Take a fresh look at your lifestyle.

దేశంలో పోలీసు సంస్కరణల అమలుకు ఇంకెన్ని దశాబ్దాలు ?

బషీర్‌బాగ్‌ ‌కాల్పులకు 20 ఏళ్లు..

Aruna1
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్‌ ‌ప్రవచించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ పార్టీ విధానాలను ప్రజాహితం కోసం అమలుచేస్తాయి. ఇందుకు ప్రభుత్వంలో వివిధ విభాగాలుంటాయి. అందులో పోలీసు శాఖ ఒకటి. ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా, శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. వ్యవస్థల్లో పోలీసు ఒక విభాగమే కాని అది మాత్రమే ప్రభుత్వం కాదు. స్వాతంత్య్రాన ంతరం పోలీసు విధానం కొన్నేళ్ళు సజావుగా నడచినా, రాను రాను ఎన్నికయిన ప్రభుత్వాలు పాలనను చట్టసభలు, పార్టీ సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా, పోలీసు వ్య్వస్థపై ఆధారపడడం రివాజైంది. ఈ విషయం లోతుగా పరిశీలిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా 20 సంవత్సరాలకిందటి బషీర్‌ ‌బాగ్‌ ‌పోలీసు కాల్పులను పరిశీలిద్దాం. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్‌ ‌చార్జీలు పెంచిందన్న కారణంగా అ విషయంలో తొమ్మిది వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు మేరకు జరిగిన విద్యుత్‌ ఉద్యమంలోని ప్రధాన ఘట్టం బషీర్‌ ‌బాగ్‌ ‌కాల్పులు. ఈ ఘట్టంలో ప్రభుత్వం ఆదేశాలను తు.చ. తప్పకుండా పోలీస్‌ ‌వ్యవస్థ పాటించింది. ఉద్యమకారులు ముగ్గురు కాల్పులకు బలయ్యారు. పోలీస్‌ ‌వ్యవస్థను ప్రభుత్వం వాడుకుంటే ప్రజలకి జరిగే నష్టం ఏంటో మన తెలుగు ప్రజలకి బాగా తెలుసు. ప్రశ్నించే ప్రజలను తయారు చేసే ఉద్యమాలు జావకారి పోయాయి. ప్రజలను పరాజయం పాలు చేసి, వారిపై ఆధిపత్యం చేసే పోలీస్‌ ‌వ్యవస్థ ఏ మేరకు అభివృద్ధి చెందింది అనేది కీలక ప్రశ్న. భారత దేశంలో అంతకంతకు బలపడి ప్రభుత్వ రక్షక..ప్రజా భక్షక శాఖగా మారిన భారతీయ పోలీస్‌ ‌వ్యవస్థను ఓసారి పరిశీలిద్దాం.

