వేధింపులకు కుటుంబం ఆత్మహత్యాయత్నం
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) అధికారులకు ప్రభుత్వ అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఏసిబికి చిక్కి జైలుకు వెళ్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం లంచం తీసుకోవడం మాత్రం ఆగడం లేదు. లంచం డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడంతో ఓ కుటుంబం ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది బొల్లారంలో. వివరాల్లోకి వెళ్లితే…పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీకి చెందిన చింతా ప్రభాకర్ సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు స్థలాన్ని కొనుక్కుని ఇల్లు కట్టుకోవడం జరిగింది.
నూతనంగా నిర్మించిన ఇంటికి నెంబర్ ఇప్పిస్తానని మస్కూరి పనిచేసే నర్సింలు 20 వేల రూపాయలు లంచం అడిగారని బాధితులు చింత ప్రభాకర్ కుటుంబ సభ్యులు తెలిపారు. లంచం ఇవ్వనందున అక్రమంగా ఇల్లు నిర్మించారని రెవెన్యూ అధికారుల సమక్షంలో నూతనంగా కట్టిన ఇంటిని కూల్చి వేయడంతో నిస్సహాయస్థితిలో బొల్లారం మున్సిపల్ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన చింత ప్రభాకర్ భార్య లక్ష్మీ, కూతురులు తేజస్వి, అక్షయలు. తమను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్న సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమను వేధించిన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.