Take a fresh look at your lifestyle.

సోయి ఉండకపోతే ఎలా..!

ప్రపంచాన్నంతా గడగడ లాడిస్తూ, వేలసంఖ్యలో ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ ‌తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంటే, దానికి విరుగుడుగా ప్రభుత్వం సూచనలను పాటించాలన్న సోయి లేకపోవడంపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేలకుపైగా జనం కరోనా వైరస్‌ ‌కారణంగా మృత్యు వడిలోకి జారుకోగా, ఇంకా వివిధ దేశాల్లో విస్తృతంగా ఈ వైరస్‌ ‌చొచ్చుకుపోతున్నది. భారతదేశంలో కూడా ఇప్పటివరకు ఎనిమిది మందిని ఈ వైరస్‌ ‌కబళించింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర నివారణ చర్యలు చేపట్టాయి. దీనిపై తగిన సూచనలు, వైద్యసేవలతోపాటు కోట్లాదిరూపాయలను వెచ్చించేందుకు ఈ ప్రభుత్వాలు సిద్ధపడ్డాయి. ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తున్న ఈ చైన్‌ ‌సిస్టం వ్యాధిని తుంచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారమిచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు దేశ వ్యాప్తంగా విజయవంతమైంది. అందులో తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన స్వీయనియంత్రణ కేంద్ర ప్రభుత్వ ప్రశంసల నందుకుంది. అయితే ఈనెల 31వరకు ఇలాంటి స్వీయనియంత్రణనే పాటించాలన్న పిలుపునుమాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరం.

ప్రపంచంలోని దాదాపు రెండు వందల దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి మన దేశంలోకూడా రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రమాద ఘంటికలను మోగిస్తున్న వివిద రాష్ట్రాలకు చెందిన దాదాపు ఎనభై జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అందులో తెలంగాణకు చెందిన అయిదు జిల్లాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనతోపాటు వ్యాధి వ్యాప్తి నిరోధానికి సంబంధించి తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నప్పటికీ, సంపూర్ణంగా లాక్‌డౌన్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్రాలు కేవలం పందొమ్మిది మాత్రమే ఉండడం చూస్తుంటే మిగతా రాష్ట్రాల ప్రజలకు ఈ విషయంలో సోయిలేదనే అనుకోకతప్పదు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జనతాకర్ఫ్యూకు అదనంగా మరో పదిగంటలను జోడించి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు కర్ఫ్యూ కొనసాగేలాగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును విజయవంతంచేసిన ప్రజలు ఆ తర్వాత దాన్ని ఉల్లంఘించడంపట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియసైంది. నిత్యావసర సరుకులు, ఎమర్జెన్సీ అవసరాల దృష్ట్యా ఇచ్చిన వెసులుబాటు సమయాన్ని వృథాచేస్తూ విస్తృత కార్యక్రమాలకు వాడుకోవడంతో తెలంగాణ సర్కార్‌ ‌కఠిన హెచ్చరికలు చేసింది. అత్యవసరం లేదా నిత్యావసర సరుకులకు తప్ప మరే ఇతర పనిపెట్టుకుని బయట తిరిగితే వారిపై కేసులు నమోదుచేస్తామని ప్రభుత్వం హెచ్చరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయినప్పటికీ అధికారులు, పోలీసుల కండ్లుకప్పి విజయవాడ నుండి కొందరు ప్యాసింజర్లను మూడు అంబులెన్స్ ‌వ్యాన్‌లలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా సూర్యాపేటవద్ద పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్లలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి కారుతో రోడ్డెక్కిన ఓ వ్యక్తిని స్థానిక కలెక్టర్‌ ‌కృష్ణభాస్కర్‌ అడ్డుకుని వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని పోలీసు వ్యానులో ఎక్కించాడు. హైదరాబాద్‌ ‌నగరంలో అలా నూటాపది ఆటోలను, యాభైకి పైగా ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వ్యాధి ప్రమాదం గురించి నెత్తిన నోరుపెట్టుకుని చెబుతున్నా ఇలా విచ్చలవిడిగా ప్రజలు తిరగుతుండడంతో తమ ఆదేశాలను ధిక్కరించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు, వాహనాలను సీజ్‌చేసి, నెలాఖరు వరకు వాటిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆతర్వాత సోమవారం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వ్యాధి లక్షణాలు, తీసుకుంటున్న చర్యలు, ప్రజల సహకారం గురించి సోదాహరణంగా వివరించినప్పటికీ కొందరు సోయితప్పి ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా తన అసంతృప్తిని వ్యక్తంచేశాడు. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ఈ వైరస్‌ ఇటలీ, ఇరాన్‌లలో ఇప్పటికే నాల్గవ దశకు చేరుకుంది. భారతదేశానికి కొంత ఆలస్యంగా చేరినా ఇప్పటికే రెండవ దశకు చేరుకుంది. మూడవదశకు చేరువలో ఉండడంతో ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో ఎనిమిదిమంది చనిపోగా 430 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రపంచ ఆరోగ్యసంస్థ దీనిపై హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి.

సుప్రీమ్‌కోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు మైక్‌ ‌ర్యాన్‌ ‌ప్రకారం కేవలం లాక్‌ ‌డైన్‌తో సరిపోదని, ఇంట్లో కూర్చున్న ఈ వ్యాధి సోకదన్న గ్యారెంటీ ఏమీ లేదంటున్నాడు. ఏ దేశమైనా, రాష్ట్రాలైన ప్రజారోగ్య రక్షణ చర్యలు బలంగా లేకపోతే ఈ వ్యాధి తిరిగి ప్రబలే ప్రమాదముందని హెచ్చరించడాన్ని బట్టి చూస్తుంటే ఎంత జాగ్రత్త పడాల్సి ఉందో అర్థమవుతుంది. దీన్ని బట్టి ఈ వ్యాధి ఎంత ప్రమాదకారో అర్థమవుతున్నది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ సూచనలను నిర్లక్ష్యం చేయడం నిజంగానే సహించరాని విషయం. తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నట్లు ప్రజలకు ప్రాణం ముఖ్యమా.. బయటికి వెళ్ళడంముఖ్యమా అన్నది ఆలోచించుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వం 2400 కోట్లను ఇందుకోసం కేటాయించింది. అవసరమైతే ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేసే ప్రణాళిక రూపొదిస్తోంది. రోజువారీ కూలీలకు ప్రతీ తెల్లకార్డుపైన పన్నెండు కిలోల బియ్యం, 15 వందల రూపాయల నగదు ఇచ్చే ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపిలు, అత్యవసరం లేని శస్త్రచికిత్సలను నిలిపి కేవలం ఈ వ్యాధిగ్రస్తుల చికిత్సపైనే దృష్టిపెట్టింది. ప్రజలు ఇంటి నుండి బయటికి వెళ్ళకుండా ఉండేందుకు ఇన్ని చర్యలు తీసుకుంటుంటే పట్టించుకోకుంటే ఇంటినుండి బయటికివెళితే మాత్రం ఇక కేసులే అంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

Tags: pandemic coronavirus,Soi’s lack,government’s instructions,telangana

Leave a Reply