- తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు
- ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది
- 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్ మంతర్ వద్ద దీక్ష
- ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు
- రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు
- రాష్ట్రం మరో శ్రీలంక, పాకిస్తాన్ అయ్యే ప్రమాదం ఉంది
- ఉద్యమం పేరుతో గద్దెనెక్కిన కెసిఆర్ తెలంగాణను మర్చిపోయాడు
- గ్రామపంచాయతీ నిధులు కూడా మళ్లిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది?
- తెలంగాణ సంపద కెసిఆర్ కుటుంబ ఆస్తిగా మార్చుకున్నారు
- ఖమ్మం బిఆర్ఎస్ సభకు గ్రామాలకు కరెంటు తీసేసి బస్సులు పెట్టి తరలించారు
- విద్య, ఉపాధి ఎది లేకుండా తెలంగాణ విల విలలాడుతుంది
- మీడియాతో తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్
- ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించిన కోదండరామ్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19 : సిఎం కెసిఆర్ బీఆర్ఎస్ ఖమ్మం సభలో జై తెలంగాణ అనడానికి సిగ్గుపడటం విషాదకరం అని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏ.కోదండరాం అన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై డిల్లీలో దీక్ష చేపట్టి పోరాడుతామని, 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఖమ్మంలో సిఎం కేసీఆర్ మాట్లాడిన తీరు అద్దాల వెనుక ఉన్న మిఠాయిళ్లా ఉన్నాయని కోదండరాం విమర్శించారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో కేసీఆర్ కు అధికారం కట్టబెడితే బీఆర్ఎస్ సభలో కనీసం జై తెలంగాణ అని పలక లేకపోవడం నిజంగా విషాదకరం అని మండిపడ్డారు.
తెలంగాణ పేరు ఎత్తడానికే సిగ్గుపడితే రేపు తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తారని నిలదీశారు. కేసీఆర్ మాటలకు రాష్ట్రంలోని పరిస్థితులకు వైరుధ్యం ఉందని ధ్వజమెత్తారు. దేశంలో విస్తారమైన జల సంపద ఉన్నా సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శిస్తున్న కేసీఆర్ కృష్ణా నదిపై ప్రాజెక్టులు పెండింగ్ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం పచ్చి అబద్దం అన్నారు. ఈ ప్రాజెక్టులో కట్టలు మాత్రమే పూర్తయ్యాయని కాలువలు ఇంకా పూర్తి కాలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా అవి కాళేశ్వరం నీళ్లు అని చెప్పడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అప్పుల పాలైన రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ దేశంలో ఏం పరిపాలిస్తారని ప్రశ్నించారు. పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, కేసీఆర్ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు.
ప్రైవేటుకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం ప్రైవేటుపరం చేసింది నిజం కాదా? అని కోదండరాం ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, విద్యా, వైద్యం, సింగరేణి ప్రైవేటు అయ్యిందని ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. ఖమ్మం సభలో కేసిఆర్ మాటలు అద్దాల మేడ చేతికి అందదు అన్నట్లు ఉందని ఇద్దేవా చేశారు. ఖమ్మం సభ మొత్తంలో జై తెలంగాణ అనే నినాదం కూడా లేకుండా నిర్వహించారని అన్నారు. రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని అన్నారు. ఇలానే అప్పులు చేస్తే రాష్ట్రం, మరో శ్రీలంక, పాకిస్తాన్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. విచ్చల విడిగా పేదల భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల కు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్ళిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాలకు అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ సంపద కెసిఆర్ కుటుంబ ఆస్తిగా మార్చుకున్నారని మండి పడ్డారు. విద్య, ఉపాధి ఎది లేకుండా తెలంగాణ విల విలలాడుతున్నదని అన్నారు. కేసిఆర్ నాటకాలు ప్రజలకు నమ్మరు, వాటిని మేము ప్రజలకు అర్థం అయ్యే విధంగా వివరిస్తాం అని అన్నారు. ఖమ్మం బిఆర్ఎస్ సభకు గ్రామాలకు కరెంటు తీసేసి బస్సులు పెట్టీ తరలించి నిర్వహించారని అన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ గద్దెనెక్కి తెలంగాణను మర్చిపోయాడని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ నిర్ణయించి, విడివిడిగా నిర్వహించుకుందామని ఇందుకు అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కలసి రావాలని కోరారు.