1861లో పోలీస్‌ ‌వ్యవస్థ మన దేశ ప్రజలకి పరిచయమైంది. మన పోలీసు వ్యవస్థ బ్రిటిషర్లు తీసుకు వచ్చిన ‘పోలీస్‌ ఆక్ట్ 1861’ అనే పునాది మీద నిర్మితమైంది. బ్రిటిష్‌ ‌పాలనను వ్యతిరేకించే భారతీయులను అణిచివేయటానికి పోలీసు వ్యవస్థను పాలకులు దేశంలో ప్రవేశపెట్టారు. 72 సంవత్సరాల తరువాత కూడా మన పోలీసు వ్యవస్థ అదే ప్రాతిపదిక మీద పనిచేస్తున్నది. 1861 నుండి ఇప్పటికి పోలీస్‌ ‌వ్యవస్థలో చెప్పుకోదగిన మార్పులు లేకుండా చిన్న చిన్న మార్పులతో పాత విధానంలోనే సాగుతున్నది. ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీసులు పనిచేసేటట్లు వ్యవస్థలో ప్రభుత్వాలు మార్పులు తీసుకు రాలేదు. పాత పంథానే సాగిస్తున్నాయి. పోలీసు సంస్కరణల గురించి మొదటిసారి మనదేశంలో 1979లో చర్చ జరిగింది. నేషనల్‌ ‌పోలీస్‌ ‌కమిషన్‌ 1979 అనే నివేదిక పోలీసు వ్యవస్థలో తీసుకు రావాల్సిన కొన్నిసంస్కరణలను ప్రస్తావించింది. అయితే ఆ నివేదిక వెలుగులోకి రాలేదు. తర్వాత 1999లో రీబైఏరో కమిషన్‌ ఏర్పాటు చేసి మళ్లీ పోలీస్‌ ‌సంస్కరణలు గురించి మాట్లాడారు. అయినా పోలీసు వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోలేదు. మరోసారి 2000లో పద్మనాభయ్య కమిటీ కూడా ఏర్పాటు చేసారు. ఆశించిన విధంగా అంగుళం కూడా కదలిక లేదు. 2003లో మరో కమిటీ ఏర్పాటై, 158 అంశాలను సంస్కరణలుగా సిఫారసు చేసింది. అంతే కాక, ఎన్ని కమిటీలు ఏర్పాటైనా పోలీసు శాఖలో సంస్కరణలు అమలు నోచుకోలేని కూడా నిర్మొహమాటంగా పేర్కొంది. ఇదిలా ఉండగా, దేశంలో పోలీసు సంస్కరణల కోసం ఎన్ని కమిటీలు వేసినా, అవి ఎన్ని సిఫారసులు చేసినా అమలు ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నిస్తూ, 1996లో ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌ప్రకాష్‌ ‌సింగ్‌ ‌సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌వేశారు. సుప్రీమ్‌కోర్టు దీనిపై 10 సంవత్సరాల తర్వాత స్పందించి..2006 సెప్టెంబర్‌ 22‌న పోలీసు వ్యవస్థ ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వానికి ఏడు దిశానిర్దేశాలు జారీ చేసింది..
ఇవీ ఆ నిర్దేశాలు:
రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను ప్రభావితం చేయకుండా చూడడానికి స్టేట్‌ ‌సెక్యూరిటీ కమిషన్‌ ఏర్పాటుచేయాలి. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా బదిలీలు జరగకుండా సీనియర్‌ ‌పోలీస్‌ అధికారుల పదవీకాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. పోలీస్‌ ‌శాఖను ఇన్వెస్టిగేషన్‌.. ‌లా అండ్‌ ఆర్డర్‌ అని రెండు విభాగాలుగా విడదీయాలి. పోలీస్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ ‌బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు అధికారుల బదిలీలు, పదోన్నతులు పర్యవేక్షిస్తుంది. పోలీసులుపై ఉన్న ఫిర్యాదులు ప్రజలకు తెలియజేసేందుకు, పోలీస్‌ ‌కంప్లైంట్‌ అథారిటీ ఫర్‌ ‌సిటిజన్స్ ఏర్పాటు చేయాలి. నేషనల్‌ ‌సెక్యూరిటీ కూడా కమిషన్‌ ఏర్పాటు చేయాలి.మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలీస్‌ ‌వ్యవస్థను ఆధునీకరించడానికి గతంలో 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజ్‌ ‌ప్రకటించింది. ఈ మొత్తంతో పోలీసులు మరిన్ని ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఈ ప్రహసనాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా పోలీస్‌ ‌సంస్కరణలుగా పేర్కొంటూ వార్తా కథ•నాలు వండి వార్చింది.