Take a fresh look at your lifestyle.

ఉన్నత విద్యకు ఉన్నత స్థానమివ్వాలి

“విద్య ప్రాశస్థ్యాన్ని వివరించడానికి దక్షిణాఫ్రికాలోని విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఈ క్రింది సందేశం రాయబడి వుంది. ‘ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఆ దేశంపై అణుబాంబులు లేదా క్షిపణులు ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఆ దేశ విద్యా విధానం, దాని నాణ్యతను తగ్గించడం మరియు పరీక్షల్లో విద్యార్థులు మోసం చేయడాన్ని అనుమతించడం చేస్తే చాలు ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చు. అటువంటి మోసపు విధానాలచే తయారైన వైద్యుల చేతిలో రోగులు మరణిస్తారు. అటువంటి ఇంజనీర్ల చేతిలో భవనాలు కూలిపోతాయి. ఆర్థికవేత్తలు మరియు అకౌంటెంట్ల చేతులలో ధన నష్టం పొందుతారు. అటువంటి పండితుల చేతిలో మానవత్వం నశించిపోతుంది. న్యాయమూర్తుల చేతిలో న్యాయం అంతరించిపోతుంది.”

‘విద్యావ్యవస్థ కూలిపోవడమే ఆ దేశపు పతనము’  

ప్రపంచంలోని దేశాలన్నింటిలో ఉన్నత విద్యా వ్యవస్థ పరిమాణం దృష్ట్యా భారత దేశానికి మూడో స్థానముంది. మొదటి స్థానం అమెరికాదైతే, రెండోస్థానం చైనాది. ఒక దశాబ్ధం క్రితం మన దేశమే రెండో స్థానంలో ఉండేది. ఇంత పెద్ద వ్యవస్థ గల మన దేశం ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా దేశ రూపురేఖలు మారుతాయనడంలో సందేహం లేదు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలో కేవలం 27 విశ్వవిద్యాలయాలు, కొద్ది సంఖ్యలో కాలేజీలుండగా, ప్రస్తుతం ఉన్నత విద్యా వ్యవస్థ పరిమాణాత్మకంగా చాలా మార్పుకు గురైంది. ప్రస్తుతం 700లకుపైగా అన్ని రకాల విశ్వవిద్యాలయాలు అనగా ప్రైవేటు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఇంకా ఇతర రకాల విద్యాసంస్థలన్నీ కలిపి చాలా పెద్ద వ్యవస్థగా రూపుదిద్దుకొన్నది. పరిమాణాత్మకంగా ఇంతగా ఎదిగిన భారత దేశ విద్యావ్యవస్థ నాణ్యత విషయంలో మాత్రం చాలా అథమస్థాయిలో ఉండడం శోచనీయం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో కెల్లా అత్యున్నత నాణ్యత గలిగిన 200 విశ్వవిద్యాలయాల్లో కనీసం మన దేశానికి చెందిన ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేకపోవడం గమనార్హం.

అందువల్ల మన ఉన్నత విద్యను సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. అంతేకాదు ఉన్నత విద్యా సంస్థల్లో మన విద్యార్థుల ప్రవేశం కూడా చాలా తక్కువ. ఇది కేవలం 25 శాతం స్థూల విద్యార్థుల ప్రవేశ నిష్పత్తి(జిఇఆర్‌) ‌మాత్రమే ఉన్నది. ఇది 2020 సంవత్సరానికి కనీసం 30 శాతంగా వుండాలని విశ్వవిద్యాలయం విరాళాల సంఘం(యుజిసి) లక్ష్యంగా నిర్ణయించింది. మన దేశ జనాభా, అందులో యువత శాతం, పరిగణనలోకి తీసుకుంటే ఇది కూడా చాలా తక్కువే. జాతీయ విజ్ఞాన సంఘం(ఎన్‌కెసి) అంచనాల ప్రకారం మన దేశ జనాభాలో 55 శాతం మంది 25 ఏళ్లలోపు వారే. అందుకే భారత దేశాన్ని ప్రపంచంలోనే యువ దేశంగా పేర్కొన్నారు. వీరందరికీ సరైన విద్యా సౌకర్యాలు కల్పించాలంటే ఇంకా దాదాపు 1500 విశ్వవిద్యాలయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంటుందని జాతీయ విజ్ఞాన సంఘం(ఎన్‌కెసి) పేర్కొంది. ఉన్న వ్యవస్థను మెరుగుపరిచి మరియు కొత్త సంస్థలను నెలకొల్పి నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోనికి తేవాలంటే మన విద్యాసంస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఒక దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య మరియు పాఠశాల విద్య కీలకమైనదని మనందరికీ తెలిసిన విషయమే. మన దేశ యువత జనాభాను మనకున్న ఉత్పాదక వనరులనుగా భావించి వారికి కావాలసిన విద్య మరియు శిక్షణను కల్పిస్తే వారు మన దేశానికి మంచి మానవ వనరులుగా రూపుదిద్దుకొని దేశ సంపదను పెంపొందించి, మన స్థాయిని పెంచడానికి దోహదపడుతారనడంలో సందేహం లేదు. కాని దీనికి కావాల్సిన చర్యలను సత్వరంగా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది.

మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి వుంటుంది. విద్య యొక్క ప్రాశస్థ్యాన్ని వివరించడానికి దక్షిణాఫ్రికాలోని విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఈ క్రింది సందేశం రాయబడి వుంది. ‘ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఆ దేశంపై అణుబాంబులు లేదా క్షిపణులు ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఆ దేశ విద్యా విధానం, దాని నాణ్యతను తగ్గించడం మరియు పరీక్షల్లో విద్యార్థులు మోసం చేయడాన్ని అనుమతించడం చేస్తే చాలు ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చు. అటువంటి మోసపు విధానాలచే తయారైన వైద్యుల చేతిలో రోగులు మరణిస్తారు. అటువంటి ఇంజనీర్ల చేతిలో భవనాలు కూలిపోతాయి. ఆర్థికవేత్తలు మరియు అకౌంటెంట్ల చేతులలో ధన నష్టం పొందుతారు. అటువంటి పండితుల చేతిలో మానవత్వం నశించిపోతుంది. న్యాయమూర్తుల చేతిలో న్యాయం అంతరించిపోతుంది. ‘విద్యావ్యవస్థ కూలిపోవడమే ఆ దేశపు పతనము’. దీన్ని బట్టి ఒక దేశ అభివృద్ధిలో విద్య ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో మనకు తెలియుచున్నది. కాబట్టి మన దేశంలో ముఖ్యంగా ఉన్నత విద్య యొక్క నాణ్యతను సాధారణ మరియు సాంకేతిక విద్య పెంచాల్సిన అవవరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. అందుకు క్రింద పేర్కొనబడిన కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణను రూపొందించాలి.

