వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రయాణికులకు సంక్రాంతి వాతలు

January 14, 2020

higher charges The exploitation of private buses

  • అధిక ఛార్జీలతో ప్రైవేట్‌ ‌బస్సులు దోపిడీ
  • ఆర్టీసీ, రైల్వేలదీ అదే దారి – సొంతూళ్లకు వెళ్లేవారికి చుక్కలు

పండగ సంక్రాంతిని ఆర్టీసీ సంస్ధలతో పాటు రైల్వేలు సొమ్ము చేసుకుంటున్నాయి. పెద్దమొత్తంలో ఛార్జీలు పెంచి వసూళ్లుచేస్తున్నాయి. దీనికితోడు ధరలు పెంచినా బస్సులు, రైళ్లు అందుబాటులో లేక ప్రయాణికులు సొంతూర్లకు వెళలేనందుకు నానాయాతన పడ్డారు. సోమవారం అటు ఎపి, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో రద్దీ పెరిగింది. రైల్వే స్టేషనలు కిటకిటలాడాయి. సొంత ప్రాంతాలకు వెళ్లేవారితో విజయవాడ పండిట్‌ ‌నెహ్రూ బస్‌స్టేషన్‌, ‌రైల్వేస్టేషన్‌లు కిటకిటలాడాయి. బస్సులు, రైళ్లు రద్దీగా నడుస్తున్నాయి. ఏడాదికోసారి వచ్చే పెద్ద పండగ సంక్రాంతి కావడంతో దూరాన ఉన్నవారంతా సొంతూళ్లకు కుటుంబ సమేతంగా తరలివస్తుంటే రవాణా రంగం చార్జీల రూపంలో వారిని విచ్చలవిడిగా దోపిడీ చేస్తోంది. ఈ దోపిడీ పర్వంలో రవాణా రంగం పండుగ చేసుకుంటుంటే ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌నిర్వాహకులతో పాటు ఆర్టీసీ, రైల్వే వ్యాపార కోణంలోనే స్పెషల్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయి. పండగ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడమే ధ్యేయంగా ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ ‌నుంచి వచ్చే వారి నుంచి రూ.1500 ఆ పైన, బెంగళూరు నుంచి రూ.3 వేల నుంచి 4 వేల లోపు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. రవాణా శాఖ అధికారులకు దీనిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రవాణా శాఖ బృందాలు చెక్‌పోస్టుల దగ్గర ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ‌బస్సులపై భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు.విజయవాడ కేంద్రంగా ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌నిర్వాహకులు దూరప్రాంతాలకు ఎక్కువగా బస్సులు నడుపుతున్నారు.

రవాణా శాఖ లెక్కల ప్రకారం 100 బస్సుల వరకు నగరం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రైవేట్‌ ‌బస్సులు ఇక్కడి నుంచి హైదరాబాద్‌, ‌బెంగళూరు, చెన్నైలకు సాధారణ చార్జీలు వసూలు చేస్తున్నాయి. తిరిగి వచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకు వచ్చే వారి నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయి.ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ ‌హైదరాబాద్‌, ‌బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను తీసుకురావడానికి ఇక్కడి నుంచి వెయ్యి స్పెషల్‌ ‌బస్సులు నడుపుతోంది. ఈ బస్సుల్లో ఇక్కడి నుంచి వెళ్లేవారి కోసం 40 శాతం తక్కువ ధర ప్రయోజనాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లేవారు స్వల్ప సంఖ్యలోనే ఉంటారు. ఈ పేరుతో దూర ప్రాంతాల నుంచి వచ్చే స్పెషల్‌ ‌బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు అధికంగా ఉంటున్నారు. దీంతో బస్సులు కిటకిటలా డిపోతున్నాయి. షెడ్యూల్‌ ‌బస్సుల్లో నెల రోజుల ముందుగానే రిజర్వేషన్‌ ‌బుక్‌ అయిపోవడంతో ప్రయాణ •కులకు స్పెషల్‌ ‌బస్సులే దిక్కు అవు తున్నాయి. హైదరాబాద్‌ ‌నుంచిట్రాఫిక్‌ ‌విజయవాడ వైపే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటే వరకు ఆర్టీసీ రికార్డు స్థాయిలో 300 ప్రత్యేక బస్సులను నడిపింది. విజయవాడకు భారీగా వస్తున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఆదివారం లోకల్‌గా 50కు పైగా స్పెషల్‌ ‌బస్సులు నడిపారు. విశాఖపట్నానికి వెళ్లే 20 ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్‌ అవకాశం కల్పించారు.

రాజమండ్రి, అమలాపురం, కాకినాడ ప్రాంతాలకు మరో 30 స్పెషల్‌ ‌బస్సులు నడిపారు. సాయంత్రం రాయలసీమ సెక్టార్‌లో 10 స్పెషల్‌ ‌బస్సులు నడిపారు.అర్ధరాత్రి వరకు ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 50 బస్సులు నడిపేందుకు ప్రణాళిక వేసుకుంటున్నారు. హైదరాబాద్‌ ‌నుంచి వచ్చే వారిని తీసుకు రావడం కోసం ఆర్టీసీ అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మరో 60 ప్రత్యేక బస్సులు పంపించారు. రైళ్లలో ప్రయాణికులు పోటెత్తిపోతున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ ‌ప్రయాణికులతో పోటెత్తిపోతోంది. హైదరాబాద్‌ ‌నుంచి విజయవాడకు భారీగా ప్రయాణికులు వస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖకు భారీగా రాకపోకలు జరుగుతున్నాయి. ప్రయాణికులను అదనపు భారం మోపే విషయంలో రైల్వే శాఖ ఫక్తు వ్యాపార సంస్థగా వ్యవహరిస్తోంది. పండగ రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను నడపాల్సిన ఆ శాఖ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తోంది. పేద, మధ్య తరగతి వారి కోసం రైల్వే శాఖ జనసాధారణ్‌ ‌రైళ్లను నడపాలి. కానీ వాటిని చాలా పరిమిత సంఖ్యలోనే నడుపుతోంది. జనసాధారణ్‌ ‌రైళ్ల కన్నా సువిధ రైళ్లనే ఎక్కువగా నడుపుతోంది. సువిధ రైళ్లలో ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తారు. సాధారణ చార్జీ కన్నా 30 శాతం ఇంకా ఆ పైన ధరలు ఉంటాయి. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది.