సమాజం పట్టించుకోకపోవొచ్చు కానీ సమాజం బాధలోకి మనం  పరకాయ ప్రవేశం చేసినప్పుడే మనదికాని భాష మనకు పులుముకుంటుంది. చాలా మందిలా లాక్డౌన్‌ ‌ప్రకటించాక వలసజీవులకు నా శక్తిమేర తోడ్పడుతూ… వారి జీవన స్థితిగతుల్లో ప్రత్యక్షంగా మమేకమైనపుడు పురుడోసుకున్న చిత్రవర్ణాలే ఈ ఆకలిపాదాలు అని కవి కోటిబాబు కవితల నేపథ్యాన్ని తన మాటల్లో  చెప్పుకున్నారు.జగత్తుకు పట్టిన కరోనా విపత్తు పాదం ఆత్మ ధైర్యపు నడక ముందు తప్పనిసరిగా ఓడిపోతుందన్న బలీయమైన నమ్మకాన్ని కోటిబాబు ఈ కవితల్లో ప్రబలంగా  వ్యక్తపరిచారు. బ్రతుకులో మంటపెట్టిన కరోనా కల్లోలాన్ని ఇల నుండే కాక కల నుండి కూడా తరిమికొట్టాలన్న ప్రజా బాహుళ్య సామూహిక సంకల్ప పిలుపును లోకానికి ఈ ఆకలి పాదాలు అందించాయి.
 – తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply