Take a fresh look at your lifestyle.

హిందూత్వం ..!…

  • గుజరాత్‌ ఎన్నికల ప్రధాన ఎజెండా
  • భారతీయ జనతా పార్టీ తీర్మానం
  • పార్టీ మూలాలకు తిరిగి పోదామని నిర్ణయం

‌గుజరాత్‌లో ఎన్నికలలో హిందూత్వ వాదాన్ని ప్రధాన ఎన్నికల ఎజెండాగా తెరపైకి తీసుకురావటానికి బీజేపీ ఎక్సిక్యూటివ్‌ ‌సమావేశం తీర్మానించింది. గుజరాత్‌  ‌పార్టీ తీర్మానంలో ‘‘రామ మందిరానికి మద్దతు ఇవ్వని వారిని నకిలీ-లౌకికవాదులు’’ అని తీర్మానించి ప్రజల ముందు పెట్టటం జరిగింది. కాంగ్రెస్‌ ‌పార్టీని ‘‘చైనీస్‌ ‌పాకిస్తానీ’’ల అనుకూల పార్టీ అని గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారం చేయటానికి బీజేపీ అస్త్రాలు సిద్ధం చేసుకున్నది. గుజరాత్‌ ‌ప్రజలు బీజేపీ తప్పిదాలను మర్చిపోవాలి లేదా క్షమించాలి..ఇందుకోసం ప్రజలని బలవంతం చేయాలి..అప్పుడే గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి రాగలదు. కోవిడ్‌-19 ‌రెండవ వేవ్‌ ‌గుజరాత్‌ ‌రాష్ట్రంలో వినాశకర పరిస్థితి సృష్టించింది. కొరోనా కాలంలో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపానీ ఇమేజ్‌ ‌పడిపోవటం చూసాం. హార్వర్డ్ ‌టిహెచ్‌ ‌చాన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌పబ్లిక్‌ ‌హెల్త్ అం‌డ్‌ ‌కాలిఫోర్నియా, బర్కిలీ విశ్వవిద్యాలయాల పరిశోధకుల అధ్యయనం ప్రకారం, గుజరాత్‌లోని 54 మునిసిపాలిటీలు జనవరి 2019- ఫిబ్రవరి 2020తో పోలిస్తే మార్చి 2020 నుంచి ఏప్రిల్‌ 2021 ‌మధ్య 16,000 అదనపు మరణాలు నమోదయ్యాయి. ‘ది వైర్‌’ ‌ప్రచురించిన రిపోర్టర్స్ ‌కలెక్టివ్‌ ‌రిపోర్ట్ ‌ప్రకారం గుజరాత్‌ ‌రాష్ట్రంలో మరణాల సంఖ్య 27 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ దారుణ పరిస్థితిని గుజరాత్‌ ‌ప్రజలు మర్చిపోయి, మన్నించి బీజేపీకి వోటు వేయాలంటే బలమైన రాజకీయ వ్యూహం బీజేపీకి అవసరమైనందుకే తన పార్టీ మూలం హిందూత్వ రాజకీయానికి తెరలేపింది. అందుకే దుందుడుకు హిందూత్వం గుజరాత్‌లో మరింత బలంగా తన ఉనికిని చాటుకుంటున్నది. కేవాడియాలో గురువారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా ఈ పరిణామం చోటు చేసుకుంది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 16 నెలల సమయం ఉండగానే, బిజెపి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. గుజరాత్‌లో గతంలో సాధించనంత మెజారిటీ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. అత్యున్నత ‘‘స్టాట్యూ ఆఫ్‌ ‌యూనిటీకి’’ నిలయమైన కెవాడియాలో జరిగిన మొదటి రోజు బీజేపీ ఎగ్జిక్యూటివ్‌ ‌సమావేశంలో పాల్గొన్న ప్రతి వక్త ప్రధాని నరేంద్ర మోదీని ‘‘పిఎం నరేంద్రభాయ్‌’’ అని  సంభోదిస్తూ…భారతదేశంలో తీవ్రవాదాన్ని నిర్ములించారని, దేశ ఆత్మగౌరవం కాపాడి దేశ గౌరవాన్ని పునః ప్రతిష్ట చేసారని, మరీ ముఖ్యముగా ఆర్టికల్‌ 370‌ని నిర్వీర్యం చేసారని, అయోధ్యలో రామ మందిరానికి మార్గం సుగమం చేసారని పీఎం మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 2017లో బీజేపీ వికాస్‌ అలాగే అచ్చే దిన్‌ ‌మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్ళింది. రానున్న ఎన్నికల్లో తన హిందూత్వ వాదాన్ని వాడుకోవాలని బీజేపీ నిర్ణయానికి వొచ్చింది. ప్రధాని మోడీ 71వ పుట్టినరోజు సెప్టెంబర్‌ 17‌న గుజరాత్‌ ‌వ్యాప్తంగా 7,001 రామాలయాల్లో ప్రత్యేక హారతి పూజలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌సిఆర్‌ ‌పాటిల్‌ ‌ప్రకటించారు. ఒకవేళ మీకు దగ్గరలో రామ మందిరం కనిపించకపోతే, రాముడి ఫోటో పెట్టి, హారతి పూజ చేయండని పాటిల్‌ ‌పిలుపునిచ్చారు.

