Take a fresh look at your lifestyle.

ఓజోన్‌ ‌పొర పరిరక్షణతోనే మనిషి మనుగడ

(16 సెప్టెంబర్‌ ‘అం‌తర్జాతీయ ఓజోన్‌ ‌పొర సంరక్షణ దినం‘ సందర్భంగా)

సూర్యరశ్మి లేకుండా ప్రాణి ఉనికి ఊహించలేము. ధరిణిపై సకల జీవకోటి సమస్తం సూర్యరశ్మి సహాయంతోనే మనుగడ సాగిస్తున్నాయి. సూర్యుడి నుండి వెలువడిన సూర్యరశ్మిలో ఉన్న ప్రమాదకర అతినీలలోహిత (యూవి) కిరణాలు నేలకు చేరితే ప్రాణుల ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి అతినీలలోహిత కిరణాలను భూమికి చేరకుండా ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షక పొరను ఓజోన్‌ ‌పొర అంటారు. సూర్యకాంతిలోని యూవి కిరణాలను నేలపైకి రాకుండా స్ట్రాటోవరణంలో గొడుగులా అడ్డుపడే ఓజోన్‌ ‌పొర వల్ల మాత్రమే సర్వప్రాణులు సురక్షితంగా భూమి మీద మనగలుగుతున్నాయి. ఓజోన్‌ ‌పొర సంరక్షించబడినంత కాలం ప్రాణులకు యూవి కిరణాలతో ఎలాంటి హాని ఉండదు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఆధునిక మనిషి చేస్తున్న వికృత చేష్టల వల్ల దినదినం ఓజోన్‌ ‌పొర పలుచబడుతూ, తరుగుతోంది. ఓజోన్‌ ‌పొర సన్నబడి రంధ్రం ఏర్పడితే, సూర్యకాంతితో పాటు యూవి కిరణాలు కూడా భూమికి చేరి మనుషులకు, వృక్షజంతుజాలాల మనుగడకు విఘాతం కలిగిస్తాయి. ఓజోన్‌ ‌పొర సంరక్షణతోనే సకల ప్రాణుల పరిరక్షణ జరుగుతుందనే వాస్తవాన్ని గమనించిన అంతర్జాతీయ సమాజం 1985లో వియన్నా సన్వెన్షన్‌లో 20కి పైగా దేశాలు ఓజోన్‌ ‌పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటూనే, ఓజోన్‌ ‌పొర పలుచబడటానికి కారణమైన రసాయనాల ఉత్పత్తులను మరియు వాడకాన్ని తగ్గించుటకు ఏకగ్రీవంగా అంగీకరించి తమ ఆమోదాన్ని తెలియజేశారు. ప్రపంచంలోని 197 దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు మరియు శాస్త్రజ్ఞుల సహకారంతో ఓజోన్‌ ‌పొర తరగడానికి కారణమైన దాదాపు 100 రసాయనాలను దశల వారీగా 99 శాతం తగ్గించాలని అంగీకరించి 16 సెప్టెంబర్‌ 1987 ‌రోజున ‘మాంట్రేయల్‌ ‌ప్రోటోకాల్‌’‌లో సంతకాలు చేసిన తరువాతనే కార్యాచరణ ప్రారంభమైంది. దీని ఆధారంగానే 1994లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం ప్రకారం ప్రతియేటా 16 సెప్టెంబర్‌ ‌రోజును ‘అంతర్జాతీయ ఓజోన్‌ ‌పొర పరిరక్షణ దినం’ పాటించాలని, పొర పరిరక్షణకు కఠిన చర్యలు సత్వరమే తీసుకోవాలని మరియు ఓజోన్‌ ‌పొర వినాశక రసాయనాలను నిషేధించాలని నిర్ణయించింది. భూవాతావరణంలోని గాలిలో ఉన్న ఓజోన్‌ ‌కాలుష్యకారిగా మరియు విషవాయువుగా ప్రాణులకు హాని చేస్తుంది. అదే ఓజోన్‌ ‌వాయువు స్ట్రాటోవరణంలో యూవి వికిరణాలను అడ్డుకొని భూమండల జీవరాశులను కాపాడే సత్కార్యం చేస్తుంది.

