రా ష్ట్ర ప్రజల పైన కొరోనా ఎఫెక్టు తీవ్రంగా పడుతున్నది. కొరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు ఇంటికే పరిమితమైన ప్రజలకు లాక్డౌన్ సవరించిన తర్వాత వాస్తవ కష్టాలేమిటో తెలుస్తున్నాయి.. ప్రభుత్వ ఉద్యోగులు మినహా నిత్యం కూలీనాలీ చేసుకునేవారు, ప్రైవేటు వ్యాపారస్తులంతా తమ రోజువారి ఆదాయాన్ని కోల్పోయిన విషయం తెలియందికాదు. ప్రభుత్వ ఉద్యోగులు, చివరకు పెన్షనర్లు కూడా ఈ లాక్డౌన్ అమలులోఉన్న మూడు నెలల కాలంలో తమ వేతనాల్లో సగం వేతనాలనే పొందారు. ఇలాంటి పరిస్థితిలో వారిప్పుడు పెద్ద ఆర్థిక సంక్షోభాన్నే చవిచూడాల్సి వొస్తున్నది. ఇండ్లు కట్టుకునేందుకు తీసుకున్న బ్యాంకు లేదా ప్రైవేటు అప్పులను చెల్లించడం పెను భారంగా మారింది. ఈ మూడు నెలల కాలంలో ఇంటి పన్నులను అడగని పాలకులు ఇప్పుడు నిలదీస్తున్నారు. ఇండ్ల కిరాయలను అప్పటికైతే అడగొద్దని ప్రభుత్వం చెప్పిందికాని, లాక్డౌన్ తొలగించిన తర్వాత ఇంటి యజమానులు నిలదీయకుండా ఎలా ఉంటారు. నెలనెల చెల్లించడమే గగనంగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అంతా తడిసి మోపడైంది. దానికి తోడు తాజాగా కరెంట్ షాకిస్తోంది. ఊహించని విధంగా కరెంటు ఛార్జీలు మీద పడుతుండడంతో అయోమయానికి గురి అవుతున్నారు. కొరోనా కారణంగా ప్రభుత్వాలే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేకపోయిన పరిస్థితిలో సాధారణ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఇలాంటి గడ్డు సరిస్థితిని ఎదుర్కుంటున్నారనడానికి లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకూడా ఇదే తీరుంది. ఈ విషయంలో ప్రభుత్వమే ప్రజలను ఆదుకోవాలని అప్పుడే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మన పక్క రాష్ట్రమైన ఏపి లో అక్కడి ప్రతిపక్షాలు ఇలాంటి డిమాండ్‌నే ప్రభుత్వం దృష్టికి తీసుకు వొస్తున్నారు.
ఈ విషయమై తెలంగాణ కాంగ్రెసైతే ఆందోళన బాటపడుతున్నది.
ప్రధానంగా నిరుపేదలు, మద్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కనీసం ఆరునెల నుండి సంవత్సరంపాటు వారి ఇంటి కిరాయిలను ప్రభుత్వమే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇఎంఐ లనుకూడా ప్రభుత్వమే చెల్లించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని వొత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇటీవల విద్యుత్ బిల్లుల చెల్లించని పక్షంలో వారికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కరాఖండీగా ప్రభుత్వం చెప్పడాన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణ ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న పాలకులు కరెంటు బిల్లులను మాఫీ ఎందుకు చేయరని వారు ప్రశ్నిస్తున్నారు. తాము చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం సత్వరం స్పందించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని కాంగ్రెస్ హెచ్చరిస్తుంటే, ఏపిలో కూడా అక్కడి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఇలాంటి డిమాండ్‌నే ప్రభుత్వం ముందుపెట్టింది. అయితే విద్యుత్ బిల్లులను చెల్లించాల్సిందే నంటోన్న తెలంగాణ సర్కార్. దానిపై వేసిన వడ్డీనికూడా చెల్లించాల్సిందే నంటోంది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నందుకే బిల్లుల చెల్లింపులో వాయిదా పద్దతినికూడా ప్రవేశపట్టామంటోంది.
మూడు నాలుగు నెలలుగా చెల్లించనివారు మూడు వాయిదాలో బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సిందేనంటోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కరెంటు బిల్లులు కూడా అబ్నార్మల్గా రావడంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ బాధ ఎంఎల్ఏలకు కూడా తప్పలేదు. తుంగతుర్తి ఎంఎల్ఏకు సాధారణంగా ప్రతి నెల రెండు వేల చిల్లర బిల్లువొచ్చేది. కాని, ఈసారి మూడు నెలలకు కలిపి పద్దెనిమి వేల పైచిలుకు రావడంపట్ల ఆయన విస్యయం వ్యక్తం చేస్తున్నాడు. అయితే తమ లెక్కల ప్రకారం అది సరైన బిల్లేనని అధికారులు తేల్చేసినప్పటికీ ఎంఎల్ఏను మాత్రం ఆ బిల్లు అదరగొట్టింది. ఒక ఎంఎల్ఏ పరిస్థితే ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుంది. కనీసం వారికి ఎవరు సమాధానం చెబుతారు. ఈ తప్పుల తడక బిల్లుల జారీపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలైనాయి. విద్యుత్‌శాఖ కోరిక మేరకు చాలామంది కంజ్యుమర్స్ ఆన్లైన్లో బిల్లులు చెల్లించారు. అయితే ఇప్పుడు బిల్లు రీడింగ్‌కు వొస్తున్న సిబ్బంది మూడు నెలల రీడింగ్ ఒకేసారి వేయడంతో వినియోగదారుల గుండెలు అవిసిపోతున్నాయి. తాము చెల్లించిన మొత్తాన్ని ముందుగా తీసివేసి బిల్లు ఇస్తే ఈ బాధలు ఉండేవికావంటున్నారు వినియోగదారులు. మూడు నెలల రీడింగ్ ఒకేసారి తీయడంతో స్లాబ్ రేటు పెరుగుతుందంటున్నారు. దీనికి లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన వినియోగదారులు టివి, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఎక్కువ వాడకం కావడంవల్లే బిల్లులు పెరిగి ఉంటాయని సమాధానం చెబుతున్నారు విద్యుత్‌శాఖ అధికారులు. సాధారణ రోజులతో పోలిస్తే వేసవిలో 30నుండి 40 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుంది. లాక్డౌన్ కారణంగా మరో 15 నుండి 20 శాతం వినియోగం పెరిగిందంటున్నారు. ఏది ఏమైనా ఆదాయం సంగతి పక్కకు పెడితే అనేక రకాలైన చెల్లింపులు ఒకేసారి చుట్టుముట్టడంతో ప్రజలకిప్పుడు తలభారమైంది.