Take a fresh look at your lifestyle.

హోమియోపతి వైద్యం..శాస్త్రీయత?

“కెనడా యూనివర్సిటీలో హోమియోపతిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. కొంత మంది విద్యార్థులకు వాక్సిన్‌ ఇచ్చి మరి కొంత మందికి హోమియో, ప్లేసిబో మందులు ఇచ్చి ప్రయోగాలు చేసి చూస్తే వాక్సిన్‌ ఇచ్చిన విద్యార్థుల శరీరాల్లో వైరస్‌లను తట్టుకునే యాంటీబోడీస్‌ ‌తయారయ్యాయి. అదే సమయంలో హోమియో ప్లేసిబో మందులకు విద్యార్థుల శరీరాల్లో యాంటీబోడీస్‌ ‌తయారు కాలేదు. బ్రిటన్‌ ‌పార్లమెంటు హోమియోపతిపై సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ కమిటీతో పరిశోధనలు చేయించింది. కమిటీ హోమియోపతి వలన ఉపయోగంలేదని, పైగా హోమియోపతి వైద్యం ప్రమాదకారి అని బ్రిటన్‌ ‌పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది.”

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీజీ ప్రజలు ఏదైనా ఒక విషయంలో తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉంటే వారితో తీవ్రంగా విభేదించే వారు..! ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోవడం వల్ల నాయకత్వానికి ప్రమాదం రావొచ్చని సన్నిహితులు సూచించినా ఆయన ఖాతర్‌ ‌చేసేవారు కాదు. నాయకత్వం కోసం తను నమ్ముకున్న సిద్ధాంతాలతో ఏనాడూ రాజీపడ లేదు. అయితే నేడు అంత విలువలు గల నాయకులు మనకు లేరనే చెప్పాలి. నేడు ప్రజలకి నాయకత్వం వహించటం అంటే ప్రజల మనసులో వున్నది పసి గట్టి ఆమేరకు నడుచుకోవటం. ప్రజా అభిప్రాయం ప్రకారం నడుచుకుని తాను బలమైన నాయకుడిని అని చెప్పుకోవటమే నేటి ట్రెండ్‌. ఈ ‌ట్రెండ్‌ ‌మన ప్రధాని చక్కగా ఫాలో అవుతారు. ఉదాహరణకు ..దేశంలో అత్యధిక ప్రజలు హోమియోపతి మందులను నమ్ముతున్నారని ప్రధానమంత్రి మోడీకి తెలుసు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14‌న ప్రధాని మోడీ ఇచ్చిన ప్రసంగంలో ఏడు సూత్రాలలో ఒకటిగా ఆయుష్‌ ‌మంత్రాలయం చెప్పిన మందులను వాడి కరోనా వైరస్‌ను ఎదుర్కోండి అని పిలుపునిచ్చారు. ఫలితంగా కరోనాకి హోమియోలో మందు వుంది అన్న అపోహ పెద్ద ఎత్తున ప్రజలలో ప్రబలుతున్నది. ఇటీవల మోడీ కేబినెట్‌ ‌మంత్రి మరో మెట్టు ఎక్కి హోమియోపతి మందుల గురించి ప్రచారం చేసి అపహాస్యం పాలయ్యారు. గత నెల మార్చి 25న బ్రిటన్‌లో ప్రిన్స్ ‌చార్లెస్‌కు కరోనా వైరస్‌ ‌సోకిందని తేలింది. ఆయుష్‌ ‌మంత్రాలయం మంత్రి శ్రీపాద ఏసో నాయక్‌ ‌హోమియోపతి మందులతో ప్రిన్స్ ‌చార్లెస్‌కు చికిత్స ఇచ్చారని ప్రకటించారు. వెంటనే బ్రిటన్‌ ‌ప్రిన్స్ ‌చార్లెస్‌ ఆఫీస్‌ ‌నుంచి ప్రెస్‌ ‌రిలీజ్‌ ‌వచ్చింది. బ్రిటన్‌ ‌రాజు ప్రిన్స్ ‌చార్లెస్‌కు హోమియోపతి ద్వారా చికిత్స జరగలేదని హోమియోపతి మందులు అతి ప్రమాదకరం అంటూ బ్రిటన్‌ ‌ప్రిన్స్ ‌చార్లెస్‌ ఆఫీస్‌ ‌పత్రిక ప్రకటన విడుదల చేసింది. బ్రిటన్‌ ఈ ‌తీరుగా స్పందించటానికి కారణం బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ‌హోమియోపతి మందులు మంచివా కావాఅని తేల్చేందుకు పరిశోధన చేయమంటూ బ్రిటిష్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ విభాగానికి ఆదేశిస్తే ఆ విభాగం హోమియో మందులపై పరిశోధనలు చేసి బ్రిటిష్‌ ‌పార్లమెంటుకి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టులో హోమియో మందుల వాల్ల ఉపయోగం లేదని, పైగా ప్రమాదం కూడా అని వుంది. దీనితో బ్రిటన్‌ ‌హోమియో వైద్యాన్ని బాన్‌ ‌చేయాలి అని ఆలోచిస్తున్నది. ఇదే బాటలో స్పెయిన్‌ ‌దేశం కూడా ఆలోచిస్తున్నది. ఇక ఆయుష్‌ ‌మంత్రాలయం గురించి చెప్పుకోవాలి అంటే ఈ మంత్రాలయం కింద ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి విభాగాలు ఉంటాయి.