ఆక్సీజన్‌ ‌త్రిపరమాణుక అణువును ఓజోన్‌ (%%3) అని పిలువబడుతోంది. ఆక్సీజన్‌ ‌ద్విపరమాణుక అణువును ప్రాణవాయువు (%%2) ఆక్సీజన్‌గా పిలుస్తారు. భూమి ఉపరితలం నుండి 10 – 40 కిమీ దూరంలోని స్ట్రాటోవరణంలోనే 90 శాతం ఓజోన్‌ ‌పొర దాదాపు 20 కిమీ మందంతో సహజసిద్ధంగా ఏర్పడి ఉంటుంది. సూర్యరశ్మిలోని ప్రమాదకర యూవి వికిరణాలను శోషణం చేసుకొన్న ఆక్సీజన్‌ అణువులు ఓజోన్‌ అణువులుగా మరియు ఓజోన్‌ అణువులు కూడా యూవి వికిరణాలను గ్రహించి ఆక్సీజన్‌ అణువులుగా మరియు నవజాత ఆక్సీజన్‌ ‌పరమాణువుగా విడిపోతాయి. ఈ విధంగా ప్రమాదకర యూవి వికిరణాలను వాడుకుంటున్న ఓజోన్‌ ‌పొర వల్ల యూవి కిరణాలు నేలకు చేరకుండా ఓజోన్‌ ‌పొర వద్దనే ఆగిపోతాయి. మిగిలిన ప్రమాదరహిత మరియు ప్రాణహిత సూర్యకాంతిని మాత్రమే నేలకు చేరేలా జల్లెడలా లేదా గోడుగులా ఓజోన్‌ ‌పొర ఉపయోగపడుతుంది. ఓజోన్‌ ‌పొరను రసాయన చర్యతో నశింపచేయగల సామర్థ్యం మానవుడు కృత్రిమంగా సృష్టించిన హాలో కార్బన్లు అయిన క్లోరో ఫ్లోరో కార్బన్లు (సియఫ్‌సిలు), హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్లు (హెచ్‌సియఫ్‌సిలు), బ్రోమో కార్బన్లు మరియు గ్రీన్‌ ‌హౌజ్‌ ‌వాయు రసాయనాలకు ఉంటుంది.

అంతర్జాతీయ ఓజోన్‌ ‌పొర పరిరక్షణ దినం-2020 నినాదం ‘‘ప్రాణి కోసం ఓజోన్‌ – 35 ఏం‌డ్ల ఓజోన్‌ ‌పొర పరిరక్షణ (ఓజోన్‌ ‌ఫర్‌ ‌లైఫ్‌ – 35 ఇయర్స్ ఆఫ్‌ ఓజోన్‌ ‌లేయర్‌ ‌ప్రొటెక్షన్‌)’’‌గా తీసుకోబడింది. అంటార్కిటికాలో ‘ఓజోన్‌ ‌హోల్‌’ ఏర్పడిందని తెలిపిన షేర్‌వుడ్‌ ‌రౌలాండ్‌కు నోబెల్‌ ‌బహుమతి కూడా లభించింది. శీతలీకరణ మరియు ఏసీల పరిశ్రమలో సియఫ్‌సిలు మరియు హెచ్‌సియఫ్‌సిలను వాడడం జరుగుతోంది. ఈ ప్రమాదకర రసాయనాలు గాలిలోకి లీకైనపుడు స్ట్రాటోవరణం వద్దగల ఓజోన్‌ ‌పొరను రసాయన చర్య ద్వారా నశింపచేస్తూ, పొర పలుచబడేలా చేస్తుంది. ఓజోన్‌ ‌పొర పలుచబడిన ఫలితంగా ప్రమాదకర యూవి కిరణాలు నేలపైకి చేరి మానవులు (చర్మ కాన్సర్‌, ‌కంటి జబ్బులు, రోగనిరోధకశక్తిని తగ్గించుట), వృక్షాలు (పంటలు, హరిత క్షేత్రాలు) మరియు జంతువులకు హాని కలుగుతుంది. తాత్కాలిక సుఖాలకు అలవాటు పడిన మనిషి ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా శాశ్విత పతన దిశగా నడుచుకొని, తన గోతిని తానే తవ్వుకోవద్దు. విశ్వ మానవాళి ఓజోన్‌ ‌పొర ప్రాధాన్యతను తెలుసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఓజోన్‌ ‌పొర పలుచబడటానికి కారణమైన రసాయనాలకు దూరంగా ఉంటూ, మనిషితో పాటు సకల (వృక్ష జంతు) జీవరాశులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలన్నింటిని తీసుకోవాలని కోరుకుందాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply