Take a fresh look at your lifestyle.

తెలంగాణపై ప్రధానికి ఎలా లేఖ రాస్తారు: మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి

  • తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్‌
  • ‌మండిపడ్డ మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి
  • ఉమ్మడి ఎపిలో ఆనాటి సిఎంలు ఇచ్చిన జీవోలు ఉత్తుత్తివేనా? : మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌

ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌పై రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తుందని, ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందని ప్రధాని మోదీకి జగన్‌ ‌లేఖ రాయడాన్ని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి తప్పుబట్టారు. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్‌ ‌జగన్‌ అని కోపోద్రిక్తులయ్యారు. మద్రాస్‌కు మంచినీటి పేరుతో వైఎస్సార్‌ ‌కృష్ణా నీళ్లను దోచుకున్నారు. సాగర్‌ ఎడమ కాల్వ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహం చేశారని మండిపడ్డారు. దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ‌గేట్లు తెరిపించి.. తెలంగాణ రైతులకు అన్యాయం చేశారు.

ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతే ఊరుకునేది లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది జల విద్యుత్‌ ఉత్పత్తి కోసమేనని, చట్టపరంగా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుందన్నారు. తప్పు చేసిన వారే లేఖల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఇక ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడంపై ఆయన వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంతో ఏపి ప్రభుత్వం ఏమైనా అంతర్గత ఒప్పందం కుదుర్చుకుందా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణాబేసిన్‌ అవసరాలు తీరకుండానే…పెన్నాకు తీసుకుళ్లేందుకు ఏపి ప్రయత్నాలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఎపిలో ఆనాటి సిఎంలు ఇచ్చిన జీవోలు ఉత్తుత్తివేనా? : మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌
అ‌క్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు నుంచి..ఏపీ సీఎం జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్‌, ‌కిరణ్‌, ‌రోశయ్య ఇచ్చినవి ఉత్తుత్తి జీవోలేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమం ఎలా అవుతాయని మంత్రి అన్నారు. తాము నిబంధనలు అతిక్రమించలేదని, జీవోల ప్రకారమే నదీ జలాలను వినియోగిస్తున్నామన్నారు. దీనిపై ఏపీ వితండవాదన చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం కూడా తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో న్యాయస్థానంలో పోరాటం చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం మంత్రి మరోమారు మిడియాతో మాట్లాడుతూ బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌కేటాయింపులు చేయక ముందే.. కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఎలా కోరుతుందని ప్రశ్నించారు. కేంద్రంతో ఏదైనా ఒప్పందం ఉందా? అని నిలదీశారు.

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఎపి దోచుకుంటుందని శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఆరోపించారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఎపి ప్రభుత్వం కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఎపి ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు. నీటి పంపకాల్లో కేంద్రం కూడా వివక్ష చూపుతుందన్నారు. గతంలో ఉమ్మడి ఎపి సిఎంలు ఇచ్చిన జిఒలను సిఎం కెసిఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎక్కువగా ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీటి అవసరాలు తీరుతున్నాయని వెల్లడించారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే నీటిని పెన్నాకు తీసుకెళ్లేందుకు ఎపి అధికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

జలవివాదాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్‌ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని కొంత మంది ఎపి నేతలు మాట్లాడుతున్నారని, వారు ఒకప్పుడు సెటిలర్స్ ‌కావొచ్చేమో కానీ ఇప్పుడు కాదని ఆయన అన్నారు. వారంతా తెలంగాణకు చెందినవారేనని, వారికి ఇప్పటికీ సెటిలర్స్ అనే ముద్ర మిరే వేస్తున్నారని పేర్కొన్నారు. వారు ఎప్పటికీ తమ వారేనని తెలిపారు. ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం నీటి కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగించుకుంటుందని అన్నారు. అంతర్జాతీయ నీటి చట్టాల ప్రకారం ఏక్కడైనా నది క్యాచ్‌మెంట్‌ ఏరియాను బట్టి నీటి కేటాయింపులు ఉంటాయని అన్నారు. ఈ చట్టాల ప్రకారం తెలంగాణలో 68 శాతం ఉంటే తాము వాడుకునేది 34 శాతం అని, అదే ఆంధప్రదేశ్‌లో 32 శాతం క్యాచ్‌మెంట్‌ ఏరియా ఉంటే 64 శాతం నిటీని వాడుకుంటున్నారని అన్నారు.

Leave a Reply