Take a fresh look at your lifestyle.

‘‘‌హైదరాబాదు విలీనం అయిన విధంబు ఎట్టి దనిన’’

భారతదేశ చరిత్రలో సెప్టెంబర్‌ 17 1948 ‌చిర స్మరణీయమైన దినం. భారత్‌ ‌సేనాధి పతుల వ్యూహరచన చాతుర్యానికి, సేనల అసమాన పరాక్రమానికి ప్రతిష్ట చేకూర్చిన రోజు. కోటిన్నర ప్రజల చిర వాంఛ ఫలప్రద మైన రోజు. హైదరాబాద్‌ ‌పై భారత ప్రభుత్వ పోలీసు చర్య విజయ వంతంగా ముగిసిన సంఘటనకు సాక్ష్యం అయిన రోజు. దక్షిణ ప్రాంత భారత సర్వ సేనాని లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌మహారాజా రాజేంద్ర సింహ్‌ ‌జీ సాటిలేని మేటి వ్యూహ రచనకు నిలువు టద్దంగా నిలిచిన రోజు. సెప్టెంబర్‌ 13 ‌వ తేదీ తెల్లవారు జామున మూడు గంటలకు భారత సేనలు సంస్థానం నలువైపుల నుండి ‘‘చలో సికింద్రాబాద్‌’’ అని ముందు అడుగు వేశాయి. సికింద్రాబాద్‌ ‌చేరవలసిన ప్రధాన సేనా వాహిని మేజర్‌ ‌జనరల్‌ ‌జయంత్‌ ‌నాథ్‌ ‌చౌదరి నాయకత్వంలో షోలాపూర్‌ ‌నుండి నేరుగా సికింద్రాబాదుకు బయల్దేరింది. ఈ సేనలో ఒక దళం నల్‌ ‌దుర్గ్ ‌నుండి ఉత్తరంగా జాల్నా మీదికి సాగింది. దక్షిణాన హోస్పేట వద్ద, మైసూర్‌ ‌సేనకు సంబంధించిన బ్రిగేడియర్‌ ‌బాల్‌, ‌మధ్య ప్రాంతం డి ఐ జి పార్థసారథి అయ్యంగార్‌ ‌నేతృత్వంలో మైసూర్‌ ‌సేన, కొంత మద్రాస్‌ ‌ప్రత్యేక పోలీసు దళం, మరికొంత మునీరాబాద్‌ ‌వద్ద తుంగభద్ర పై గల వంతెనను స్వాధీన పరచుకొని ముందుకు సాగాయి. కొంచెం తూర్పుగా కర్నూల్‌ ‌వద్ద మైసూర్‌ అశ్వికదళం జాతీయ పోలీసు బలగం తుంగభద్ర రైలు వంతెన స్వాధీన పరచుకొని గద్వాల్‌ ‌దిశగా సాగాయి.

విజయ వాడ వద్ద నుండి బ్రిగేడియర్‌ ‌మదన్‌ ‌సింగ్‌ ఆధ్వర్యంలో ఒక సేనా దళం ఉత్తర ప్రాంత డిఐజి సుబ్బరాయన్‌ ఆద్వర్యంలో కొంత పోలీసు బలగంతో బయలు దేరాయి. సేవాదళం రెండు భాగాలుగా విడివడి… ఒకటి రైలు మార్గం వెంట ఖమ్మం మీదుగా వరంగల్‌, ‌రెండవది సూర్యాపేట మీదుగా సికింద్రాబాద్‌ ‌లక్ష్యాలుగా పురోగమించాయి. ఉత్తరాన కొంత సేన, కొంత పోలీసు బలగం బాలార్ష ను ఆక్రమించాయి. ఆ సమీపంలో గోదావరి పై గల రైలు వంతెనకు ప్రమాదం లేకుండా చేశాయి. పడమరగా కానేర్గాం వద్ద నుండి కొంత పోలీసు బృందం, హింగోలి దిశగా బయలు దేరగా, వాయవ్యంగా తాల్వాద్‌ ‌నుండి ఒక సైనిక దళం ఔరంగాబాద్‌ ‌కు సాగింది. షోలాపూర్‌, ‌విజయవాడ, తాల్వాద్‌ ‌నుండి బయల్దేరిన ప్రధాన సేన దళాలు… ఎలాంటి ప్రతిఘటనలు కేంద్రీకృతం కాకుండా చేసేందుకు, స్వాధీనమైన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు, సంఘ విద్రోహ శక్తులను మట్టుపెట్టే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. హోస్పేట, కర్నూలు, విజయవాడ నుండి బయలు దేరిన బలగాలు మద్రాస్‌ ‌ప్రాంత సేనాని మేజర్‌ ‌జనరల్‌ ‌రుద్ర పర్యవేక్షణ కింద పని చేశాయి. ఈ దండయాత్రలో సిక్కులు గూరా?లు మద్రాసు బొంబాయి తదితర పోలీసులు పాల్గొన్నారు.

