‘‘మీరు క్రోనాలజీ అర్థం చేసుకోండి.. ముందు సిఏఏ చట్టం వస్తుంది.. అటుపైన ఎన్ఆర్సీ ప్రక్రియ చేపడతాం..ఎన్ఆర్సీ కేవలం బెంగాల్‌కు మాత్రమే కాదు..దేశవ్యాప్తంగా చేపడతాం’’.. అని అమిత్ షా ప్రకటించారు. దీనితో దేశంలో ఉన్న ముస్లింలకు భయం మొదలయ్యింది. వారు భయంతో నిరసనలు చేస్తున్నారు. వారి భయానికి ఖచ్చితంగా ఆధారం ఉంది. సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు కలిపి వచ్చినప్పుడు ముస్లింలకు ప్రమాదం పొంచి ఉంది. ఎన్ఆర్సీ ప్రక్రియ వల్ల హిందు, సిక్కు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు తన పౌరసత్వాన్ని కోల్పోతే తిరిగి పౌరసత్వం సిఏఏ వలన పొందవచ్చు. అదే సమయంలో ముస్లింలు పౌరసత్వం పొందటం కుదరదు. మొదట మనం ప్రస్తావించుకున్న బిల్లులోని నిబంధనలకు భారతీయ ముస్లిమ్స్ దగ్గర సమాధానం ఉండదు.”
‘‘సిఏఏ చట్టంపై తప్పుడు సమాచార ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సిఎఎను గ్రామాలకు తీసుకెళ్లాలి’’ భూపాల్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇలా ప్రకటించి గ్రామాలకు పోయి సిఏఏ చట్టంపై గ్రామీణ మద్దతు పొందేలాగా పనిచేయాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కర్తవ్యబోధ చేశారు. ఈ మాట చెబుతూ మోహన్ భగవత్ పట్టణ పార్టీ అని చెప్పే బీజేపీని గ్రామీణ పార్టీగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఏఏ చట్టానికి అనుకూలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రధానంగా చేస్తున్న వాదనలు..
1. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న కోట్లాది మత పీడిత ముస్లిమేతరులకు సిఎఎ పౌరసత్వం ఇస్తుంది. అదేలా అంటే పాకిస్థాన్‌లో ఉన్న ముప్పై మూడు లక్షల హిందువులకు, బంగ్లాదేశ్‌లో ఉన్న ఒక కోటి రెండు లక్షల హిందువులకు పౌర సవరణ చట్టం ద్వారా భారతీయ పౌరసత్వం ఇవ్వవచ్చు.
ఈ వాదన రెండు విధాలుగా తప్పు. సిఏఏ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువు భారతీయ పౌరసత్వం పొందాలి అంటే.. భారత ప్రభుత్వం పెట్టే నాలుగు కండిషన్స్‌ని సంతృప్తి పరచాలి. 1. మొదట తాము పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పౌరులమని నిరూపించు కోవాలి. 2. రెండు వారు ఖచ్చితంగా ఏదో ఒక మతాన్ని నమ్మేవారు అయ్యుండాలి. 3. 2014 డిసెంబర్ 31 నాటి కన్నా ముందే భారతదేశానికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వారు అయ్యుండాలి. 4. సిఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం కావాలని అర్జీ పెట్టుకున్న వారు భారతదేశంలో కనీసం అయిదేళ్లుగా నివాసి అయి ఉండాలి.
2. ప్రపంచవ్యాపితంగా నలభై తొమ్మిది ముస్లిం దేశాలు ఉన్నాయి. ముస్లింల కోసం..హిందువుల కోసం ఒకే దేశం ఉంది..అది భారతదేశం. ఈ వాదనలో వాస్తవం ఎంత..
