- ఐఎఎస్‌ల కమిటీ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ
- ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తిస్తే తప్పేంటన్న కోర్టు
దేవరయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూములను సర్వే చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది. భూముల సర్వేకు ప్రభుత్వం ఐఏఎస్‌ల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన 1014 జీవోను కొట్టి వేయాలని కోరుతూ సదాకేశవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. జీవో 1014 అమలును నిలిపివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆలయ భూముల గుర్తింపునకు విచారణ నిర్వహిస్తే ఇబ్బందేంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా…కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా.? అని ప్రశ్నించింది.
విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని కోర్టు పేర్కొంది. నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వొస్తున్నారన్న పిటిషనర్ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకుంటే ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించింది. కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సహకరించక పోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవొచ్చని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.