ఆధిపత్య వెర్రి ముదిరి
అణ్వస్త్ర గర్వం నెత్తికెక్కి
విద్వేష విషం ఒంటబట్టి
రాజ్య కాంక్ష మదిలదట్టి
పొరుగు దేశాలపై కక్షగట్టి
యుద్దానికి పాల్పడుతున్నవ్
తూటాల వర్షం కురిపించి
రాకెట్ లాంచర్లు సంధించి
పిరంగుల మోత మోగించి
బాంబు దాడులు జరిపించి
పెను విధ్వంసం సృష్టిస్తున్నవ్
అయినా…
పచ్చటి బతుకుల కాల్చి
జీవన సౌధాలను కూల్చి
మానవ జాతికి చితి పేర్చి
నేలను వల్లకాడుగా మార్చి
కడకు ఏమి బావుకుంటవ్ ?
ఒంటరై దుఃఖించుట తప్పా!
ఓ సామ్రాజ్యవాద పిపాసి
యుద్దాన్ని తెగముద్దాడిన
ముస్సోలిని, నెపోలియన్
హిట్లర్ లాంటి నియంతలు
మట్టి కొట్టుకు పోయారన్నది
చరిత్ర చెప్పిన నిష్ఠూర నిజం
ఇప్పటికైనా…
జీవన సూత్రం ఎరిగి
దురహంకారం విడిచి
యుద్ధ పిపాసను మరిచి
సామ్రాజ్య కాంక్షను చెరిపి
మానవత్వాన్ని ప్రదర్శించు
నవజీవన సౌరభాన్ని పంచు
చరిత్రలో స్తానం సంపాదించు
(యుద్ధోన్మాది పుతిన్ ను ఆజ్ఞాపిస్తూ..)
– కోడిగూటి తిరుపతి, 9573929493