Take a fresh look at your lifestyle.

జలవివాదాల్లో మధ్యవర్తిత్వం నెరిపేదెలా ?

ఇరు ప్రాంతాలకు సమ న్యాయం జరగదా
గంట కట్టేదెవరన్న ప్రశ్నలకు దొరకని సమాధానాలు

విజయవాడ, జూలై 12 : జలవివాదాల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యులు జోక్యం చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం అన్వేషించడం అవసరం అన్న భావన వస్తోంది. కేసీఆర్‌ను కనీసం ప్రశ్నించలేని స్థితిలో సిఎం జగన్‌ ఉన్నందున అఖిలపక్ష నేతలను రంగంఓలకి దింపాలని ఎపిలో కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  ఆంధప్రదేశ్‌ ‌ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజల తరఫున ఎవరైనా ఉంటే సమస్య పరిష్కారానికి పూనుకోవాలని కోరుకుంటు న్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరంత రాయంగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు పులిచింతల కూడా ఖాళీ అవుతోంది. అయితే తాజాగా సాగర్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని ఆపేశారు. అయితే ఇప్పటికే జరిగే నష్టం జరిగి.. నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోయాయి. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసి వరదలు రాని పక్షంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సాగునీటికి, తాగునీటికి కటకట ఏర్పడుతుంది. అయినా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకుండా ప్రకటనలకే పరిమితం కావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ జలాశయాల్లోని నీటిని సాగు, తాగునీటి అవసరాలకు ముందుగా వినియోగించాలని, విద్యుత్‌ ఉత్పత్తికి తొలి ప్రాధాన్యం ఉండకూడదన్న నియమం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అమలులో ఉంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్‌ ‌నుంచి కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల నీరు వృథా అవుతోంది.

జల విద్యుత్‌ ఉత్పత్తి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇం‌త పట్టుదలగా ఉండడానికి కారణం ఏమిటి? జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడమే ఇందుకు కారణంగా కనిపించడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెబుతున్న వాళ్లు, జల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం లేదు. వరదలు వచ్చి జలాశయం నిండని పక్షంలో ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమే! రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయినా ఉపయోగం లేకుండా పోతుంది. అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ‌కూడా పరిస్థితి చేయిదాటకుండా నిలువరించడానికి గట్టి ప్రయత్నం చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వృథా చేయవద్దని కేసీఆర్‌ను నేరుగా కోరే సాహసాన్ని కూడా జగన్‌ ‌చేయలేకపోతున్నారని టిడిపి, బిజెపి నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ఆలోచన, ఉద్దేశం తమకు లేనే లేదని ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంజాయిషీ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలను 65:35 నిష్పత్తిలో ఆంధ్రా-తెలంగాణ పంచుకోవడానికి అంగీకరించి సంతకాలు పెట్టిన కేసీఆర్‌, ఇప్పు‌డు హఠాత్తుగా రెండు రాష్ట్రాల మధ్య సమాన వాటా ఉండాలని అడ్డం తిరగడానికి కారణం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. జల విద్యుత్‌ ఉత్పత్తికే ఆయన ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ ‌షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించడమే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రస్తుత జల జగడానికి ప్రధాన కారణంగా కొంతమంది విశ్లేషిస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి వల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోతున్న విషయాన్ని జగన్‌ ‌మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంపై మండిపడుతున్నారు. జలాశయాలు మళ్లీ నీళ్లు రాని పక్షంలో రాయలసీమలో తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందన్న ఆందోళన కూడా ఉంది.  కేసీఆర్‌తో తనకు సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్న ఆయన, ఈ క్రమంలో రాయలసీమ ప్రయోజనాలు గాలికిపోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానిక రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమకు జరగబోయే నష్టాన్ని తలచుకొని కుమిలిపోతున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణం అనుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ ప్రజలు కూడా జగన్‌ ‌ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply