Take a fresh look at your lifestyle.

కొరోనా టెస్టుల నిర్వహణపై హైకోర్టు సీరియస్‌

  • పరీక్షల వివరాలు సమర్పించండి
  • కేంద్రం రాసిన లేఖలనూ ఇవ్వాలని ఆదేశాలు
  • ఎంతమంది వలస కార్మికులకు టెస్టులు చేశారు?
  • తక్కువ సంఖ్యలో టెస్టులు ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం

తెలంగాణలో కొరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ ‌విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జనాభాకు సరిపడ పరీక్షలు చేయకుండా వైరస్‌ ‌వ్యాప్తికి ప్రభుత్వమే కారణమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.మార్చి 11 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలకు సంబంధించిన వివరాలన్నీ సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృత దేహాలకూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లక్షణాలు లేనప్పటికీ హైరిస్క్ అవకాశాలున్న వారికీ కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో చాలా తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని న్యాయస్థానం నిలదీసింది. కరోనా పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస కూలీలకు ఎందరికి పరీక్షలు చేశారని.. రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎందరు వైద్య సిబ్బందికి ఇచ్చారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్‌ 4‌వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయడంలేదని, వైద్యులకు మాస్క్‌లు ఇవ్వటం లేదని, తిరిగి వస్తున్న వలస కార్మికులకు వసతి కల్పించడం లేదంటూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లపై న్యాయస్థానం మంగళవారం విచారణ జరుపుతూ.. దేశ వ్యాప్తంగా అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య చాలా తక్కువగా ఉందని మరోసారి గుర్తుచేసింది. అన్ని రాష్ట్రాలు ఐసీఎంఆర్‌ ‌నిబంధనలు పాటిస్తున్నాంటే రాష్ట్రంలో ఎందుకు సరైన నింబంధనలు పాటించల్లేదని ప్రశ్నించింది. ఒక మిలియన్‌ ‌జనాభాలో కేవలం 545 కరోనా టెస్టులు మాత్రమే చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఇప్పటి వరకు ఎన్ని టెస్ట్‌లు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 ,443 మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌వాదనలతో ఏకభవించని న్యాయస్థానం.. ఇప్పటి వరకు ఎంత మంది ప్రైమరీ,సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్ట్‌లు నిర్వహించారో జూన్‌ ‌మొదటి వారంలోపు కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరీక్షల నిర్వహణపై రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసిందని, దానిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కోరింది. అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశంలోనే లక్ష మంది వైరస్‌ ‌సోకి మృత్యువాడ పడ్డారని దయచేసి అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో కల్పించవద్దని పేర్కొంది.

Leave a Reply