తమపరిధిలో లేదన్న మంత్రి రవిశంకర్ ప్రసాద్
ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆంధప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని, దీని కోసం ఎటువంటి నిర్ణీత సమయం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ అంశం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణలో ఉందని పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానాన్ని ఇచ్చింది. జీవీఎల్ నరసింహారావు కేంద్ర న్యాయ శాఖ మంత్రిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలను సంధించారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదనలు పంపించిందా అని అడిగారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే, ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా లేదా అని అన్నారు.
ఈ ప్రశ్నలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ గురువారం రాజ్యసభలో సమాధానం చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన ధర్మాసనంతో అమరావతిలో ఏర్పాటైందని, దీని కార్యకలాపాలు 2019 జనవరి 1 నుంచి ప్రారంభ మయ్యాయని తెలిపారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారని తెలిపారు. అయితే ఇతర నగరాల్లో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు లేవన్నారు. హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత హైకోర్టును సంప్రదించి తీసుకుంటుందన్నారు.
రాష్ట్ర హైకోర్టు నిర్వహణ ఖర్చులను భరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, అదేవిధంగా, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం రోజువారీ పరిపాలన నిర్వహణకు బాధ్యులని తెలిపారు. ప్రస్తుత సందర్భంలో హైకోర్టును కర్నూలుకు తరలించడానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని తెలిపారు. ఈ విషయాల్లో ఎటువంటి నిర్ణీత సమయాన్ని నిర్దేశిరచలేదని తెలిపారు. అంతే కాకుండా ఈ అంశం ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణలో ఉందని పేర్కొన్నారు.