- బలపరీక్షకు చక్రం అడ్డం వేసిన స్పీకర్
- గవర్నర్ ఆదేశాలు బేఖాతర్
- శాసనసభను 26వరకు వాయిదా వేసిన స్పీకర్ ప్రజాపతి
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో హై డ్రామా నెలకొంది. విశ్వాస పరీక్షను అడ్డుకునేలా స్పీకర్ తన అధికారాలను వినియోగించి సభను 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విశ్వాస పరీక్షకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం ఎదుర్కోవాల్సిన బలపరీక్షకు బ్రేక్ పడింది. అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ ప్రజాపతి ఈనెల 26వరకూ వాయిదా వేశారు. అంతకుముందు బ్జడెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ లాల్జీ టాండన్ రాజ్యాంగం నిర్ధేశిరచిన నియమాలను అందరూ గౌరవించి మధ్యప్రదేశ్ ప్రతిష్టను నిలపాలని సూచిస్తూ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. కాగా స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గవర్నర్ లాల్జీ టాండన్‌కు రాసిన లేఖలో కోరారు. ఇక సభను గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ సభ్యుల అభ్యంతరాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నినాదాల మధ్య సభను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
22 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో సభలో సభ్యుల సంఖ్య 222కు పడిపోగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ మార్క్ 112. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.ఇక తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ పేర్కొనగా, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్టాల్రను అప్రమత్తం చేసిన నేపథ్యంలో.. స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి జరుగనున్న విశ్వాస పరీక్ష వాయిదా పడింది. అంతకుముందు ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ్ మాట్లాడుతూ..విశ్వాస పరీక్ష నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు కమల్ నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. కమల్ నాథ్ ప్రభుత్వం నైతికంగా ఓడిపోయినట్లే లెక్క. సీఎం కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేయాలని గోపాల్ భార్గవ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలుసుకున్నారు. మరో నలుగురు స్వ తంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకం.
Tags: CM Kamal Nath, Former CM, BJP leader Shivraj Singh Chauhan, Jyotiraditya Scindia