  1. మనం మొత్తం విద్యపై పెట్టే ఖర్చు ఇంత వరకు మన జాతీయ ఉత్పత్తి(జిడిపి)లో 4 శాతం కంటే మించలేదు. అందులో కీలకమైన ఉన్నత విద్యపై 1.22 శాతం మాత్రమే మనం ఖర్చు చేయుచున్నాము. అందుకే మన విద్యావ్యవస్థ అరకొర వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. బోధన మరియు పరిశోధన రెండు కూడా మెరుగుపడాలంటే విద్యపై మన వ్యయం గణనీయంగా పెరగాలి. దేశంలో అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వరంగ విద్యావ్యవస్థను పటిష్టం చేసి నాణ్యమైన విద్యను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. అప్పుడే సామాజిక రుగ్మతలు సమసిపోయి, సమాజ వికాసం జరుగుతుంది. 1960లలోనే విద్య గురించి మాట్లాడుతూ కొఠారి కమిషన్‌ ‌మన దేశంలోని జిడిపిలో కనీసం 6 శాతంగా విద్యపై ఖర్చు చేయాలన్నది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటినా ఇంత వరకు అది 4 శాతం మించలేదంటే ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తుందో తెలుస్తుంది. అందులో ఉన్నత విద్యపై ఇంకా చిన్న చూపున్నదని మనకు విశదవుతున్నది.
  2. విద్య నాణ్యతను పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. కాని మన దేశంలో ముఖ్యంగా ఉన్నత విద్య బోధించే కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతతో సతమతమవుతున్నవి. కేంద్ర మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో దాదాపు 50 శాతానికిపైగా టీచర్ల ఖాళీలున్నాయని మనకు అన్ని ఆధారాలు చెప్పుచున్నవి. బోధన భారం తాత్కాలిక మరియు కాట్రాక్టు అధ్యాపకులు మోస్తున్నారు. మరియు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల నిబద్ధత మరియు సమర్థత వీరిలో లోపించడం వల్ల నాణ్యత లోపిస్తుంది. సాంకేతిక కళాశాలలు కూడా ఇదే పద్ధతిలో నడుస్తున్నాయి. ఇది మరీ ఘోరం.
  3. సాధారణ ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్యను నియంత్రించడానికి ఎన్నో రకాల నియంత్రణ(రెగ్యులేటరీ బాడి) సంస్థలను ప్రభుత్వాలు నెలకొల్పాయి. విశ్వవిద్యాలయాల సంఘం(యుజిసి), సాంకేతిక మండలి(ఏఐసిటిఈ), ఫార్మసీ కౌన్సిల్‌(‌పిసిఐ), బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా(బిసిఐ), జాతీయా విద్యా నియంత్రణ మండలి(ఎన్‌సిటిఈ) మొదలైన ఎన్నో నియంత్రణ సంస్థలను స్థాపించడానికి మాత్రమే పరిమితమై నియంత్రణ శూన్యమైనది. అంతేకాక ఇవి చాలా వరకు అవినీతికి కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. వీటన్నింటి స్థానంలో ఒకే ఒక జాతీయస్థాయి నియంత్రణ సంస్థను నెలకొల్పాలనే ఆలోచన చాలా కాలం నుండి జరుగుతున్నప్పటికీ అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఏ ఒక్క నియంత్రణ సంస్థ కూడా మన దేశంలో సమర్థవంతంగా పనిచేస్తున్న దాఖాలాలు మనకు ఇంత వరకు గోచరించడం లేదు.
  4. మన దేశ ఉన్నత విద్యారంగం గత రెండు దశాబ్ధాలకుపైగా ప్రైవేటు రంగం విస్తరణ మరియు ఆధిక్యతకు గురవుతున్నది. దాదాపు 60 శాతం ఉన్నత విద్యారంగం ప్రైవేటు రంగం ఆధీనంలో ఉన్నట్లుగా మనకు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నవి. ప్రైవేటీకరణపై నియంత్రణ లేనిచో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యా వ్యాపారం చేసేవిగా మారే ప్రమాదముంటుంది. మన దేశంలో చాలా వరకు ఇదే జరుగుతున్నది. అంతే కాకుండా ఈ సంస్థలు నాణ్యతను పాటించకపోవడం వల్ల పట్టాలను అమ్మే కేంద్రాలుగా కూడా మారే ప్రమాదమున్నది. కాబట్టి ప్రైవేటీకరణ దుష్ప్రభావాలను మనం అధిగమించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా వుంది. దాదాపు 80 శాతం సాంకేతిక కళాశాలలు మన దేశంలో ప్రైవేటు రంగంలో స్థాపించబడడం చాలా శోచనీయమైన విషయం.
