Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ఎప్పటి వరకు..?

“వైరస్‌ ఉం‌డే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించటం, వారికి పరీక్షలు నిర్వహించటం, పాజిటివ్‌ ‌వచ్చిన వారికి చికిత్స అందించటం. ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగాలంటే మిగిలిన సమాజం అంతా స్వీయ నిర్బంధాన్ని పాటించాలి. అప్పుడు వైరస్‌ ‌వ్యాప్తిని అదుపు చేయటానికి అవకాశం ఉంటుంది. అలా అని ఈ లాక్‌డౌన్‌ ‌సుదీర్ఘంగా కొనసాగించటం కూడా ఇబ్బందే. ఇటు ప్రజారోగ్యం, ఆర్థిక భారం, వైరస్‌ ‌వ్యాప్తిపై క్షేత్ర స్థాయి నివేదికలను బేరీజు వేసుకుని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటి వరకు వస్తున్న వార్తలను బట్టి చూస్తే లాక్‌డౌన్‌ ‌నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.”

Rehana2020 క్రికెట్‌ ‌మ్యాచ్‌లో స్కోర్‌ ‌బోర్డుని తలపిస్తు కొరోనా అనుమానిత కేసులు, మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి 18 రోజులు గడిచిపోయాయి. కేంద్రం చెప్పిన తేదీ ఏప్రియల్‌ 14. ‌కాని ఇప్పుడు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఏప్రియల్‌ 14 ‌తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తి వేసే ఆలోచన లేదని, తర్వాత కూడా ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తేయటం సాధ్యం కాదని ప్రధాని విపక్షాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. పంజాబ్‌ ‌రాష్ట్రం లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ అధికారికంగా ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాట పట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎంత కాలం లాక్‌డౌన్‌ ‌కొనసాగే అవకాశం ఉంది? ఒక వేళ లాక్‌డౌన్‌ ఎత్తేస్తే పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందా? ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తేస్తారా? విడతల వారీగానా ? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అందిరిలోనూ.

దేశవ్యాప్తంగా తాజా లెక్కల ప్రకారం ఐదు వేలకు పైగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా 160కు పైగా మరణాలు సంభవించాయి. తబ్లీగి జమాత్‌ ఉదంతంతో తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోనూ కొరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. కొరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండాలంటే లాక్‌డౌనే ప్రధాన ఆయుధం. కొరోనాపై యుద్ధంలో ప్రభుత్వాలు ప్రధానంగా మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నాయి. వైరస్‌ ఉం‌డే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించటం, వారికి పరీక్షలు నిర్వహించటం, పాజిటివ్‌ ‌వచ్చిన వారికి చికిత్స అందించటం. ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగాలంటే మిగిలిన సమాజం అంతా స్వీయ నిర్బంధాన్ని పాటించాలి. అప్పుడు వైరస్‌ ‌వ్యాప్తిని అదుపు చేయటానికి అవకాశం ఉంటుంది. అలా అని ఈ లాక్‌డౌన్‌ ‌సుదీర్ఘంగా కొనసాగించటం కూడా ఇబ్బందే. ఇటు ప్రజారోగ్యం, ఆర్థిక భారం, వైరస్‌ ‌వ్యాప్తిపై క్షేత్ర స్థాయి నివేదికలను బేరీజు వేసుకుని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటి వరకు వస్తున్న వార్తలను బట్టి చూస్తే లాక్‌డౌన్‌ ‌నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణా రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం అంగీకరించకపోయినా రాష్ట్రంలో 14 తర్వాత మరో పదిహేను రోజులు లాక్‌డౌన్‌ ‌కొనసాగించే ఆలోచన చేస్తున్నట్లు సీఎమ్‌ ‌కేసీఆర్‌ ‌స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.

లాక్‌డౌన్‌ ఎలా ఎత్తేస్తారు?
ఒక వేళ పరిస్థితులు చక్కబడినా దేశ వ్యాప్తంగా ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తివేయటం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌ ‌ప్రకటించినంత సులువుగా లాక్‌డౌన్‌ ఎత్తివేయటం సాధ్యం కాదు, శ్రేయస్కరం కూడా కాదు. ఒక నిర్దిష్ట విధానం అమలు చేస్తారు. ప్రధానంగా నాలుగు అంశాలు పరిగణలోకి తీసుకునే అవకాశాలుంటాయి. అటు దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా ముందు కొరోనా హాట్‌ ‌స్పాట్‌లను గుర్తిస్తారు. హాట్‌ ‌స్పాట్‌లంటే కేసులు ఎక్కువగా నమోదు అయిన, మరణాలు సంభవించిన ప్రాంతాలు. అక్కడ లాక్‌డౌన్‌ ‌మరింత ఎక్కువ కాలం కొనసాగుతుంది. సూక్ష్మ స్థాయిలో నిశితంగా అక్కడి పరిస్థితులను, వైరస్‌ ‌విస్తరణను పరిశీలిస్తారు. ఆ ప్రాంతానికి మిగిలిన అంటే వైరస్‌ అదుపులోకి లేదా విస్తృతి తక్కువగా ఉన్న ప్రాంతాలతో సంబంధాలను తెంచేస్తారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 19 హాట్‌ ‌స్పాట్‌లు ఉన్న 15 జిల్లాలను ఈ నెల 15 వరకు పూర్తిగా మూసివేసింది. అంటే ఆ జిల్లాలకు రాకపోకలకు బ్రేక్‌ ‌వేసింది.