ఈ విభాగాల అన్నింటిలో హోమియోపతి వైద్య విభాగం అత్యంత వివాదాస్పదమైనది. హోమియోపతి వైద్యం చుట్టూ చాలా వివాదాలు ప్రపంచ వ్యాపితంగా ఉన్నాయి. ఈ వైద్యం చుట్టూ చాలా వివాదాలు ఉన్నప్పటికీ ప్రజలు హోమియోపతిని నమ్ముతూ కరోనా వైరస్‌కి చెక్‌ ‌పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. హోమియోపతి మందులకు అనుకూలంగా మాట్లాడేవారు నాలుగు రకాల వాదనలు ఇస్తారు. అవేంటో చూద్దాం.

  1. హోమియోపతి పురాతన భారతీయ ఔషధ సంస్క ృతి. ఈ వాదన తప్పు. హోమియోపతి వైద్యాన్ని జర్మన్‌ ‌ఫిజీషియన్‌ ‌శామ్యూల్‌ ‌హానేమాన్‌ ‌కనిపెట్టారు. మన దేశానికి హోమియోపతిని పరిచయం చేసినది శామ్యూల్‌ ‌హనేమాన్‌ ‌ఫ్రెంచ్‌ ‌శిష్యుడు డాక్టర్‌ ‌హానిగబెర్జర్‌. 1839‌లో డాక్టర్‌ ‌హానిగబెర్జర్‌ ‌కలకత్తాకి వచ్చినప్పుడు హామియోపతి మందులు మన దేశానిలోకి తెచ్చారు.
  2. హోమియోపతి భిన్నమైన శరీరాలకు చక్కగా సరిపోతుంది. ఈ వాదం పరిశోధనలలో తప్పని తేలింది.
  3. హోమియోపతి వైద్యంకు ప్రత్యేక ఉద్దేశం ఉంది. ఈ వాదానికి సైంటిఫిక్‌ ఆధారం లేదు.
  4. హోమియోపతి వైద్యం వ్యాక్సిన్‌కు సమానమైనది. అత్యంత ప్రమాదకరమైన వాదన. తక్కువ పరిణామంలో హోమియో మందులు ఇస్తారు కనుక ఈ వాదం బాగా ప్రచారం పొందింది. ఇందులో వాస్తవం లేదు. ఈ అవాస్తవ వాదన వలన వైద్యంలో జబ్బు సమయాన్ని వృథా చేసుకుని ప్రాణం మీదకు తెచ్చుకున్న సంఘటనలు వున్నాయి.

- Advertisement -

హోమియో వైద్యం అవగాహన రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది జబ్బే జబ్బును నయం చేస్తుంది. ఈ వాదన వలన కూడా హోమియోపతి వాక్సిన్‌కి సమానం అన్న భావన ప్రచారం పొందినది. ఉదాహరణకు ఆధునిక మెడిసిన్‌లో మసూచి వాక్సిన్‌లో మసూచికి కారణం అయిన వైరస్‌ను బలహీన పరచి, ఆ బలహీన పరచిన వైరస్‌ను శరీరంలోకి ఎక్కిస్తారు. తద్వారా శరీరం బలమైన ప్రమాదకారి అయిన మసూచి వైరస్‌ను చంపే యాంటీబాడీస్‌ ‌తయారు చేసుకునేలా శరీరానికి నేర్పుతారు. ఇదే పక్రియ హోమియోపతిలో కూడా జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఈ నమ్మకానికి బలం చేకూర్చే విధంగా రెండవ అవగాహనా వుంది. ఈ అవగాహన ప్రకారం హోమియో మందుల డోసేజ్‌ ‌తక్కువ మోతాదులో ఇవ్వాలి. అయితే వాస్తవాలు వేరని పరిశోధనలలో తేలింది. హోమియో మందులు ఎలా తయారు చేస్తారో చూద్దాం. హోమియో మందులు మొక్కలు, జంతువులు, మినరల్స్ ‌నుంచి తీసిన మూలకలను నీరు లేదా ఆల్కహాల్‌తో కలిపి తయారు చేస్తారు. నీటిలో లేదా ఆల్కహాల్‌లో కలిపినా మొక్కల, జంతువుల, మినరల్స్ ‌నుంచి తీసిన మూలకలు నామ మాత్రం వుండే అంతగా మందులను డైల్యూట్‌ ‌చేస్తారు. అందుకే ఈ మందులను అతి తక్కువ పరిణామంలో ఎక్కువ కాలం తీసుకోవాలి అని చెబుతారు.

హోమియోపతి మందుల తయారీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు తగు అవగాహన లేదు.హోమియోపతిలో వ్యక్తికి జబ్బు వస్తే కనిపించే లక్షణాలు శరీరానికి సంబంధించినవిగా పరిగణిస్తారు. అదే ఆధునిక వైద్యంలో వ్యక్తికి జబ్బు సోకితే కనిపించే లక్షణాలు జబ్బుకు సంబంధించినవిగా పరిగణిస్తారు. హోమియోపతి పని చేస్తుందో లేదో అన్న విషయంపై పలు పరిశోధనలు జరిగాయి. హోమియోమందులు ప్లేసిబో ప్రభావం చూపుతాయి అని పరిశోధనలలో తేలింది. ప్లేసిబో ప్రభావం అంటే రోగికి మానసిక ప్రశాంత ఇవ్వటం.తనకు మంచి వైద్యం అందుతున్నదన్న భ్రమలో ఉంచటం. ప్లేసిబో ప్రభావంతో రోగులు వైద్యం అందుతున్నది అన్న భ్రమలోకి పోతారు. తద్వారా చాలా కాలయాపన జరుగుతుంది. మాములు జలుబు దగ్గు వచ్చిన రోగికి ఈ ప్లేసిబో ప్రభావం వల్ల జరిగే నష్టం ఉండకపోవచ్చు. కానీ కరోనా వైరస్‌ ‌వంటి ప్రమాదకారి వైరస్‌ ‌సోకి వచ్చే జలుబు దగ్గు ప్రమాదకారి. వీటికి హోమియోపతి అంటే కాలయాపన జరిగి ప్రాణం పోతుంది. కెనడా యూనివర్సిటీలో హోమియోపతిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. కొంత మంది విద్యార్థులకు వాక్సిన్‌ ఇచ్చి మరి కొంత మందికి హోమియో, ప్లేసిబో మందులు ఇచ్చి ప్రయోగాలు చేసి చూస్తే వాక్సిన్‌ ఇచ్చిన విద్యార్థుల శరీరాల్లో వైరస్‌లను తట్టుకునే యాంటీబోడీస్‌ ‌తయారయ్యాయి. అదే సమయంలో హోమియో ప్లేసిబో మందులకు విద్యార్థుల శరీరాల్లో యాంటీబోడీస్‌ ‌తయారు కాలేదు. బ్రిటన్‌ ‌పార్లమెంటు హోమియోపతిపై సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ కమిటీతో పరిశోధనలు చేయించింది. క్రమిటీ హోమియోపతి వలన ఉపయోగంలేదని, పైగా హోమియోపతి వైద్యం ప్రమాదకారి అని బ్రిటన్‌ ‌పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది. దీనితో బ్రిటన్‌ ‌హోమియోపతిని బ్యాన్‌ ‌చేయాలని యోచిస్తున్నది. ఒక్క బ్రిటన్‌ ‌మాత్రమే కాకుండా స్పెయిన్‌ ‌కూడా హోమియోపతి బ్యాన్‌ ‌చేయాలి అని ఆలోచిస్తున్నది. ఇంత వివాదాస్పదమైన హోమియోపతి మన దేశంలో ఎలా మనగలుగుతోంది..? పాతకాలంలో హోమియోపతిని సమర్థించిన వారు స్వామి వివేకానంద, టాగోర్‌, అరబిందో, గాంధీజీ. వీరు తమ జీవితాలలో ఏదో ఒక సమయంలో హోమియో మందులను వాడారు. ఈ మందులకు వత్తాసు పలికారు. సమాజంలో పలుకుబడి ఉన్నవారి అండ దొరకటంతో హోమియోపతి భారతీయ వైద్యం అన్న అసత్యం సమాజంలో ప్రబలిపోయింది. ఫలితంగా నేడు మనదేశంలో హోమియోపతి అతి పెద్ద మార్కెట్‌. ‌భారతదేశంలో 185 హోమియోపతి కాలేజీలు ఉన్నాయి. 300కుపైగా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. 2 లక్షల రిజిస్టర్డ్ ‌హోమియోపతి డాక్టర్‌లు ఉన్నారు. ప్రతిసంవత్సరం 12వేల మంది కొత్త హోమియోపతి డాక్టర్లు వస్తున్నారు. హోమియోపతి మెడిసిన్‌ ‌మార్కెట్‌ 2500 ‌కోట్ల విలువ చేస్తుంది. ప్రతి యేడు 25% నుంచి 30% ఈ మార్కెట్‌ ‌పెరుగుతున్నది. దేశంలో 10 లక్షల మంది ప్రజలు హోమియోపతి మందు వాడుతున్నారు. ఈ విధంగా భారత దేశంలో ఆధునిక వైద్యం, ఆయుర్వేదం తర్వాత అత్యంత పాపులర్‌ ‌వైద్యం హోమియోపతి అయిపోయింది.