మోదీ ఉగ్రవాదాన్ని నిర్మూలించారు : రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌
‘‘‌మోదీ దేశంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడం మాత్రమే చేయలేదు. భారత దేశాన్ని ప్రధాన ఆయుధ ఎగుమతిదారుగా తయారు చేసారు. వాస్తవానికి, ఈ సంవత్సరం, భారతదేశం 17,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది.’’ అని రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌సభలో ప్రకటించారు. కొద్దిపాటి అంతరాయాలతో దాదాపు 26 సంవత్సరాల పాటు గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఇది బీజేపీకి గుజరాత్‌లో వున్న ప్రజాదరణకు నిదర్శనమని రాజనాథ్‌• అన్నారు. ‘‘ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా ఈవీఎంలను తారుమారు చేయడం ద్వారా బీజేపీ గెలవదు. ప్రజలు బీజేపీని కోరుకుంటున్నందున గెలిచింది. ప్రజలు బీజేపీని విశ్వసిస్తారు’’ అని బీజేపీని భారీ ప్రశంసలతో రాజ్‌ ‌నాథ్‌• ‌ముంచెత్తారు.

చైనీస్‌తో, పాకిస్థానీలతో కాంగ్రెస్‌ ‌చర్చలు జరుపుతున్నది
‘‘నరేంద్ర మోడీ డైనమిక్‌, ‌బలమైన, సుసంపన్న నాయకత్వంలో బిజెపి, ఆత్మగౌరవం, జాతీయతా వాదం నింపిన గర్వంతో సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించటంలో ముందుంది’’ అని గుజరాత్‌ ‌రాష్ట్ర బిజెపి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారతదేశాన్ని విశ్వ గురువుగా చేయడానికి అన్ని చర్యలు చేపట్టినందుకు ప్రధాని మోడీని సభలోని వక్తలు ప్రశంసించారు. బిజెపి తీసుకున్న మహిళా సాధికారత చర్యలను హైలైట్‌ ‌చేసింది సభ. ముఖ్యంగా భారతదేశంలో ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడంలో ట్రిపుల్‌ ‌తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావటాన్ని సభ ప్రస్తావించింది. రామ జన్మభూమిలో దేవాలయం నిర్మించాలనే కోట్లాది మంది భారతీయుల కలను నెరవేర్చినందుకు పిఎం నరేంద్రభాయ్‌ ‌మోడీకి అధికారికంగా సభ కృతజ్ఞతలు తెలిపింది. ‘‘రామ మందిరానికి మద్దతు ఇవ్వని వారిని నకిలీ-లౌకిక వాదులు అంటూ’’ ఖండించింది. ఆర్టికల్‌ 370‌ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ ‌ప్రత్యేక హోదాను రద్దు చేయటం మోదీ ప్రభుత్వం చూపిన చొరవకు వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి ఇప్పటికీ ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి’’ అని రాష్ట్ర బిజెపి ఎగ్జిక్యూటివ్‌ ‌సభ చేసిన తీర్మానాన్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ ‌చైనీస్‌, ‌పాకిస్తానీల భాష మాట్లాడుతుందని తీర్మానంలో వుంది. గుజరాత్‌ ‌రాష్ట్ర బిజెపి ఎగ్జిక్యూటివ్‌ ‌సభ తీర్మానాన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్న బిజెపి యూనిట్లకు పంపించే అవకాశం ఉంది.

