Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాక్సిన్ పై ఊరించే ప్రకటనలు ఎన్నాళ్ళు..

యావత్ మానవాళి మనుగడకు సవాల్ గా తయారైన కోవిడ్-19 కు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు ప్రపంచంలోని అన్ని ఫార్మా కంపెనీలు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఔషధ పరిశ్రమకు పేరొందిన ముంబాయిలో గెల్మార్క్ అనే కంపెనీ ఫాబిఫ్లూ పేరిట తయారు చేసిన మాత్రలు కొరోనా తక్కువ స్థాయి రోగులకు మాత్రమే పని చేస్తాయని తేలింది. వ్యాక్సిన్ కోసం కొరోనా బాధితులు, బంధువులే కాదు మానవాళి మొత్తంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కొరోనా వ్యాక్సిన్ పరిస్థితి ఇదిగో పులి,అదిగో తోక అనే తీరులో తయారైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ కొరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదంటారు. అమెరికా, జర్మనీ, తదితర దేశాల శాస్త్రవేత్తలు కొరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందడానికి ఏడాది పైన పట్టవచ్చంటారు. హైదరాబాద్ కి చెందిన ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో పోటీ పడుతున్నాయనీ, యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు ఇప్పుడు చూస్తోందని మంత్రి కెటిరామారావు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. హైదరాబాద్ ఫార్మా హబ్ గా రూపొందించామని కూడా ఆయన ప్రకటించారు. మొత్తం మీద కొరోనా వ్యాక్సిన్ ప్రకటనలకే పరిమితం అవుతోంది. ఈ లోగా కొరోనా వైరస్ అన్ని వర్గాలకూ వ్యాపిస్తోంది. విఐపీలు స్వయంగా ప్రకటన చేసి తాము ఐసోలేషన్ కు వెళ్ళి పోతున్నామనీ, తమను ఎవరూ కాంటాక్ట్ చేయవద్దని మరీ చెబుతున్నారు. ఒక వేళ ఎవరైనా కాంట్రాక్టు అయితే క్వారంటైన్ కు వెళ్ళిపోవాలని కూడా సలహా ఇస్తున్నారు. కొరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందోనని సామాన్యులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జనాన్ని అంత తేలిగ్గా కొరోనా వదిలేలా లేదు. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం కొరోనా బలహీనమైన వైరస్ అనీ, ఈ వైరస్ బారిన పడిన వారిలో 3-4 శాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారని చెబుతున్నారు. కొరోనా ను మన సమాజంలో కొందరు తేలిగ్గా తీసుకుంటుంటే, మరి కొందరు అతిగా భయపడుతున్నారు. వైరస్ వ్యాప్తి పై భిన్న కథనాలు వెలువడటానికి ఇది కూడా ఒక కారణం. ఇక హాస్పిటల్స్ లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నిరంతర వార్తా స్రవంతుల్లో నిత్యం చూస్తూనే ఉన్నాం. కొరోనా వ్యాధిగ్రస్థుల్లో స్థోమత ఉన్న వారి వద్ద ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ డబ్బు ఎలా గుంజేస్తున్నాయో కూడా చూస్తున్నాం. లక్షల లక్షలు చెల్లించినా ప్రాణాలకు గ్యారంటీ లేని వైద్యం ఆ హాస్పిటల్స్ లో అందుతోంది. చనిపోయిన వారి పార్థివ దేహాలను తీసుకుని వెళ్ళడానికి బకాయి పడిన లక్షలు చెల్లించి మరీ తీసుకుని వెళ్ళాలని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయ. దీనిపై వెలువడిన కథనాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్ పై కొరడా ఝళిపిస్తోంది. కొన్ని హాస్పిటల్స్ కు కొరోనా వైద్యం చేసే లైసెన్సులను రద్దు చేస్తోంది. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొందన్న అభిప్రాయం జనంలో వినిపిస్తోంది. కొరోనా చికిత్స చేసే హాస్పిటల్స్ వద్ద అనారోగ్య కర వాతావరణం గురించి ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్టాప్ తక్కువనీ, కిట్స్ ఇతర సామగ్రి తక్కువని ఏవేవో సాకులు చెబుతున్నారు. మరో వంక ఈ వైరస్ నిర్మూలన కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనకాడదని అధికారంలో ఉన్న పెద్దల పదే పదే ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కొరోనా వ్యాక్సిన్ వస్తుందా రాదా అనే అంశం ప్రజలను వేధిస్తోంది. ఒక వేళ వచ్చినా అది సామాన్యులకు అందుబాటులో ఉంటుందా అన్న ప్రశ్న కూడా జనాన్ని పట్టి పీడిస్తోంది. కొరోనా పెద్దగా బలంలేని వైరస్ అని అంటున్నారు. ఒక వేళ బలమైన వైరస్ వ్యాపించి ఉంటే మన పరిస్థితి ఏమిటన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని తల్లడిల్లుతున్నాయి. నిజమే కొరోనా ఇంత తీవ్రంగా విస్తరిస్తుందని ఎవరూ ఊహించి ఉండక పోవచ్చు. గతంలో సార్స్ , నిఫా వంటి వైరస్ లు వ్యాపించినప్పుడు తాత్కాలిక నివారణ మార్గాలను అనుసరించారు. ప్రజల అలవాట్లు, జీవన విధానంలో మార్పుల కారణంగా ఇలాంటి వైరస్ ల వ్యాప్తి సర్వసాధారణం అయ్యాయి. ఇకనైనా ప్రపంచ దేశాలు ముఖ్యంగా, అగ్రరాజ్యమైన అమెరికా, అగ్రరాజ్య హోదా కోసం పోటీ పడుతున్న చైనా తదితర దేశాలు వాణిజ్య యుద్ధాలు, సైనిక విన్యాసాలకు స్వస్తి చెప్పి మానవాళి మనుగడకు ప్రమాదంగా తయారైన వ్యాధుల వైరస్ లను అంతమొందించడానికి వ్యాక్సిన్ లు, మందుల తయారీలో ఏకీకృతంగా వ్యవహరించాలి . కొరోనా కేసుల సంఖ్య మనం చూస్తుండగానే దేశంలో 17 లక్షలు దాటింది. ఇంకా ఎన్ని లక్షలకు చేరుకుంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడున్న వాతావరణంలో వైరాలకూ, వైషమ్యాలకూ స్వస్తి చెప్పి అన్ని దేశాలు ఏకోన్ముఖంగా కృషి చేయాలి. ముందు మనిషి బతికుంటేనే హెచ్చ తగ్గుల , వైషమ్యాలు తలెత్తుతాయి. మనిషే లేనప్పుడు ఎవరితో పోరాడుతారు. ఈ ఇంగితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని కొరోనా పీడ వదిలించుకోవడానికి వ్యాక్సిన్ కోసం కృషి చేయాలి.