ఈ వాదనలో వాస్తవాన్ని పరిశీలించే ముందు మన మనసులోకి రాకూడని ఆలోచన ప్రపంచంలో అత్యధికంగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి.. అటువంటప్పుడు క్రిస్టియన్లకు మనం పౌరసత్వం ఇస్తామని ఎందుకు అంటున్నాం..? బౌద్ధుల కోసం ఐదు బౌద్ధ మత మెజారిటీ దేశాలు ఉన్నాయి.. అటువంటప్పుడు బౌద్ధ మతస్తులకు మనం పౌరసత్వం ఎందుకు స్తున్నాం..? ఈ ప్రశ్నలు మన మనసులోకి వచ్చినవెంటనే పౌరసత్వాన్ని మతంతో జోడించడం అన్న విషయంలో మనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అర్థం. ఆధునిక యుగంలో ప్రపంచంలో ఎక్కడైనా పౌరసత్వం అన్నది పుట్టుకతో సంబంధమైన విషయంగా ఉంది. మన దేశంలో కూడా అలానే ఉండేది. దాన్ని మార్చటానికి పలు రకాల ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం పౌరసత్వం మతం ఆధారంగా ఇవ్వటం. ఇది రాతి యుగాలనాటి ఆలోచన. అంటే దేశాన్ని మత ఆధారంగా నడపటానికి నిర్ణయించుకోవడం. మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. మన దేశాన్ని లౌకిక రాజ్యంగా నడుపుతామని నిర్ణయించుకున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగ పునాది లౌకికవాదం ఆధారంగా వేశారు. లౌకికవాదం ఆధారంగా పౌరుల హక్కులు ఉండాలని చెప్పారు. అందుచేత ఈ బిల్లు రాజ్యాంగ పునాదిని కదిలిస్తున్నది. ఇక మానవతా దృక్పథంతో పౌరసత్వం ఇస్తాం.. అంటే పాకిస్థాన్‌లో మత హింసకు గురి అయిన హిందువుకి, అదే పాకిస్తాన్లో మత హింసకు గురవుతున్న అహ్మదియ్యా ముస్లింకి తేడా ఏముంటుంది..? వీరిద్దరిలో తేడా లేనప్పుడు వీరిరువురు పైన జరుగుతున్న మత హింస నుంచి మత ఆధారంగా సహాయం చేస్తాం అనటం వివేకం ఎలా అవుతుంది. భారతదేశం ఒక ముస్లిం రాష్ట్రపతిని, ఒక సిక్కు ప్రధానమంత్రిని, ఒక ఫార్సీ ఎయిర్ చీఫ్‌ని చూసింది. మన దేశంలో ఈ అద్భుతం సంభవించడానికి కారణం భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం. ఈ విషయంపైన బీజేపీ నేత భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి మాట్లాడుతూ ‘‘భారత దేశం లౌకిక దేశం..అలా కాక కాకపోతే.. అది భారత దేశమే కాదు’’ అని అన్నారు.
3. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టాం. ఎన్నికలలో మేము గెలిస్తే ఈ చట్టం తీసుకువస్తామని ప్రజలకు తెలుసు. అయినా గానీ ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. అంటే ప్రజల మద్దతు ఈ చట్టంకు ఉంది. అన్న వాదన ఏ మేరకు కరెక్ట్..? ఈ వాదన సరైన వాదన కాదు అని చెప్పటానికి, రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అధికారంలోకి వచ్చిన పార్టీ తమకు ఓటు వేసిన వారి గురించి మాత్రమే పాలసీలు తయారు చేయదు. అధికారంలోకి వచ్చిన పార్టీ దేశవ్యాప్తంగా ఉండే ప్రజల బాగు కోరి పాలసీలు చేయాల్సి ఉంటుంది. 2019 సాధారణ ఎన్నికలలో బీజేపీ దాని మిత్ర పక్ష పార్టీలకు 26 కోట్ల ఓట్లు పడ్డాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇతర ప్రతిపక్ష పార్టీలకూ 34 కోట్ల ఓట్లు పడ్డాయి. ఇటువంటప్పుడు దేశ ప్రజలందరి మద్దతు సిఏఏ చట్టానికి ఉంది అని చెప్పటం నూరు శాతం అబద్ధం అవుతుంది. రెండవ కారణం, ఓటరు తనకు నచ్చిన రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలూ చదివి అర్థం చేసుకుని వాటన్నిటిపై తన సమ్మతి తెలుపుతూ ఓటు వేయడు. నిరక్షరాస్యత శాతం అత్యధికంగా ఉన్న భారతదేశంలో మేనిఫెస్టో చదివి ఓటు వేసే ఓటర్లు ఎంతమంది..? ఒకవేళ ఓటు చదివి మేనిఫెస్టో చదివి ఓటు వేశారు అనుకున్నా.. మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలపైనా పూర్తి సమ్మతి ఉంది అని చెప్పటం ఏ మేరకు తగును..? మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని అంశాలు నచ్చి, మరి కొన్ని నచ్చక పోయినా కూడా ఓటరు తన ఓటు ఆయా పార్టీకి ఇచ్చే అవకాశం ఉంటుంది.
