- పట్టభద్రుల నియోజకవర్గాలలో వోటర్లకు నేరుగా ఫోన్లు
- టీఆర్ఎస్ అభ్యర్థులకు వోటు వేయాలని విజ్ఞప్తి
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికలు జరుగనున్న రెండు స్థానాల్లోనూ విజయం సాధించే దిశగా అవసరమైన అన్ని రకాల వ్యూహాలను రచిస్తున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికలలో పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో పాటు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలలో వోటమితో రాష్ట్రంలో టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో సీఎం కేసీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరుగనున్న రెండు నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు అప్పగించారు.
రెండు నియోజకవర్గాలలోనూ పార్టీ అభ్యర్థుల ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతోంది, విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి ? ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి ? అనే అంశాలపై ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేరుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ అభ్యర్థుల గెలుపునకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వోటర్లను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ ఉద్యోగులతో పాటు న్యాయవాదులతో స్వయంగా తానే ఫోన్లో సంభాషించనున్నారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆరు జిల్లాలలోని గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇతర నిపుణులను వర్గీకరించి వారి ఫోన్ నంబర్లను ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వర్గాలు సీఎం కేసీఆర్‌కు అందజేశాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐటీ విభాగం నిపుణులు ముందుగానే రాసిన స్క్రిప్ట్‌ను సీఎం కేసీఆర్‌చే వాయిస్ రికార్డింగ్ చేయించి వాటిని తాము సేకరించిన ఫోన్ నంబర్లకు వినిపించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల గురించి ఆ వాయిస్ రికార్డింగ్‌లో పట్టభద్రుల నియోజకవర్గాల వోటర్లకు వివరించనున్నారు. అలాగే, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన విషయంలోనూ విపక్షాలు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా టీఆర్ఎస్ కార్యాలయ వర్గాలు కేసీఆర్ ప్రసంగంలో ఉండేలా తయారు చేస్తున్నాయి.
కాగా, గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడూ తీసుకోలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల విజయానికి టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులూ వొడ్డుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అనివార్యమనీ, స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగడమే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.