.హైదరాబాద్ , ముంబాయిలకు చెందిన ఔషధ కంపెనీలు చేస్తున్న ప్రకటనలు భ్రమలు కొల్పే రీతిలో ఉంటున్నాయి. వీటి ప్రకటనలకు శాస్త్ర ప్రామాణికత ఎంత ఉందో తెలియదు. వీటిపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ, తదితర సంస్థల అదుపు ఉన్నట్టు లేదు. ఈ సంస్థలు, కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ లు,ఇతర డ్రగ్స్ కు క్లినికల్ ట్రయిల్స్ పూర్తి అయ్యాయని చెబుతున్నారు. ఇది ఎంత వరకూ వాస్తవమో తెలియదు. కేవలం ప్రకటనలతో ఊరించే కంపెనీలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాణిజ్యంలో పోటీ కోసం ఔషధ కంపెనీలు పోటాపోటీ ప్రకటనలు చేయడం మన దేశంలో కొత్త కాదు. కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మౌన ప్రేక్షకుని పాత్ర వహిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. కొరోనా వ్యాక్సిన్ ఒక దేశానికీ, ఒక నగరానికి సంబంధించింది కాదు., ప్రపంచ ఆరోగ్య సంస్థ కేవలం ప్రకటనలకే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. ఆ సంస్థ డైరక్టర్ జనరల్ ప్రకటనలు ఒక్కొక్కసారి మరింత భయపెట్టే రీతిలో ఉంటున్నాయి. ప్రపంచ దేశాల మధ్య తగాదాలను పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైనట్టే, వ్యాధుల వ్యాప్తి నివారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైంది. ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందే కనిపెట్టి ఆ సంస్థను సహాయ నిరాకరణ చేపట్టారు.. అయితే, ఇప్పుడు జనానికి కావల్సింది, వారిలో వారు గొడవలు పడటం , ఆరోపణలు చేసుకోవ డం కాదు. కొరోనా బారిన పడిన వారి ప్రాణాలను నిలబెట్టేందుకు సంయుక్త కృషి అవసరం ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. అయితే, దేశాల మధ్య పరస్పర విశ్వసనీయత లోపించడం వల్ల కూడా ఈ కృషి ముందుకు సాగడం లేదు కొంతలో కొంత మన దేశాన్నే అన్ని దేశాలు నమ్ముతున్నాయి కనుక, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన చిరకాల అభీష్టమైన రామమందిర నిర్మాణ క్రతువు ప్రారంభమైంది కనుక కొరోనా వ్యాక్సిన్ తయారీపై అన్ని దేశాలనూ ఒకే వేదిక పైకి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. ఇందుకు తగిన ప్రణాళికల రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించాలి. కొరోనా వ్యాప్తితో వాణిజ్య, పారిశ్రామిక రంగాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తరాల బంగారు భవిష్యత్ కు బాటలు వేసే విద్యారంగం అంతకన్నా దెబ్బతిందనే వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. తమకున్న నిధులనూ, వనరులనూ వ్యాక్సిన్ తయారీకి కేటాయించాలి., ఈ సమయంలో అంతర్గత విభేదాలూ, సైద్ధాంతిక శషబిషలకూ తావివ్వరాదు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు క్షమించవు.విద్య,వైద్యం , పరిశోధనల పై ఎంత ఖర్చు అయినా వెనుకాడకూడదు.

Leave a Reply