వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దని హైకోర్టు ఆదేశించింది. ధరణిలో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్ పక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని కోర్టు పేర్కొంది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించవొచ్చని చెప్పింది. వ్యక్తి వివరాల కోసం ఇతర గుర్తింపు కార్డులు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన మ్యానువల్‌లో లొసుగులు ఉన్నాయని, స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నెంబర్లో ఆధార్ అడగొద్దని తెలిపింది.
అయితే కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సవరణకు వారం రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వం, హైకోర్టును కోరింది. అయితే సాప్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రకియలో ఇతర గుర్తింపు సర్టిఫికెట్లు అడగొచ్చని.. ఆధార్ వివరాలు మాత్రం సేకరించవొద్దని స్పష్టం చేసింది.
కోర్టుకు ఇచ్చిన హావి•ని ప్రభుత్వం ఉల్లంఘించిందని..తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించబోమని స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే తమ ఆందోళనని.. సాప్ట్‌వేర్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆధార్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగవొద్దంటూ ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.