Take a fresh look at your lifestyle.

ఆంద్ర ప్రదేశ్ లో కొరోనా ఆందోళన ..!

దేశంలో అత్యధిక టెస్ట్ లు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య అతివేగంగా పెరగడంలో కూడా ముందుంది. పవిత్ర తిరుమల క్షేత్రాన్ని కూడా కొరోనా వైరస్ వదిలి పెట్టలేదు. తిరుమలలో మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాస మూర్తి దీక్షితులు గడిచిన కొన్ని రోజులుగా కొరోనా వైరస్ కు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన వృద్ధాప్యం పై బడిన కారణంగా చికిత్స అందించినా ఫలితం దక్కలేదని అంటున్నారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో రోజుకు కనీసం వెయ్యి కేసులు తక్కువ కాకుండా నమోదు అవుతున్నాయి. పరీక్షల సంఖ్య రాష్ట్రంలో ఇప్పటికే పది లక్షలు దాటి పోయింది. రాష్ట్ర్లంలోని జిల్లా హాస్పిటల్స్ అన్నింటిని కోవిడ్-19 కేంద్రాలుగా గా మార్చి వేశారు. మొదట్లో కొరోనా కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా వెనక ఉండేది.ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అయితే, తెలంగాణలో పరీక్షలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఇలా జరుగుతోందంటున్నారు. ఇందుకు తెలంగాణ హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. హైకోర్టు సూచనల మేరకు కొరోనా పరీక్షల వివరాలనూ, రోగుల వివరాలను కోర్టుకు సమర్పించడం లేదని హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.అంతేకాక,ఇదే ఆఖరి సారి అని కూడా హెచ్చరించింది.

మరో వంక ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అగ్రస్థానంలో ఉందని మీడియా వార్తలు వొస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఇటీవల బాగా పెరగడానికి కొరోనా వైరస్ సమాజంలోకి లోలోతుగా చొచ్చుకుని పోయిందా అనే అనుమానం, భయాందోళనలు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోజువారీ సమీక్షలు జరుపుతూ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్యం అందని వారి కోసం 104 వాహనాలను కొత్తగా కొనుగోలు చేసి ప్రవేశపెట్టారు. అయితే, ఇతర దేశాల నుంచి వొస్తున్న వారి వల్ల ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య పెరుగుతోందన్న వాదం వాస్తవానికి దగ్గరగానే ఉంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్ళిన రాష్ట్రానికి చెందిన వారు తిరిగి వెనక్కి వొస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోందన్న వాదన కూడా సహేతుకమైనదే. రాష్ట్రంలో అన్ లాక్ కి ముందు పరిస్థితి అదుపులోనే ఉంది. అన్ లాక్ సమయంలో లభించిన స్వేచ్ఛను ప్రజలు దుర్వినియోగ పర్చుకోవడం కారణంగా కూడా కేసులు పెరిగాయి. అంతేకాక, పెళ్ళిళ్ళు, ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలను వైరస్ వ్యాప్తి ముందు నాటి పరిస్థితులలో లాగ స్వేచ్ఛగా, విశృంఖలంగా జరుపుతుండటం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వలంటీర్ల వ్యవస్థ బాగానే పని చేస్తోంది. అయితే, రాష్ట్రంలో పొరుగు దేశాల తాకిడి, పొరుగు రాష్ట్రాల తాకిడి కారణంగా కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. తెలంగాణ ,ఆంధ్ర సరిహద్దుల్లో వాహనాల తనిఖీ చాలా పకడ్బందీగా సాగుతోంది.

గరికిపాడు వద్ద వందలాది వాహనాలు వేచి ఉంటున్న దృశ్యాలు నిరంతర వార్తా స్రవంతుల్లో దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయిల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని రోడ్డు రోలర్ల కింద తొక్కిస్తున్నారు. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఎందుకు జరుగుతోందనే దానిపై అధికార యంత్రాంగం దృష్టిని కేంద్రీకరించింది. తిరుపతిలో దర్శనాలకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడ వైరస్ వ్యాప్తి పెరిగింది. తిరుమలలో కూడా పరీక్షలు, తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వొచ్చిన భక్తుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. నిబంధనల సడలింపులు ఒక సారి జరిగితే, ఇక అడ్డు అదుపు లేకుండా అదే పనిగా సాగుతుండటం మన వ్యవస్థలో సహజ లక్షణం. తిరుమలకు వొచ్చే యాత్రికులకు ఎన్ని పరీక్షలు జరిపినా వైరస్ వ్యాప్తి కారణంగానే అర్చకులు సైతం కొరోనా పోజిటివ్ కు గురవుతున్నారు. అలాగే, గల్ఫ్ లో ఉపాధికి వెళ్ళిన వారు రాయలసీమ, ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ మంది ఉన్నారు. వారంతా తిరిగి వొస్తున్న కారణంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. కువైట్ నుంచి నాలుగువేల మంది తిరిగి వొస్తున్నారన్న వార్తలు రాగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే, ముందస్తు సమాచారం ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం ఏమరు పాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.అయితే, అనధికారికంగా వొచ్చే వారి వల్లే ఈ వైరస్ ఎక్కువ సోకుతోంది.

వైరస్ వ్యాప్తి ప్రారంభంలో ఒక్క లాబ్ మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జిల్లాకో లాబ్ చొప్పున పని చేస్తున్నాయి. మందులకు, కిట్లకు లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పని తీరును ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిలో ప్రభుత్వానికి సహకరించడానికి బదులు ప్రధాన ప్రతిపక్షం తన ఏకైక ఎజెండా అయిన అమరావతిపైనా , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిపైనా దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్రంలో సిపిఐ, బీజేపీ వంటి ఇతర పార్టీలు కూడా తెలుగుదేశం అజెండాతోనే పని చేస్తున్నాయి. కాంగ్రెస్ ఇదివరకే కనుమరుగు అయింది. ఎన్ని పరీక్షలు చేస్తున్నా, వైరస్ వేగంగా వ్యాపిస్తోందంటే ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ కేసులు పెరిగేందుకు సామూహిక వ్యాప్తికి తెరవెనుక యత్నాలు సాగుతున్నాయేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్ర నాయకత్వాన్ని ఇతర విధానాల్లో ఎదుర్కోవడంలో విఫలమైన ప్రతిపక్షాలు కొరోనాను అస్త్రంగా ఎంచుకున్నాయేమోనన్న అనుమానం క్రమక్రమంగా ఎల్లెడలా వ్యాపిస్తోంది. పరీక్షలు పదింతలుగా జరుగుతున్నా, కట్టుదిట్టంగా వ్యాధినిరోధక చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడాన్ని సీరియస్ గా తీసుకోవల్సిందే.

Leave a Reply