దిశ రవి అక్రమ అరెస్టు ను ఖండించిన మానవ హక్కుల వేదిక
హైదరాబాద్: పర్యావరణ కార్యకర్త దిశరవి అక్రమ, చట్ట వ్యతిరేక అరెస్టు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దుష్ట చర్యలకు పరాకాష్ట.. ప్రభుత్వం ఎటువంటి విమర్శనైనా స్వీకరించడానికి సిద్ధంగా లేదు అని మానవ హక్కుల వేదిక గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది . “ఆమె అరెస్టు చట్ట విరుద్ధమే కాకుండా, ఆమెకు న్యాయ సహాయం అందకుండా చేయడం రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకం కూడా. ఆమెను అయిదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి, న్యాయవ్యవస్థలోని సూత్రాలను తుంగలో తొక్కాడు.
టూల్‌కిట్ మాద్యమాన్ని ఉపయోగిస్తుందని ఆరోపణ చేసి, బిజెపి ప్రభుత్వం న్యాయపరమైన హక్కుల కోసం ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది..”అని ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అధికారాల్ని వాడుకొని ప్రజలపైన, ఉద్యమకారులపైన చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది.
అరెస్టు చేసిన దిశరవిని విడుదల చేయాలని, అరెస్టు వారెంట్ జారీ చేసిన వ్యక్తుల అరెస్టులు మానుకోవాలని మానవ హక్కుల వేదిక సలహాదార్లు ఎస్.జీవన్‌కుమార్, వి.వసంతలక్ష్మి, అధ్యక్షులు మాధవరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతి, సభ్యుడు అమర్‌లు డిమాండ్ చేశారు.