Take a fresh look at your lifestyle.

నిండు కుండలా నిధులు.. కోవిడ్‌ ‌పేరిట తలపై అప్పు ముప్పు

పారదర్శకత లోపించిన పిఎం కేర్స్ ‌నిధులు
ఆర్టిఐ ఆవిష్కరించిన అక్షర సత్యం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ: కోవిడ్‌ 19‌తో భారతదేశ ఆర్థిక పరిస్థితి కోరి కొరివితో తల గోక్కున్నట్లయిందంటున్నారు మన ఆర్థిక నిపుణులు. కోవిడ్‌ ‌పేరిట ప్రధాని దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేసారా ? ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన 20 వేల కోట్ల కోవిడ్‌ -19 ‌ప్యాకేజీ పూర్తిగా అంతర్జాతీయ రుణాల వల్ల సమకూరిందని సమాచారహక్కు చట్టం ద్వారా వెల్లడైంది. పాత్రికేయుడు సౌరవ్‌ ‌దాస్‌ ‌దాఖలు చేసిన దరఖాస్తుకు ఆర్టీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. పిఎం కేర్స్‌లో భారీగా నిధులు అందుబాటులో ఉన్నా మోదీ ప్రభుత్వం తలకు మించి చేసిన అప్పులు తీర్చలేక దేశం మరింత దారిద్య్రంలోకి కూరుకుపోతుందని ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

కోవిడ్‌ 19 ‌నుంచి ఎదురయ్యే పరిస్థితి నెదుర్కొనడానికి పరిష్కరించడానికి పిఎం కేర్స్ ‌పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు 2020 మార్చి 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పిఎం కేర్స్ ‌లేదా ప్రైమ్‌ ‌మినిస్టర్‌ ‌సిటిజెన్‌ అసిస్టెన్స్ అం‌డ్‌ ‌రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ‌ఫండ్‌ (‌ప్రధాని జాతీయ సహాయ నిధి) ఉండగా ఈ ప్రత్యేక నిధి ఎందుకు కేంద్రం ప్రకటించిందో నేటికీ అంతు పట్టని విషయం. ఈ నిధి అంశంలో పారదర్శకత లేదు. పిఎం – కేర్స్ ‌ఫండ్‌ను సమాచార హక్కు(ఆర్టిఐ) చట్టం పరిధిలోకి తీసుకురావాలని, భారత కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌(‌సిఎజి) పిఎం-కేర్స్ ‌నిధిని ఆడిట్‌ ‌చేయడానికి అనుమతి ఇవ్వాలని అనేక మంది మేధావులు కోరుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉంది. పిఎం- కేర్స్ ‌నిధి వినియోగంలో పారదర్శకతకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తున్నదని పౌర సమాజ కార్యకర్తలు, పౌర సమాజ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రధానమంత్రి నేతృత్వంలోని ట్రస్ట్ ఈ ‌పిఎం-కేర్స్ ‌నిధి నిర్వహిస్తున్నది. కార్పొరేట్‌ ‌కంపెనీల నుండి అందే కార్పొరేట్‌ ‌సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) ‌నిధులు పిఎం-కేర్స్‌కు మళ్లించారు. విరాళాలిచ్చే వారికి 100శాతం పన్ను నుంచి, విదేశీ సహాయ నియంత్రణ చట్టం(ఎఫ్‌సిఆర్‌ఎ) ‌నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు. అంతే కాక ప్రభుత్వ రంగ సంస్థల నుండి భారీ మొత్తంలో విరాళాలను పిఎం-కేర్స్ ‌నిధికి సేకరించారు. నిధి సేకరణకు ప్రభుత్వ యంత్రాంగాలను నిర్లజ్జగా ఉపయోగించారు. విదేశీ విరాళాలను పిఎం-కేర్స్ ‌నిధికి ఆకర్షించేందుకు విస్తృత ప్రచారం చేయాలని మోదీ వ్యక్తిగతంగా మార్చి 30న విదేశాలలో ఉన్న 130 భారతీయ సంస్థలకు చెప్పారు.

ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి, ఇతరత్రా అత్యవసర పరిస్థితులలో ఆదుకునేందుకు, మానవ కారక, సహజ విపత్తు సమయంలో అత్యవసర సదుపాయాల సౌకర్యాల కల్పన, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు, తదితర పరిశోధనలకు పిఎం కేర్స్ ‌నిధులు ఉపయోగించాలన్నది లక్ష్యం. వైపరిత్యాల బాధితులకు సాయం చేసే ధర్మకర్తల మండలి అవసరమని భావిస్తే ఈ నిధి ఉపయోగించాలి. ఇంతేకాక, భిన్నమైన అత్యవసర కార్యకలాపాలు చేపట్టేందుకు నిధి ఉపయోగించాలి.

ఈ లక్ష్యాలతో మార్చి 28న ఏర్పాటైన పిఎం కేర్స్ ‌నిధికి నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, వివిధ వర్గాల నుండి 3076 కోట్ల నిధి సమకూరింది. మే 20 నాటి ఇండియా స్పెండ్‌ ‌నివేదిక ప్రకారం న్యూస్‌ ‌పేపర్లు ట్విట్టర్‌ అకౌంట్లలో లభించిన బహిరంగ సమాచారం ప్రకారం పిఎం కేర్స్ ‌నిధికి సుమారు 9677 కోట్లు(1.27 బిలియన్‌ ‌డాలర్లు) విరాళాలు సమకూరాయి. మే 20 తేదీ నాటికి అదనంగా 2098 కోట్లు కూడా సమకూర్చు కుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిధి నుంచి ఎంత ఖర్చయింది తెలీదు. విరాళాలు వచ్చిన స్థాయిలో ఖర్చు లేదన్నది వాస్తవం అంటున్నారు.

అయితే, ఆరు నెలల్లో, వలస కార్మికుల సంరక్షణ కింద 1000 కోట్లు, మేడ్‌ ఇన్‌ ఇం‌డియా 50వేల వెంటిలేటర్ల తయారీకి 2000 కోట్లు, వ్యాక్సిన్‌ అభివృద్ధికి 100 కోట్లు పిఎం కేర్స్ ‌నుంచి విడుదలయింది. మొత్తం లెక్క చూస్తే ఖర్చు అయింది కేవలం 3100 కోట్లు మాత్రమే. ఇది కూడా వివాదాస్పదమే. వాషింగ్టన్‌ ‌పోస్ట్‌లో ఇటీవల ఆర్టీఐ ఆధారిత నివేదిక ప్రకారం వచ్చిన నివేదికలో 10,000 వెంటిలేటర్లను తయారుచేయడానికి చెన్నైకి చెందిన ట్రివిట్రాన్‌ ‌హెల్త్‌కేర్‌ ‌వైద్య సాంకేతిక సంస్థకు పిఎం కేర్స్ ‌ఫండ్‌ ‌నుండి 373 కోట్లు అందించారని పేర్కొన్నారు. అసలు ఈ సంస్థకు వెంటిలేటర్ల తయారీ అనుభవం లేదు. ఏప్రిల్‌ 22‌న కేంద్ర ప్రభుత్వం ‘‘ఇండియా కోవిడ్‌ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అం‌డ్‌ ‌హెల్త్ ‌సిస్టమ్‌ ‌ప్రిపరేషన్‌నెస్‌ ‌ప్యాకేజీ’’ అంటూ 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

ఈ ప్యాకేజీ లక్ష్యాలు గమనిస్తే…
నెమ్మదిగా కోవిడ్‌ -19 ‌విస్తరణ నిలువరించడం, ప్రజల అత్యవసర అవసరాలకి ప్రతిస్పందించటం, దేశంలో డయాగ్నస్టిక్స్ ‌కోవిడ్‌ -19ఎదుర్కొనేందుకు అంకితమైన చికిత్సా సౌకర్యాలు అభివృద్ధి చేయటం, అవసరమైన వైద్య పరికరాలు సిద్ధంచేసుకోడం, కొరోనా సోకిన రోగులకు అవసరమైన మందులు సేకరించడం, భవిష్యత్తులో కొరోనా వ్యాప్తి నిరోధానికి తోడ్పడే జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రయోగశాలల ఏర్పాటు, బయో సెక్యూరిటీ సంసిద్ధత, మహమ్మారిపై పరిశోధన, రిస్క్ ‌కమ్యూనికేషన్‌ ‌కార్యకలాపాలను నిర్వహించడం.

ఈ లక్ష్యాలకు పిఎం కేర్స్ ‌ఫండ్‌ ‌లక్ష్యాలకు సారూప్యత ఉన్నా, ఫండ్స్ ‌నిధిలో లెక్కకు మించి నిలవ ఉన్నప్పటికీ, ప్రభుత్వం 20 వేల కోట్లను మూడు అంతర్జాతీయ బ్యాంకుల నుండి దీర్ఘకాలిక ప్రాతిపదికన రుణంగా తీసుకుంది. జర్నలిస్ట్ ‌సౌరవ్‌ ‌దాస్‌ ఆర్టీఐకి దాఖలు చేసిన అర్జీకి సమాధానంగా అందిన సమాచారం ప్రకారం, ఇంటర్నేషనల్‌ ‌బ్యాంక్‌ ‌ఫర్‌ ‌రీకన్‌‌స్ట్రక్షన్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌(ఐబిఆర్‌డి) 1000 యుఎస్‌ ‌మిలియన్‌ ‌డాలర్లు అప్పు మంజూరు చేసి 502.50 యూస్‌ ‌మిలియన్‌ ‌డాలర్లు విడుదల చేసింది. ఆసియన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌బ్యాంక్‌(ఎడిబి) 500 యుఎస్‌ ‌మిలియన్‌ ‌డాలర్లు అప్పుగా భారత్‌కి ఇచ్చింది. ఆసియన్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌బ్యాంక్‌ 2000 ‌యుఎస్‌ ‌మిలియన్‌ ‌డాలర్ల అప్పు మంజూరు చేసి 1252.50 మిలియన్‌ ‌డాలర్లు విడుదల చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్‌ ‌నాయక్‌ ‌జర్నలిస్ట్ ‌సౌరవ్‌ ‌దాస్‌ ‌దాఖలు చేసిన ఆర్టీఐకి సమాధానంగా ఈ సమాచారమిచ్చారు.

Leave a Reply