సేనాధిపతులలో ఇరువురు ఆంగ్లో-ఇండియన్లు కూడా ఉన్నారు. 13వ తేదీ సూర్యోదయం వేళ భారత వైమానిక దళాలు విజయవాడ ప్రాంతం నుండి ఎయిర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌ ‌ముఖర్జీ నాయకత్వంలో, నిజాం సంస్థానం లోని వరంగల్‌ ‌బీదర్‌, ఔరంగబాద్‌ ‌విమానాశ్రయాలను ఆనవాళ్లు లేకుండా చేశాయి. వాస్తవానికి భారత సేనలు సంస్థానం లోకి తరలి వస్తున్న విషయం 13వ తేదీ ఉదయం 11గంటలకు కానీ బయటకు తెలియనే లేదు. ఢిల్లీలో ఈ విషయాన్ని భారత ప్రభుత్వం బహిర్గతం చేసింది. భారత సైన్యం మెరుపు వేగంతో అన్నివైపుల నుండి సికింద్రాబాద్‌ ‌వైపు, హైదరాబాద్‌ ‌వైపు బలగాలు అవిశ్రాంతంగా ముందుకు సాగాయి. 14న మధిర అలంపూరుబీ 15న వనపర్తి, దౌలతాబాద్‌, ‌సూర్యాపేట, ఖమ్మం మెట్టు, హోమ్నాబాదు, ఔరంగాబాదు భారత సేనల వశమైనాయి. హోమ్నాబాదు పతనంతో, భారత సేనలు సికింద్రాబాదుకు 10 మైళ్ళ పరిధిలోకి వచ్చాయి. అలా ముందుకు వెళ్లి ఆ రాత్రికి జహీరాబాద్‌ ‌చేరాయి. నిజాం నవాబుకు దిక్కు తోచని స్థితి ఎదురయింది. ఇలాంటి స్థితిలో జార్జి రాజుకు, ట్రూమన్‌ ‌కు విజ్ఞప్తులు పంపు కున్నాడు. అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. 16వ తేదీన వరంగల్‌, ‌బీదర్‌, ‌జాల్నా, సిర్వూగు, నారేటుపల్లి, సదాశివపేట సేనల వశమయ్యాయి. ఆరోజున అటు సోలాపూర్‌ ‌నుండి నేరుగా సికింద్రాబాద్‌ ‌వెళ్తున్న దళము, ఇటు విజయవాడ నుండి సూర్యాపేట సికింద్రాబాద్‌ ‌రహదారిపై వెళుతున్న దళము నువ్వా నేనా అంటూ పోటీపడి ముందుకు సాగాయి.

17వ తేదీన హింగోలి సేనల వశమైంది. ప్రధాన దళాలు రెండు హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌నగరాల శివార్లకు చేరుకున్నాయి. దక్షిణ ప్రాంత సర్వ సేనాధిపతి రాజేంద్ర సింహ్‌ ‌జీ నిజాంను ఉద్దేశించి… ‘‘ఇక లాభం లేదు. లొంగీ పోయి అనవసర అయాచిత ప్రాణ నష్టం లేకుండా చూసుకోండి’’ అంటూ హితవు పలికారు. ఇక గత్యంతరం లేదని గ్రహించిన 17వ తేదీ సాయంత్రమే దాసోహం అన్నాడు. హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని, కనీసం పాకిస్తాన్‌లో నైనా విలీనం చేయాలని విశ్వ ప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను ఉక్కుమనిషి పటేల్‌ ‌బద్దలు కొట్టాడు. నిజాం ఐక్యరాజ్య సమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతలను కూడా పంపాడు. భారత దేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్‌అలీ నాటకాలు, పటేల్‌ ఎదుట పనిచేయ లేదు. పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచార సాధనాలు తెగి పోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళ బేరానికి దిగాడు. లొంగు బాటుకు మించిన తరుణోపాయం లేదని మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోక తప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్‌ ‌పటేల్‌ ఎదుట తలవంచి లొంగి పోవడంతో 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply