సిద్ధిపేట అభివృద్ధి పథంలో మరో ముందడుగు వేసింది. ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఆర్థికంగా లాభాదాయకంతో పాటు కాలుష్య రహిత పట్టణంగా సిద్ధిపేటను తీర్చిదిద్దే అవకాశం ఉన్నదని, తొలుత జీ ప్లస్ 2 తరహాలో దేశానికే ఆదర్శంగా నిర్మించిన నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, మున్సిపల్ అధికారులు, టోరెంటో సంస్థ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారిక సిబ్బందితో ఆయన సమీక్ష జరిపారు. నర్సాపూర్ కాలనీ దేశంలోనే తొలి కాలనీ కాబోతున్నదని, అలాగే సిద్ధిపేట పట్టణంలోని పలు మున్సిపల్ వార్డుల్లో సుమారు 2 వేల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని రూపకల్పన చేసినట్లు మంత్రి వివరించారు. నాణ్యత, పర్యావరణహితం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ…గ్యాస్ పంపిణీ వ్యవస్థలోనే నవశకానికి నాంది పలికేలా కొత్త ప్రాజెక్టును సిద్ధిపేటకు తెచ్చినట్లు తెలిపారు. ఇంటి అవసరాలకే కాదు, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నేచురల్ గ్యాస్‌ను పైపుల ద్వారా పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు ఇప్పటికే సిద్ధిపేటలోని వేములవాడ కమాన్ వద్ద ఆటో మొబైల్ రంగంలో గ్యాస్ సరఫరా కోసం సీఎన్జీ స్టేషను ప్రారంభంచినట్లు వివరించారు. పట్టణ పరిధిలో మొదటి విడతలో రెండు, మూడు కాలనీల్లో 11 కిలో మీటర్ల మేర పైపు లైను నిర్మించాలని నిర్ణయించినట్లు టోరెంటో సంస్థ ప్రతినిధులు సమీక్షలో వెల్లడించారు. ఈ యూనిట్లో లక్ష ఇళ్లకు గ్యాస్ సరఫరా చేస్తామని వివరించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో వ్యవహరించి టోరెంటో ప్రతినిధులకు సహకరించాలని మంత్రి సూచించారు.
పట్టణంలో మొదటి విడత 11 కిలోమీటర్ల పైప్ లైన్
ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ కోసం అత్యంత నాణ్యతతో కూడిన భద్రతమైన పైప్‌లైన్ వేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇప్పటికే సీఎన్జీ స్టేషను పరిధి నుంచి కిలోమీటర్ల పైప్‌లైన్ వేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ పరిధిలోని నర్సాపూర్‌లో దేశంలోనే ఆదర్శంగా జీ ప్లస్ 2 తరహాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు గ్యాస్ పైపు లైన్లు వేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైపుల ద్వారా నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ను, ఆటో మొబైల్ రంగానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)ని సరఫరా చేయనున్నదని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజాంబీల్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.