“ఆల్ఫా (బి.1.1.7) మరియు డెల్టా (బి.1.617.2) వేరియంట్లతో 2వ అల అనేక ప్రాణాలను బలిగొంటూ, లక్షల కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది. యుకె మరియు కెంట్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌తో భారత్‌లో కొరోనా వ్యాప్తి రేటు మరియు వ్యాధి తీవ్రత పెరగడం కనబడుతున్నది. 2వ అల అంతంకాదని, మరిన్ని కొరోనా అలలు మరియు కొత్త వేరియంట్లు రావచ్చని, వీటిని తట్టుకోవడానికి విశ్వమానవాళి అస్త్రశస్త్రాలతే సిద్ధంగా ఉండాలని హెచ్చరించడం జరుగుతున్నది. మార్చి-2021లో 2వ అల హెచ్చరికల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొని ఉంటే, వేల ప్రాణాలు దక్కేవని అంటున్నారు.”
నేటి వరకు భారత్‌ను చుట్టేసిన కొరోనా వేవ్‌లకు కారణమైన ఆల్ఫా (బి.1.1.7) మరియు డెల్టా (బి.1.617.2) వేరియంట్లతో రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు మరియు 2 – 4 వేల మరణాలు నమోదు అవుతూ, ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. భారతదేశంలోను రాష్ట్రాలలో విధించి కఠిన లాక్డౌన్ పుణ్యాన కేసులు మరియు మరణాల సంఖ్య తగ్గుతూ, రెండవ అల తగ్గుతోందనే అభిప్రాయాన్ని కలిగిస్తూ, కొంత ఊరటకు కారణం అవుతున్నది. తొలి వేవ్‌కు కారణమైన వేరియంట్‌తో దీర్ఘవ్యాధులు కలిగిన వయోవృద్ధులు మరియు రెండవ వేవ్ వేరియంట్ల దుష్ప్రభావం అధిక సంఖ్యలో యువత లోనుకాగా, రెండవ అల వేగంగా సోకడం మరియు కొద్ది రోజుల్లోనే తీవ్ర అనారోగ్యం కలగడం గమనించాం.
ఆగష్టు-2021 తరువాత 3వ వేవ్ వస్తుందని, మరో అతి ప్రమాదకర కొత్త వేరియంట్లతో పిల్లలను కూడా వదలక పోవచ్చనే భయంకర వాస్తవాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు, ఆసుపత్రులు, పౌరసమాజం దానిని తట్టుకోవడానికి కావలసిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ప్రణాళికాబద్దంగా కదలాల్సిన అత్యవసర సమయమిది. నేడు 2వ అల తగ్గుముఖం పట్టిందనడానికి పాజిటివ్ రేటు 7 శాతం రికార్డు కావడమే రుజువుగా తీసుకోవచ్చు. నేటికి కూడా 1.3 లక్షల దినసరి కేసులు మరియు 2,500 – 3000 మరణాలను గమనిస్తే 2వ అల పూర్తిగా తగ్గిందని ఖచ్చితంగా చెప్పలేని అయోమయంలో మనం ఉన్నాం. నేటికీ కేరళ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిసా, ఆంధ్రప్రదేశ్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ రేటు అధికంగానే నమోదు అవడం గమనిస్తున్నాం. జూన్-2021 అంతానికి కేసుల సంఖ్య 50,000 లోపు మరియు పాజిటివ్ రేటు 3 – 5 శాతానికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆల్ఫా (బి.1.1.7) మరియు డెల్టా (బి.1.617.2) వేరియంట్లతో 2వ అల అనేక ప్రాణాలను బలిగొంటూ, లక్షల కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది. యుకె మరియు కెంట్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌తో భారత్‌లో కొరోనా వ్యాప్తి రేటు మరియు వ్యాధి తీవ్రత పెరగడం కనబడుతున్నది. 2వ అల అంతంకాదని, మరిన్ని కొరోనా అలలు మరియు కొత్త వేరియంట్లు రావచ్చని, వీటిని తట్టుకోవడానికి విశ్వమానవాళి అస్త్రశస్త్రాలతే సిద్ధంగా ఉండాలని హెచ్చరించడం జరుగుతున్నది. మార్చి-2021లో 2వ అల హెచ్చరికల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొని ఉంటే, వేల ప్రాణాలు దక్కేవని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు, వైద్యవిభాగం మరియు ప్రజలు అనేక వేవ్‌లు మరియు అనేక వేరియంట్లను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.