ఆగస్టు 28న బ్యూరో ఆఫ్‌ ‌పోలీస్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌సంస్థ స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఈ ఉత్సవాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా గౌరవ అతిథిగా హాజరయ్యారు. కొరోనా సంక్షోభం కారణంగా ఈ వేడుకలను వర్చువల్‌ ‌విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర హోమ్‌ ‌మంత్రిత్వశాఖ చేసిన తీర్మానం ప్రకారం 1970 ఆగస్టు 28న బ్యూరో ఆఫ్‌ ‌పోలీస్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ఏర్పాటైంది. పోలీసింగ్‌లో ప్రతిభను పెంచటం, పోలీస్‌ ‌సమస్యలను ఒక పద్ధతి ప్రకారం వేగంగా అధ్యయనం చేయటం, పోలీసుల మెలకువలలో శాస్త్ర సాంకేతిక అంశాల వినియోగం దీని ప్రధాన లక్ష్యాలు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా బ్యూరో ఆఫ్‌ ‌పోలీస్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌సంస్థ 49వ వ్యవస్థాపక దినోత్సవం ముగించుకొని 50వ ఏట అడుగుపెడు తున్నసందర్భంగా ఇలా అభివర్ణించారు. ‘‘బ్యూరో ఆఫ్‌ ‌పోలీస్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌కే బగైర్‌ అచ్ఛీ పోలీసింగ్‌ ‌కీ కల్పనా నహీ హో సక్తీ’’(బ్యూరో ఆఫ్‌ ‌పోలీస్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌లేకుండా మెరుగైన పోలీసింగ్‌ను ఊహించుకోలేం).
అమిత్‌ ‌షా ఇంతగా పొగిడిన పోలీస్‌ ‌వ్యవస్థ నిజంగా ప్రజలకి ఎంతగా ఉపయోగ పడుతున్నదో చూడాలంటే, దేశ అత్యున్నత పోలీస్‌ ‌వ్యవస్థగా పేర్కొనే ముంబయి పోలీస్‌ ‌పనితీరు గమనించాల్సి ఉంటుంది. దేశంలో అత్యాధునిక ముంబయి పోలీస్‌ ‌విభాగంలో, 2 లక్షల మంది పోలీసులు పనిచేస్తున్నారు. మొత్తం ముంబయి పోలీసు విభాగంలో 25 యూనిట్స్ ‌పనిచేస్తాయి. ముంబయి పోలీసులకు అత్యధిక బడ్జెట్‌ అం‌దుతుంది. మరి ఇంత పకడ్బందీగా ఉన్న ముంబయి పోలీసు ప్రజలకి ఉపయోగ పడేలా పనిచేసున్నదా..? 2014 నుంచి 2019 గణాంకాల ప్రకారం, ముంబయి పోలీసుల విజయ పరంపర రేట్‌ ‌నిరాశే మిగులుస్తున్నది. ముంబయి పోలీస్‌ ‌సైబర్‌ ‌విభాగం 4500 కేసులు నమోదు చేస్తే, కేవలం 1,000 కేసులు మాత్రమే పరిష్కరించగలిగింది. ముంబైలో 2000 బ్యాంకు మోసాల కేసులు నమోదు కాగా పరిష్కారం అయినవి కేవలం 200 మాత్రమే. వీటిలో కూడా సొమ్ము రాబట్టుకోవడం 5 శాతం కేసులు మాత్రమే. మహిళల లైంగిక వేధింపులు, మహిళలపై బెదరింపులు 1900 కేసులు నమోదయితే కేవలం 400 కేసుల లో మాత్రమే పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఇక నటుడు సుశాంత్‌ ‌సింగ్‌ ‘‘‌మరణం’’ కేసులో ముంబయి పొలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా కొమ్ముకాసింది మనం చూసాం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ ‌బడ్జెట్‌ 5852 ‌కోట్ల రూపాయలు విడుదల చేసింది. మన తెలంగాణ పోలీసులు దిశ వంటి సంఘ్టనలు జరక్కుండా చూడలేరు. దిశ వంటి సంఘటనలు జరిగాక ఉత్తర ప్రదేశ్‌ ‌పోలీసుల్లాగా ఎన్‌ ‌కౌంటర్‌ ‌చేయగలుగుతారని మనం చూసాం.. బషీర్‌ ‌బాగ్‌ ‌కాల్పులకు 20 ఏళ్ళు నిండిన నేపథ్యంలో మనం గమనించ వలసింది ప్రభుత్వాలని ప్రశ్నించే ప్రజలు బలహీన పడగా. ప్రజలను పరాజయం పాలు చేసే పోలీస్‌ ‌వ్యవస్థ మరింత బలపడింది. బలహీనపడ్డ ప్రజలుగా ఈ ప్రహసనాన్ని మనం స్వాగతించవచ్చా లేదా మీరే నిర్ణయించండి.

Leave a Reply