ఎన్నికల వేడి ఈ సరికే మొదలయింది
గుజరాత్‌లో మెరుపుదాడి చేసినందుకు హిందూత్వ వాదంతో పాటుగా, బిజెపి తనకి కొట్టిన పిండి అయిన పోల్‌ ‌మెషినరీని సమీకరించింది. కార్యనిర్వాహక సభ్యులు ప్రచారం ఎలా చేయాలనే అంశంపై నిరంతరం మార్గనిర్దేశం పొందుతారు. ప్రతి కార్యనిర్వాహక సభ్యుడు ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు సోషల్‌ ‌మీడియాలో చురుకుగా ఉండాలని పార్టీ భావిస్తున్నట్లు ఈసరికే స్పష్టం చేయటం జరిగింది. గత లోక్‌సభలో దేశంలో అత్యధిక మెజారిటీ సాధించటం వెనుక ఈ వ్యూహమే పనిచేసిందని రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌సిఆర్‌ ‌పాటిల్‌ ‌ప్రకటించారు. గత లోకసభ ఎన్నికలలో, అలాగే గుజరాత్‌లో సిఆర్‌ ‌పాటిల్‌ ‌చూపిన నైపుణ్యం తర్వాత ఆయనను ‘‘బూత్‌ ‌నిర్వహణ పితామహుడు’’గా పార్టీ పరిగణిస్తుంది. ‘‘బీజేపీ అన్ని ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది’’ అని ఆయన తెలిపారు. ‘‘సహకార రంగ ఎన్నికల్లో కూడా మేము పార్టీ బ్యానర్‌ ‌కింద పోటీ చేస్తాము. మా వోట్లకోసం పార్టీ కేడర్‌కు వోటింగ్‌ ఆదేశాలను కూడా జారీ చేస్తాము. అందరినీ గెలిపించే బాధ్యత మాది.’’ అని సిఆర్‌ ‌పాటిల్‌ అం‌టున్నారు.