4. సిఏఏ చట్టం వలన భారతీయ ముస్లింలకు ఎటువంటి సమస్య లేదన్న అమిత్ షా వాదనను భారతీయ ముసల్మానులు ఎందుకు నమ్మడం లేదు..? ఈ విషయంలో అమిత్ షా నూటికి నూరుపాళ్ళు నిజం చెబుతున్నారు. ‘‘సిఏఏ చట్టం వలన భారతీయ ముస్లింలకు ప్రమాదం లేదు’’.. ఈ మాట చెప్పిన నోటితోనే ‘‘మీరు క్రోనాలజీ అర్థం చేసుకోండి.. ముందు సిఏఏ చట్టం వస్తుంది.. అటుపైన ఎన్ఆర్సీ ప్రక్రియ చేపడతాం..ఎన్ఆర్సీ కేవలం బెంగాల్‌కు మాత్రమే కాదు..దేశవ్యాప్తంగా చేపడతాం’’.. అని అమిత్ షా ప్రకటించారు. దీనితో దేశంలో ఉన్న ముస్లింలకు భయం మొదలయ్యింది. వారు భయంతో నిరసనలు చేస్తున్నారు. వారి భయానికి ఖచ్చితంగా ఆధారం ఉంది. సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు కలిపి వచ్చినప్పుడు ముస్లింలకు ప్రమాదం పొంచి ఉంది. ఎన్ఆర్సీ ప్రక్రియ వల్ల హిందు, సిక్కు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు తన పౌరసత్వాన్ని కోల్పోతే తిరిగి పౌరసత్వం సిఏఏ వలన పొందవచ్చు. అదే సమయంలో ముస్లింలు పౌరసత్వం పొందటం కుదరదు. మొదట మనం ప్రస్తావించుకున్న బిల్లులోని నిబంధనలకు భారతీయ ముస్లిమ్స్ దగ్గర సమాధానం ఉండదు.
5. ఈ సిఏఏ చట్టం గురించి భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏమంటున్నది..?
భారతదేశ ఇంటిలిజెన్స్ బ్యూరో ఈ చట్టం గురించి ఈ సరికే స్పష్టంగా చెప్పింది. ఈ చట్టం ద్వారా ఎవరైనా భారత పౌరసత్వం కావాలని అర్జీ పెట్టుకుంటే.. పౌరసత్వం అర్జీ పెట్టుకున్న వారే తాము ఇదివరకు నివాసం ఉన్న దేశంలో మత హింసకు గురి అయ్యామని నిరూపించాలి. అంతేకాకుండా తాము అప్పటి వరకు నివాసం ఉన్న దేశం వదిలి భారత దేశంలో అడుగు పెట్టినప్పుడు మత హింసే కారణం అని తమ వీసా డాక్యుమెంట్లలో తెలిపినట్లు ఆధారాలు చూపాలి. అంటే.. పాకిస్తాన్ నుంచి వచ్చినవారు హిందువులు అయినా గాని మతహింస కాకుండా ఇతర కారణాలు చూపినట్లయితే వారికి సిఏఏ చట్టం వలన పౌరసత్వం రాదు.
6. సిఏఏ చట్టం వలన ఎంతమంది లాభపడతారు..? అని ఇంటెలిజెన్స్ బ్యూరోని అడిగినప్పుడు.. ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిన సమాధానం ఏమిటి..?
సిఏఏ చట్టం వలన కేవలం ముప్పై ఒక వేయి మూడు వందల పదమూడు మంది లాభపడతారు, అని భారత ఇంటిలిజెన్స్ సంస్థ స్పష్టం చేసింది.
7. ఇది కాకుండా దేశవ్యాపితంగా ఎన్ఆర్సీ చేయాలనుకున్నప్పుడు ఖర్చయ్యే నిధులు కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఏ మేరకు ప్రభుత్వ ఖర్చు పెరగవచ్చు..?
అస్సాంలో ఎన్ఆర్సీ చేసినప్పుడు మూడు కోట్ల రెండు లక్షల మంది ప్రజలు లైన్లో నిలబడి తమ సిటిజన్ షిప్‌ను నిరూపించుకోవటానికి పది సంవత్సరాల పాటు ఇక్కట్లు పడ్డారు. యాభై రెండు వేల ఉద్యోగులు ఎన్ఆర్సీ ప్రక్రియ పనిని తమ రెగ్యులర్ పనితో పాటు అదనంగా చేశారు. 2500 ఎన్ఆర్సీ సెంటర్లు ఏర్పాటు చేసారు. పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఎన్ఆర్సీ సెంటర్ ఉద్యోగులు ఆరున్నర కోట్ల డాక్యుమెంట్లు వెరిఫై చేశారు. తమ పనితో పాటు అదనంగా చేస్తున్న ఈ పనికి తమకు ఎక్స్ ట్రా పేమెంట్ కాదు కదా కొన్నిసార్లు తన జేబులో నుంచి డబ్బులు పెట్టుకున్నామని ఎన్ఆర్సీ సెంటర్స్ ఎంప్లాయిస్ చెప్పారు. ఎప్పటికి ఈ పని పూర్తి అవుతుందా అని విసిగి వేసారి పోయారు. అస్సాంలో ఈ ఎన్ఆర్సీ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, తమ పౌరసత్వం పోతుందన్న భయంతో 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కమ్యూనల్ రైట్స్ చాలా అయ్యాయి. అందులో 2500 మంది చచ్చిపోయారు. మరి కొంత మంది డాక్యుమెంట్ల కోసం చేసిన ప్రయత్నాలలో మరణించారు. కొంతమంది డాక్యుమెంట్లు లేక డిటెన్షన్ సెంటర్ల పాలయ్యారు. మూడు కోట్ల రెండు లక్షల మంది ప్రజలు పాల్గొన్న ఎన్ఆర్సీలో ఇన్ని ఇబ్బందులు వస్తే 130 కోట్ల ప్రజల పాల్గొనే ఎన్ఆర్సీ ఎంత కష్టం కానుందన్నది ఆలోచించాలి.
