Take a fresh look at your lifestyle.

మే 31 వరకు సెలవులు అమలు

  • ఆనల్‌లైన్‌ ‌క్లాస్‌లపై త్వరలో నిర్ణయం
  • ఫీజు చెల్లించిన 5,21,392 మంది విద్యార్థులూ పాసయినట్టే
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రం పాఠశాలలకు, జూనియర్‌ ‌కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడంతో నేటినుంచి అమల్లోకి వొచ్చింది.  మంగళవారం నుంచి మే 31 వరకు సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంటర్‌ ‌విద్యా కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ ‌జలీల్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆన్‌లైన్‌ ‌క్లాసుల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఆన్‌లైన్‌ ‌తరగతులు కూడా ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కొరోనా కేసులు  తగ్గుముఖం పట్టి.. సాధారణ పరిస్థితులు నెలకొంటే జూన్‌ 1 ‌నుంచి తదుపరి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. లేనిపక్షంలో సెలవులు పొడిగించవొచ్చు. దీనిపై జూన్‌ 1‌న ప్రభుత్వం సవి•క్షించి నిర్ణయం తీసుకోనుంది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జనవరిలో ప్రకటించిన అకడమిక్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకారం.. పదోతరగతి పరీక్షలు మే 27 నుంచి జరగాల్సి ఉంది. అలాగే వేసవి సెలవులు మే 27 నుంచి జూన్‌ 13 ‌వరకు 17 రోజులు మాత్రమే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. కానీ పదోతరగతి పరీక్షలు రద్దవడం, కొరోనా వ్యాప్తి నేపథ్యంలో.. సెలవులను నెలరోజుల ముందే ప్రకటించారు. దీంతో ఈసారి వేసవి సెలవులు 35 రోజులు ఉండనున్నాయి. అలాగే జూనియర్‌ ‌కాలేజీలకూ మే 31 వరకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజీల సిబ్బంది పనిదినాలు ఏప్రిల్‌ 15‌కే ముగిసినా.. వీటిని ఏప్రిల్‌ 30‌వరకు పొడిగించారు.
ఇంటర్‌ ‌ప్రథమ సంవత్సరం విద్యార్థులు సమర్పించాల్సిన అసైన్‌మెంట్లన్నీ అందటంతో వీరికి సెలవులను 4 రోజుల ముందుగా ప్రకటించారు. అయితే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పదోతరగతి విద్యార్థులందరూ పరీక్షల్లేకుండా ఉత్తీర్ణత సాధించారు. కేంద్రం సీబీఎస్‌ఈ ‌విద్యార్థులకు ప్రకటించిన విధంగానే, రాష్ట్రంలోనూ ప్రమాణాలను పాటిస్తూ పదోతరగతి ఫలితాలు ప్రకటిస్తామని పరీక్షల రద్దు సందర్భంగా ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ విధానంలో విద్యార్థులు ఫెయిలయ్యే అవకాశాలపైనా చర్చ జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించిన మొత్తం 5,21,392 మంది విద్యార్థులూ పాసయినట్టేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Leave a Reply