ఈ దశలో అందరికీ సత్వర వ్యాక్సినేషన్ మాత్రమే ప్రధాన లక్ష్యంగా తీసుకోవాలి. నవంబర్-డిసెంబర్-2021 వరకు 3వ అల తప్పక రావచ్చని వింటున్నాం. కొత్త కేసులు, మరణాలు మరియు పాజిటివ్ రేటు వారం సగటు గణాంకాలు అతి తక్కువగా నమోదైన వేళ 2వ అల తగ్గిందనే అభిప్రాయానికి రావచ్చు. ప్రత్యుత్పత్తి సంఖ్య (రిప్రొడక్షన్ నంబర్) రెండు వారాల పాటు ఒకటి కన్న తక్కువగా నమోదైనపుడు మరియు వ్యాప్తి రేటు తగ్గినపుడు 2వ అల తగ్గిందని చెప్పవచ్చు. పిల్లలకు ప్రమాదకరంగా మారనున్న 3వ అల వేరియంట్‌ను సింగపూర్‌లో గుర్తించడం జరిగింది. బ్రెజిల్ లాంటి దేశాల్లో 2000లకు పైగా పిల్లలు కొరోనాతో కన్ను మూయడం జరిగింది. దీనిని ఆధారంగా మన దేశానికి చేరక మునుపే 3వ అలను జయించడానికి, ముఖ్యంగ పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు సత్వర జాగ్రత్తలు తీసుకోవలసిందే.
భారతదేశ జనాభాలో 40 శాతం 0-18 ఏండ్ల వయస్సుగల వారు ఉన్నారు. వీరికి నేడు టీకాలు ఇవ్వడం లేదు. ఫిజ్జర్ కంపెనీ రూపొందించే టీకాతో 12-18 ఏండ్ల యువతకు మరియు గర్భిణి స్త్రీలకు అందుబాటులోకి తేవడం మరియు పిల్లలకు కోవాక్జీన్ ఇవ్వడానికి అనుమతి రావడం జరిగితే లేత భారతీయులకు టీకా రక్షణ తొందరలోనే కలుగవచ్చు. మన దేశంలో 1.3 బిలియన్ల ప్రజలు కొరోనా రిస్క్‌లో బతుకులు ఈడుస్తున్నారు. దేశ ప్రజల్లో 70 శాతం టీకాలు తీసుకున్నపుడు రాబోయే అలలు మరియు వేరియంట్ల ప్రభావం అంత పెద్దగా ఉండవని అంటున్నారు. 18-44 ఏండ్ల పట్టణ పేదలు మరియు గ్రామీణ ప్రజలకు సత్వరమే టీకాలు వేయంచాలని, లేని యెడల రాబోయే అలలు మరియు వేరియంట్లతో భారీ ప్రాణనష్టం జరుగవచ్చని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలు మరియు అధిక జనాలతో పని చేసే ఉపాధ్యాయుల్లాంటి వృత్తిలో ఉన్నవారికి ప్రాధాన్యతాక్రమంలో కనీసం ఒక్క డోసు టీకా అయినా పూర్తి చేయాలి. 1వ మరియు 2వ అలలు పట్టణాల్లోనే ప్రారంభమైనాయని, 3వ అల రాకముందే పట్టణ ప్రజలకు టీకాలు వేయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని వివరిస్తున్నారు.
2వ అల పల్లెలకు కూడా వ్యాపించడం చూశాం కాబట్టి గ్రామీణులకు కూడా గ్రామాల వారీగా టీకా కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. దీనికి తోడుగా గ్రామీణులకు కొరోనా పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేనందున కొరోనా నిర్థారణ సాధ్యపడక, వ్యాప్తి పెరుగుతున్నదని అర్థం అవుతున్నది. కొత్త వేరియంట్లు వస్తున్న నేపథ్యంలో కోవిషీల్డ్ వంటి టీకాల పనితనాన్ని కూడా భారత్‌లో నిరూపంచాల్సి ఉంది. వేరియంట్ మరియు వ్యాక్సీ మధ్య సంబంధం తేల్చటానికి ప్రభుత్వాలు చొరవ చూపాలి. రాబోయే రోజుల్లో కొత్త వేవ్‌లు మరియు కొత్త వేరియంట్లు రావచ్చని, మనందరం వాటిని ఎదుర్కొనడానికి టీకాలు వేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ, కొరోనా అలలు/వేరియంట్లతో సహజీవనం చేయడం తప్ప మనకు మరో మార్గం లేదని అవగాహన చేసుకొని, ఆరోగ్య భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉందాం, మహమ్మారిని కసితో మట్టు పెడదాం.

విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్ – 99497 00037