Take a fresh look at your lifestyle.

‘‘ఆశల తోవలు’’

మబ్బుల్ని మింగిన ఆకాశం
నెత్తురొడ్డిన  జాతీయ రహదారిలా..
సెగలు కక్కుతోంది!
బారెడు  పొద్దుతో-నిద్దుర లేసిన
బలిసిన అంబోతులు
ఆకలితో అరుస్తుంటే..
బక్కచిక్కిన ఎండిన డొక్కలు
ప్రాణాలు  గుప్పిట్లో పెట్టుకొని
బతుకులు నెట్టుకొస్తున్నారు!!

రోడ్డు పక్కన  పూరిగుడిసెలో..
తొంబదేళ్ల పండు ముసలవ్వ
కుక్కి మంచం పై.. ములుగుతూ
రాని చావుకోసం ఎదిరిచూస్తుంటే
ఎవ్వరు లేని అనాధకు అన్ని తానై..
శునకమొక్కటి  అవ్వకు ఓదార్పునిస్తుంటే..!
ఎంగిలి మెతుకులు తిన్న..
మమకారమో !..  తోకాడిస్తూ..
దారేంటూ పోయే వారిని చూసి
చొంగ  కారుస్తూ..  బేల  మొఖం తో
ఆర్థిస్తుంటే.. అవ్వకోసం. ఆ గుడిసె
తలుపులను గుడి గంటలా
మోగిస్తుంది!

కలల్ని తరిమిన నిదుర మత్తు
పొద్దు పొడిచేటప్పటికి
ఆశల తోవలు దున్నిందేమో..
రాతిరి కురిసిన వానకి
చిత్తడయిన పంట కల్లంలో
ఆరబెట్టిన ధాన్య రాసులు
తడిసి ముద్దయి  కన్నీళ్లు
రాలుస్తున్నాయి!
వున్నోడిని వదిలి
కాయకష్టం నమ్ముకునోన్ని
నట్టేట్ట ముంచడం కాలానికి
అలవాటైపోయిందేమో..
ఏడాదంతా  ఎదిరిచూసిన
ప్రతిఫలానికి.. ఆకలి చావులు
బహుకరించి చల్లగా జారుకొంది!!

నిర్మలమైన ఆకాశం..
నిప్పుల రాజుకోవడం..
పచ్చని అడవిని ధ్వంసం చేసి
కాసుల గనుల కక్కుర్తికీ
బహుళ జాతులకు తాకట్టు
పెట్టి..ఉసురు తీసినందుకో మరి!!
ఉన్నప్పుడు జలగలా పీడించి
ఉన్నందంతా దోచుకొని అనాధల
వదిలేసి.. బాధ్యతలు మరిచిన
మనిషికన్నా..అప్పుడప్పుడు
విదిలించిన పిడికెడు మెతుకులకు
ప్రేమను ఓలకపోసిన.. తనకన్నా
జంతువే నయమని తెలిసి..
మనిషిగా  సిగ్గుపడాలి మరి!!
రాత్రి పగలు తేడాలేని..
కాలం తో పోటీపడి..
నల్గురికి కడుపునింపే
అన్నదాత.. శోకవిహీనుడై
అలమటిస్తుంటే.. ఆదు కోవాల్సిన
అధికారం.. మీనామీషాలు
లెక్కిస్తుంటే . ప్రకృతి చేసే
గారడీ ఆటకి బలిపశువులయ్యే
అమాయకులకు ఆశల తోవాల్ని
అడ్డుపెట్టి మనస్సు గాయాలకు
పథకాల లేపనం పూసి..
అడుక్కొనే బానిస బతుకులను
చేసి..ఓట్లు వేసే మరమనుషులు గా
మార్చి.. మానవత్వం మరిచిపోయి..
మనుసుల మనుషుల మధ్య

కుల మత ప్రాంతీయ బేధాలు
రగిల్చి రావణ కాష్టం  చేస్తుంటే..
ఇక జాలి దయ కరుణ లు
వదిలి.. వాస్తవం లో
మనిషి జీవించినప్పుడే..
స్వయం సమృద్ధి వైపు
అడుగులేస్తాడు..! మనసు
పొరల్లో ప్రేమ అనురాగాలు
చిగురింపచేసి . పర్యావరణ
పరిరక్షణ కు..
నడుము కడతాడు..!
స్వార్థ పరుల కొమ్ములు వంచి
తెగిపోయిన బంధాలకు..
ఆత్మీయ అన్వేషణ చేయ
కొడగట్టిన బతుకు దీపం
వొత్తికీ ఆశల తోవలా
చమురు పోసి రేపటి
నవోదయానికి
పురుడు పోస్తాడు..!!

రవీందర్‌ ‌కొండ, 9848408612, ఆల్వాల్‌, ‌హైదరాబాద్‌

Leave a Reply