హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి 21 : సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిసర ప్రాంతా ప్రాంతాలను స్థానిక ప్రజలను ఆయన కలిసి బాధితుల నుంచి పలు ఫిర్యాదులను స్వీకరించారు. సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ…బట్టల దుకాణము, స్పోర్టస్ దుకాణాలు ఉండటం మూలంగా నాలుగు అంతస్తుల బిల్డింగు పూర్తిగా ధ్వంసం కావడమే కాకుండా దాని నుంచి కెమికల్ వాసనలు వెదజల్లుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఈ బిల్డింగ్‌కి చుట్టుపక్కల పలు నివాస ప్రాంతాలు ధ్వంసం అయ్యాయని స్థానిక బస్తీ వాసులను ఆ ఇండ్ల నుంచి ఖాలీ చేయించడం మూలంగా నిరాశ్రయులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాద సమయంలో చనిపోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్ట పర్యటన చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలంలోని పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఆహార పదార్థాలను అందించడమే కాకుండా వైద్య సేవలను మరింత పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద కారణంగా ధ్వంసమైన స్థానిక ప్రజల ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య, ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, సనత్ నగర్ ఇన్చార్జి రమేష్, మహిళా జన సమితి రాష్ట్ర నాయకురాలు పుష్పలత, నగర నాయకులు శ్రావణ్ కుమార్, రామప్ప, నరసింహ, ఎల్లయ్య, రవికాంత్, సురేషు, లక్ష్మణ ,రసూలు, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొని స్థానిక బస్తీ వాసులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.