హోమియోపతిలో వైద్యం ఎలా చేస్తారో చూద్దాం. హోమియో డాక్టర్‌ ‌దగ్గరికి రోగి వస్తే రోగి చెప్పిన లక్షణాల ఆధారంగా జబ్బు పేరు చెబుతారు. అనక అతికొద్ది పరిమాణంలో హోమియోపతి మందులు ఇచ్చి కొంతకాలం గడిచాక పి24 టెస్ట్ ‌చేస్తారు. పి24 అంటే ఒక యాంటిజెన్‌. ‌శరీరంలో జబ్బు ముదిరి ఉన్నప్పుడు ఈ యాంటిజెన్‌ ‌మన శరీరాల్లో అధికంగా ఉత్పత్తి అవుతుంది. మాములు జబ్బు వచ్చి అది తగ్గినప్పుడు ఈ యాంటిజెన్‌ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోతుంది. నాచురల్‌ ‌ప్రాసెస్‌లో జబ్బు తగ్గిన రోగికి పి24 యాంటిజెన్‌ ‌తగ్గగానే జబ్బు నయం అయిందని హోమియోపతి డాక్టర్లు చెబుతారు. ఈ మొత్తం ప్రాసెస్‌కి చాలా సమయం పడుతుంది. క్రానిక్‌ ‌జబ్బులకు హోమియోపతి వైద్యంలో చికిత్సకు పోతే కాలయాపన జరిగి జబ్బుతో ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ఇంత అశాస్త్రీయంగా ఉన్న హోమియోపతిని ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు..? ప్రపంచ వ్యాపిత ప్రజలకు ఆధునిక వైద్యం మీద నమ్మకం సన్నగిల్లుతోంది. ధనిక దేశాలకు వ్యాక్సిన్స్ ‌చాలా ముందుగా అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్‌ ‌వలన చవి చూసిన అభివృద్ధిని ధనిక దేశాలు అనుభవించి.. మర్చిపోయాయి. పేద దేశాల్లోకి వ్యాక్సిన్లు లేటుగా ప్రవేశించాయి. పేద దేశాల్లో వ్యాక్సిన్లు మంచిదే అన్న అభిప్రాయం ఉంది. అందుకు కారణం ఈ దేశాలు ఆలస్యంగా వాక్సిన్‌ ‌కొనుక్కోగలిగాయి. ఇప్పుడు ఈ పేద దేశాలు వాక్సిన్ల ఫలితాలు అనుభవిస్తున్నాయి. నేడు 85% నార్త్ ఆ‌ఫ్రికన్స్ ‌వ్యాక్సిన్లు మంచిదే అంటున్నారు. 59% ధనిక ఉత్తర యూరోపియన్లు మాత్రమే వ్యాక్సిన్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ధనిక దేశాలలో హోమియోపతికి ఆదరణ పెరగటానికి మరో ముఖ్యకారణం ఆర్థిక అసమానతలు. ధనిక దేశాలలో ఆధునిక వైద్యంపైన నమ్మకం పోవటానికి మరో ముఖ్యమైన కారణం వైద్యం కొనటానికి ఆర్థిక వనరులు ఎక్కువ మంది దగ్గర లేకపోవటం. అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక అసమానతల వలన లైఫ్‌ ‌స్టైల్‌ ‌జబ్బులు వస్తున్నాయి. లైఫ్‌ ‌స్టైల్‌ ‌జబ్బులకు ప్లాసిబో ప్రభావం మందులు అవసరం పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్‌ ‌పరం చేస్తున్నాయి. దీని వలన హోమియోపతి పాపులర్‌ అవుతున్నది.