8. దేశవ్యాపితంగా ఎన్ఆర్సీ ప్రక్రియ చేయడానికి తగినంత ప్రభుత్వ సిబ్బంది ఉన్నారా..?
ప్రభుత్వ ఉద్యోగుల కొరత మనకు బాగా ఉంది. ఆ ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పనిలో వాడుకుంటే, మొత్తం గవర్నెన్స్ ఏమి కావాలి..?
9. ప్రభుత్వం ఇలాంటి స్టాటిస్టిక్స్ ప్రక్రియ చేపట్టినప్పుడు రెండు రకాల అవకతవకలు జరుగుతాయి.. అవేంటి..?
ఎన్ఆర్సీ ప్రక్రియ చేపట్టినప్పుడు సులభతరమైన డాక్యుమెంట్లు అడిగితే ఫాల్స్ పాజిటివ్ తప్పు జరిగే అవకాశాలుంటాయి.ఈ తప్పు వలన ఇల్లీగల్ నాగరికులకు పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఎన్ఆర్సీ ప్రక్రియలో డాక్యుమెంట్లు ఖచ్చితమైనవి అడిగితే టైప్ టు ఫాల్స్ నెగిటివ్ అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. నిజమైన పౌరుల పౌరసత్వం రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తరహా అవకతవకల పర్సంటేజ్ ఐదు శాతం గనుక ఉంటే ఆరు కోట్ల ఏడు లక్షల మంది పౌరులు పౌరసత్వం కోల్పోయే అవకాశం ఉంది. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంత మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారో.. అంత మంది నిర్వాసితులు అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ అవకతవకల పర్సంటేజీ ఒక్క శాతం ఉన్నా కానీ దేశ విభజన సమయంలో ఎంత మంది ప్రజలు అయితే ఇబ్బంది పడ్డారో అంత మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ప్రక్రియ చేస్తున్నప్పుడు జరిగిన అవకతవకల పర్సెంటేజ్ 8.8 శాతం.
10. ముస్లింలు.. లిబరల్స్ ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు.. వారు ఈ దేశ పౌరులు అయితే కాగితాలు చూపించటానికి వారికి ఏం బాధ అన్న వాదన ఏ మేరకు కరెక్టు..?
అస్సాంలో జరిగిన ఎన్ఆర్సీ వలన చాలా నిజాలు వెలుగులోకి వచ్చాయి. మన డాక్యుమెంట్లలో ఉండే స్పెల్లింగ్ మిస్టేక్ వలన కూడా డాక్యుమెంట్స్ చెల్లని పరిస్థితులు వచ్చాయి.
11. ఎన్ఆర్సీ ప్రక్రియ అస్సాంలో జరిగి నప్పుడు అడిగిన డాక్యుమెంట్స్ ఏమిటి..?
1. 24 మార్చి 1971 నాటికి తల్లిదండ్రులు భారతీయులు అని నిరూపించే కాగితాలు కావాలి.
2. శాశ్వత లేదా అద్దె ఇంటి అడ్రస్ నిరూపించాలి. 3. రెఫ్యూజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపాలి.
4. ప్రభుత్వం జారీ చేసిన లీగల్ డాకుమెంట్స్.. ఎలక్షన్ ఎన్నికల గుర్తింపు కార్డ్, బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, బ్యాంక్, పోస్టల్, ఎల్ఐసి సేవింగ్స్ ఖాతాలు, భూమి రిజిస్ట్రేషన్ లేదా ఇతర లీగల్ డాకుమెంట్స్ ఏమైనా ఉంటే చూపాలి.
2015లో రంగరాజన్ కమిటీ రిపోర్టు ప్రకారం భారతదేశంలో 36 కోట్ల జనాభా రోజుకు 32 లేదా 42 రూపాయలు మాత్రమే సంపాదిస్తుంది. వీరి దగ్గర పై డాక్యుమెంట్స్ ఉండే అవకాశం ఉందా..?
