జీహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న నేతలు, ర్యాలీలు, ప్రచార సభలలో పాల్గొంటున్న ప్రజలు కొరోనా నిబంధనలు పాటించకపోవడంపై మేధావులు, సామాజికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు బుధవారం మానవ హక్కుల వేదిక ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేవారు. వేదిక రెండు రాష్ట్రాల సమన్వయ కర్త ఎస్.జీవన్‌కుమార్, నగర శాఖ ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్ ఎన్నికల కమిషనర్ పార్థసారధికి వినతి పత్రం అందజేశారు.
ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు మాస్క్ ధరించకపోవడంతో పాటు, భౌతిక దూరం పాటించడం లేదనీ, గుంపులుగా ప్రచారంలో పాల్గొంటూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీతో పాటు అన్ని ప్రధాన
రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినట్లు కూడా బహిరంగ సమావేశాలు నిర్వహిస్తూ కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా కలుగజేసుకుని నిర్దిష్టమైన సూచనలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయాలు తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తగిన సూచనలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు మానవ హక్కుల వేదిక కార్యకర్తలు వెల్లడించారు.