ఇక భారత దేశం విషయానికి వస్తే మన దేశములో ప్రతి వేయి మందికి 0.55 బెడ్స్ ‌మాత్రమే వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ప్రతి వేయి మందికి కనీసంగా ఐదు బెడ్స్ ఉం‌డాలి. ఇక గోరఖ్‌పూర్‌ ‌ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌ అం‌దక వందలు వేలల్లో చనిపోయిన సంఘటనలు చూసాం. ప్రజలు వైద్యం కొనుక్కోలేక అష్ట కష్టాలు పడే దేశం మన దేశం. అందుకే ఇక్కడ అశాస్త్రీయ హోమియోపతి తిష్ట వేసుకు కూర్చుంది. యువత హోమియో డాక్టర్లు కావాలని ఎందుకు అనుకుంటున్నది..? అన్న ప్రశ్నకు సమాధానం డాక్టర్‌ అమర్‌ ‌జేసాని ఇలా చెబుతున్నారు. ‘‘హోమియోపతి మెడికల్‌ ‌వ్యవస్థ డాక్టర్‌లు కావాలి అనుకున్న వారికి బ్యాక్‌ ‌డోర్‌ ఎం‌ట్రీ ఇస్తుంది’’. డాక్టర్‌ అమర్‌ ‌జేసాని ఇండియన్‌ ‌జర్నల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ఎథిక్స్ ‌పత్రికలో ఎడిటోరియల్‌ ‌బోర్డు మెంబర్‌. ‌సమాజంలో డాక్టర్‌కు వున్న ప్రతిష్ట అలాగే సంపాదన అవకాశాల నేపథ్యంలో బాగా చదివి డాక్టర్‌ ‌కాలేనివారు ఇలా డాక్టర్లు అవుతున్నారు. ఇలా డాక్టర్లుగా ప్రాక్టీస్‌ ‌చేసేవారు క్రాస్‌ ‌ప్రాక్టీస్‌ ‌కూడా బాగా చేస్తున్నారు. నేషనల్‌ ‌సర్వే శాంపిల్‌ ‌ప్రకారం 90 శాతం డాక్టర్లు.. వైత్యంలో డిగ్రీ లేకుండానే ఆధునిక మందులు సూచిన్నారు. 1996లో ఒక రోగికి హోమియోపతి డాక్టర్‌ ‌యాంటిబయాటిక్‌ ‌మందు సూచిస్తారు. ఫలితంగా రోగి మరణించారు. మరణించిన రోగి బంధువులు సుప్రీమ్‌కోర్టులో కేసు వేస్తే.. ఆ రోగికి సంబంధించిన కేసులో ఒక హోమియోపతి డాక్టర్‌ ‌క్రాస్‌ ‌ప్రాక్టీస్‌ ‌చేస్తూ తన దగ్గరికి వచ్చిన రోగికి యాంటీబయాటిక్‌ ‌సూచించారని నిర్ధారించి హోమియోపతి డాక్టర్‌ను శిక్షించారు. ఈ కేసులో సుప్రీమ్‌కోర్టు క్రాస్‌ ‌ప్రాక్టీసింగ్‌ ‌నేరమని చాలా స్పష్టంగా చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం చెప్పినా మన దేశంలో డాక్టర్ల క్రాస్‌ ‌ప్రాక్టీస్‌ ‌యథేచ్ఛగా కొనసాగుతున్నది. దీనికి కారణం ప్రభుత్వ విధానం ప్రకారం కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు ఆధునిక వైద్యం మీద ఆధారపడి వాధానాలను తయారు చేస్తున్నాయి. కానీ రాజకీయ నాయకులు మాత్రం అశాస్త్రీయ హోమియోపతిని ప్రోత్సహిస్తున్నారు. గమనించాల్సింది ఏమంటే రాజకీయ నాయకులు మాత్రం జబ్బు వస్తే ప్రజాధనం వాడుకుని విదేశాలకి పోయి నయం చేసుకుంటున్నారు .

Leave a Reply