  5. నాణ్యతలేని బోధన మరియు పరిశోధన గల విద్యాసంస్థలు విస్తరించడం వ్యర్థం. నాణ్యతను బాగా కొలువడానికి ఉన్నత విద్య విషయంలో మన దేశంలో జాతీయ మూల్యాంకణ మండలి(ఎన్‌ఏఏసి)ని 1994లో ప్రభుత్వం స్థాపించింది. ఇప్పటి వరకు మూల్యాంకణ జరిగిన సంస్థలలో కేవలం 11 శాతం మాత్రమే ‘ఏ’ గ్రేడు సంస్థలు. మిగిలిన 71 శాతం ‘బి’ గ్రేడు సంస్థలు మరియు 18 శాతం ‘సి’ గ్రేడు సంస్థలని గణాంకాలు చెప్పుచున్నవి. దాదాపు ప్రభుత్వ రంగంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, చాలా వరకు ప్రభుత్వ కళాశాలలు మాత్రమే మూల్యాంకనకు ముందుకు వచ్చినవి. ప్రైవేటు రంగంలోని చాలా విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు మూల్యాంకనకు సిద్ధంగా లేవు. కొద్ది ప్రైవేటు సంస్థలు మాత్రమే ఇందుకు సమ్మతించి అత్యున్నత ప్రమాణాలు కనబరుస్తున్నాయి. మిగిలినవన్ని అరకొర అవస్థాపన సౌకర్యాలతో, బోధన సిబ్బందితో, అతి తక్కువ నాణ్యతతో నడుస్తున్నాయి. దీనివల్ల ఇందులో చదివి పట్టాలు పొందిన విద్యార్థులు నిరుద్యోగులుగా రోడ్లపై తిరిగే పరిస్థితి వచ్చింది. భారత రత్న అబ్దుల్‌ ‌కలాం ప్రకారం ‘మన దేశ విద్యా వ్యవస్థ ఉద్యోగ అన్వేషనకులని తయారు చేయుస్తున్నది కాని ఉద్యోగాలను కల్పించే వారిని కాదు’. విద్య అందులో ముఖ్యంగా ఉన్నత విద్య విద్యార్థులను భవిష్యత్తులో వారి కాళ్లపై వారు నిలబడి ఎదిగే విధంగా తయారుచేయాలి. ఇలా జరగాలంటే మన విద్యా వ్యవస్థను మనం సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  6. ఉన్నత విద్య ముఖ్యంగా సాంకేతిక విద్యలో ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం చాలా అవసరం. ఇది జరగాలంటే ప్రయోగశాలలు మరియు పరిశోధనపై ఎక్కువ ప్రాధాన్యత అవసరం. ఈ విషయంలో మన సంస్థలు చాలా వెనుకబడి ఉన్నాయి. విశ్వవిద్యాలయాలలోను, కళాశాలలోను కేవలం నామ మాత్రంగానే ప్రయోగాలు కానిస్తున్నారు. దీనికి కారణం ప్రయోగశాలల ఏర్పాటు మరియు నిర్వహణపైన అతి తక్కువ పెట్టుబడి జరుగుతున్నది. అందువల్లనే మన దేశం పరిశోధనా రంగంలో ఇతర దేశాల కంటే చాలా వెనుకబడి ఉన్నది. విద్య పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరగాలంటే, పరిశోధనా ప్రమాణాలు పెరగాలంటే ఉన్నత విద్యపై పెట్టుబడి చాలా పెరగాలి. విద్యపై పెట్టుబడిని మూలధనంగా భావించాలి. కాని అనుత్పాదక ఖర్చు అని ప్రభుత్వాలు భావించరాదు. ఎందుకంటే దేశ నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుంది కాని అసెంబ్లీలలో మరియు పార్లమెంటులో కాదు. ఉన్నత విద్యతోపాటు పాఠశాల విద్యలో కూడా సమూల మార్పులు జరగాలి. పాఠశాల, కళాశాల మరియు విశ్వవిద్యాలయాల విద్యకు సరైన అనుబంధం ఏర్పరచినప్పుడే అది సమగ్ర విద్యా విధానమవుతుంది. ఇలా జరగని పక్షంలో ఏ దేశంలోనైనా విద్య ప్రయోజకులైన యువకులను తయారు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇది గమనించకపోతే అది వారి ఉనికికే ప్రమాదం అని భావించాల్సి వస్తుంది. ఇలా జరగని పక్షంలో ఏ దేశంలోనైన విద్య నిరుద్యోగ యువకులను తయారు చేస్తుంది.
N Lingamurthy
ఎన్‌. ‌లింగమూర్తి,
విశ్రాంత ఆచార్యులు మాజీ ఉప కులపతి,కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌ , ‌తో కలిసి
డా.సంగని మల్లేశ్వర్‌,
‌జర్నలిజం విభాగాధిపతి,కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌.
9866255355

Leave a Reply