కోవిడ్‌ 19‌ను అదుపు చేయటానికి ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇక ఆచితూచి అడుగులు వేయాల్సిన రెండో అంశం పబ్లిక్‌ ‌ట్రాన్స్‌పోర్ట్. ‌లాక్‌డౌన్‌ ఒక్కసారిగా తీసేస్తే ప్రజలందరూ ఒక్కసారే రోడ్ల మీదకు వస్తారు. ఒకరిద్దరిలో వైరస్‌ ఉన్నా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే కొంత కాలం దూర ప్రయాణ సాధనాలకు పచ్చజెండా ఊపకపోవచ్చు. ట్రైన్లు, బస్సులు, మెట్రో వంటి ప్రయాణ సాధనాల వల్ల వైరస్‌ ‌తొందరగా ప్రబలే ప్రమాదం ఉంటుంది. ఏ రైళ్లను మళ్లీ ట్రాక్‌ ‌మీదకు తీసుకురావాలి అనేది కేంద్రానికి పెను సవాలుగా మారుతుంది. అటు అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక అంశాలు కూడా ముఖ్యం కనుక పరిమిత సర్వీసులను పరిమిత దేశాలకు పునరుద్ధరించినా, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే పూర్తి స్థాయి పరీక్షలు చేసి నెగటివ్‌ ‌రిపోర్ట్ ‌వస్తేనే ప్రయాణానికి అనుమతించటం వంటి చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. దీని కోసం ఎయిమ్స్ ‌తాజాగా ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.

మూడో అంశం జనసమీకరణ విషయాలపై ఆంక్షలు. అంటే సినిమా హాళ్లు, మాల్స్, ‌మతపర సమావేశాలు, సభలు, భారీ విందులు, మ్యూజిక్‌ ‌కన్సర్టస్ ‌నిర్వహణకు మరికొంత కాలం నిషేధం కొనసాగించవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్కువ మంది జనం ఒక చోట పోగయ్యే అవకాశం ఉన్న కార్యక్రమాలపై ఆంక్షలుంటాయి. ఇవి కూడా హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉన్న ప్రాంతాలు. కమ్యూనిటీ ట్రాన్స్ ‌మిషన్‌ను అడ్డుకోకపోతే పరిస్థితులు చేయి దాటి పోతాయి. ఇక ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించే మరో విషయం విద్యా సంస్థలు. కొరోనా ప్రభావం తీవ్రమయ్యే సమయానికి ఎలిమెంటరీ నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థల్లో సిలబస్‌ ‌దాదాపు 80, 90 శాతం పూర్తయ్యి పరీక్షల దశలో ఉన్నాయి. కొన్ని రకాల పరీక్షలు 80 శాతం వరకు పూర్తయ్యాయి. విద్యా సంవత్సరపు వేసవి సెలవులు ముందుగానే మొదల్యయాయి. కొరోనా ప్రభావం నుంచి పూర్తిగా బయటపడితే కాని విద్యా సంస్థలు తిరిగి తెరిచే పరిస్థితి ఉండదు. సగటున విద్యా సంస్థలు విద్యార్ధుల సంఖ్య వందా, రెండు వందలకు తక్కువ ఉండదు. పైగా చిన్నారులు సోషల్‌ ‌డిస్టెన్స్ ‌వంటివి పాటించటం ఆచరణ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే విద్యా సంవత్సరాన్ని కచ్చితంగా జూన్‌లోనే తెరవకపోయినా వచ్చే నష్టం ఉండదు. అయితే ఏప్రియల్‌, ‌మే నెలలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల నిర్వహణ ఉంటుంది. కొరోనా నేపథ్యంలో చాలా పరీక్షా నిర్వహణ సంస్థలు ఆన్‌లైన్‌ ‌పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇది ఒక రకంగా ఉన్నంతలో సమస్యలను అధిగమించే ప్రయత్నం.

దశల వారీ లాక్‌డౌన్‌…
ఏ ఏ అం‌శాలపై ఆంక్షలు ఉండాలి అనుకునే సందర్భంలోనే వేటికి వెసులుబాటు కల్పించవచ్చు అనేది కూడా ప్రభుత్వ విధానాల్లో కీలక అంశం. ఎంత తొందరగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే పరిస్థితులు వస్తే మన ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రంగం ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రజానీకం అంత తొందరగా ఊపిరి పీల్చుకుంటారు. ఒక వైపు వైరస్‌పై పోరును కొనసాగిస్తూనే మరోవైపు ఒక్కో జిల్లాను కొరోనా ఫ్రీగా చేసుకుంటూ వెళ్లటం ప్రభుత్వం ముందు ఉండే సవాలు. ఒక దాని తర్వాత ఒక జిల్లాను కొరోనా వైరస్‌ ‌లేని ప్రాంతంగా మార్చుకుంటూ రావటం, ఆ సమయంలో మిగతా ప్రాంతాల నుంచి ప్రజలు ఎవరూ ఆ జిల్లాలకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవటం ముఖ్యం. అప్పుడు కొత్త కేసులు నమోదు కాకుండా ఉంటాయి. అలాగే ఇబ్బంది లేని, ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన శాఖలకు అవకాశం కల్పించటం ఇలా దశల వారీగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించటం, మాస్క్‌లు, శానిటైజర్స్ ‌వాడకం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ కొన్నింటికి అనుమతులు ఇవ్వచ్చు. ఏది ఏమైనా ఈ నెలాఖరు దాటితే కాని వైరస్‌ ‌విస్తరణ ఎలా ఉంది? ఏ స్థాయిలో ఉంది అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు స్వీయ నియంత్రణకే మన ముందు ఉన్న ఏకైక రక్షా మార్గం.

Leave a Reply