మోడీ అమలు చేస్తున్న పథకాలను వాటి అమలును ప్రశంసా పత్రాలతో నింపిన టాబ్లెట్‌లను గుజరాత్‌లో పార్టీ కార్యకర్తలకు బీజేపీ అందించింది. ఈ టాబ్లెట్‌లలో ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బిజెపిల మొత్తం చరిత్ర, గుజరాత్‌ ‌బిజెపి ఎంపిలు మరియు ఎమ్మెల్యేలు చేసిన ప్రతి ప్రసంగం ఉన్నాయి. పాటిల్‌ ‌మరో 10,000 టాబ్లెట్లను పంపిణీ చేస్తానని సభా వేదికగా ప్రతిజ్ఞ చేసారు. 2022 ఎన్నికలకు బిజెపి చేసుకుంటున్న ఏర్పాట్లు దిమ్మదిరిగిపోయేలాగా వున్నాయని ఒక కాంగ్రెస్‌ ‌నాయకుడు ఓ వెబ్‌ ‌సైట్‌ ‌ప్రతినిధితో మాట్లాడుతూ అంగీకరించారు. ‘‘మా పార్టీకి రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో ఒక అధ్యక్షుడు లేడు. కనీసం ఒక ప్రధాన కార్యదర్శి కూడా లేడు,’’ అని సదరు నాయకుడు వాపోయాడు. గత ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్‌ను గట్టి పోటీ ఇచ్చే పార్టీగా భావించింది. ఈ సారి ఆ పరిస్థితి లేదు. గతసారి అతి పురాతన పార్టీగా కాంగ్రెస్‌ ‌పోరాటం చేసినప్పటికీ, అనైక్యత గ్రూప్‌ ‌రాజకీయాలు, అపరిపక్వ రాజకీయ నిర్ణయాల వల్ల పార్టీ పూర్తిగా కునారిల్లిపోయి వుంది.  ‘‘ప్రెస్‌ ‌నోట్స్ ‌జారీ చేసే పార్టీగా కాంగ్రెస్‌ ‌మిగిలింది’’ అని బిజెపి సీనియర్‌ ‌మంత్రి ఒక వార్త సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ‘‘కాంగ్రెస్‌కు గుజరాత్‌లో ఉనికి లేదా ప్రాముఖ్యత లేదు. రాష్ట్రంలో కనీసం కాంగ్రెస్‌ ‌వెంటిలేటర్‌పై కూడా లేదు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ గుజరాతీ పార్టీ కాదు. కాంగ్రెస్‌ను గుజరాతీలు ఇటాలియన్‌ అమెరికన్‌ ‌పార్టీగా చూస్తారు.’’ అని సదరు మంత్రి ఎద్దేవా చేసారు. గుజరాత్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కాంగ్రెస్‌ ‌కంటే ఆమ్‌ ఆద్మీ పార్టీ పట్ల ఎక్కువ ఆకర్షణీయంగా కనబడుతున్నది. అయితే, ఏ పార్టీ అయినా బిజెపిని సవాలు చేసే అవకాశం గుజరాత్‌లో కనిపించటం లేదు.

పార్టీ మూలాలకు తిరిగి పోవటానికి బీజేపీ నిర్ణయం  
హిందూత్వ వాదానికి తిరిగి దూకుడుగా వెళ్లాలనే నిర్ణయం వ్యూహాత్మకమైనది. దేశంలోని అన్ని హిందూత్వ ప్రయోగాలకు గుజరాత్‌ ఎల్లప్పుడూ ప్రయోగశాల అనేది తెలిసిందే. అవినీతి, అనేక మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలు, డీమోనిటైజేషన్‌, ‌జిఎస్‌టి గందరగోళం, రాఫెల్‌ ‌వివాదం, కొరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, కేశూభాయ్‌ ‌పటేల్‌ ‌కాలం నుండి గుజరాత్‌లో మెజారిటీ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తున్నది. గుజరాత్‌ ‌నిరంతరం బీజేపీకి వోటు వేస్తున్నది. శంకర్‌సింగ్‌ ‌వాఘేలా తిరుగుబాటు చేసి, తన సొంత పార్టీ ఆర్‌జెపిని పెట్టినప్పుడు బీజేపీకి కొంత దెబ్బ తగిలినా (కాంగ్రెస్‌, ‌బయటి మద్దతుతో ఆ పార్టీ 1997లో గుజరాత్‌ను పాలించింది) తరువాత, కేశూభాయ్‌ ‌పటేల్‌ ‌మళ్లీ మెజారిటీ తెచ్చుకుని బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌లో ఏర్పాటు చేసారు. అక్కడి నుండి బిజెపికి తిరుగు లేకుండా పోయింది. మళ్ళీ అధికారం కోసం హిందుత్వ రాజకీయానికి బీజేపీ సిద్ధపడగా దీని ప్రభావం దేశవ్యాపితంగా ఉండనుంది.

Leave a Reply