Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల్లో .. భానుడి ప్రతాపం ఎండలతో పాటుగా వడగాలుల ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఎండ మండిపోతున్నది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఎండలతో పాటుగా వడగాలులు కూడా తీవ్రంగా వేస్తున్నాయి. ఒకవైపు కరోనా ఇబ్బందులు పెడుతుంటే మరోవైపు ప్రచండ భానుడి తీవ్రత ఎక్కువైంది. లాక్‌డౌన్‌ ‌సడలింపులు ఇచ్చినా చాలామంది బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. బయటకు వెళ్తే ఎక్కడ వడదెబ్బ తగులుతుందో అని భయపడుతున్నారు. ఈ ఎండలు మరో మూడు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నది. మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలియజేసింది. అయితే ఒకటి రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్‌ ‌ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ దుగా ఉపరితల ద్రోణి ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఈ రెండు మూడు రోజులపాటు ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని అధికారులుఅంటున్నారు. రోహిణీ కార్తె ప్రవేశంతో భానుడు భగభగమంటున్నాడు. రోహిణి కార్తెలో రోళ్ళుపగిలేలా ఎండలు మండుతాయన్న మేరకు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అసలే కరోనా వైరస్‌ ‌ప్రభావంతో ఇళ్ల వద్దే ఉంటున్న ప్రజలు ఎండ తీవ్రతతో మరింతగా ఉంటి నుంచి బయటకురాని పరిస్థితి కలిగింది. ఎండలకు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో ఇళ్ల నుంచి జనం బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఉదయం 10గంటలు దాటితేనే రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. రోహిణికార్తి మొదలు కావడంతో వాతావరణంలో భారీ ఎత్తున మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, చిన్నారులు వడదెబ్బ బారిననపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళలోనే పనులు ముగించుకోవాలని, మధ్యాహ్నం అయినంత వరకు విశ్రాంతి తీసుకోవడం మేలని సలహాలు ఇస్తున్నారు. ఎండలో తిరుగుతూ పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగానే సుమారుగా ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని నీటిని తాగాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల శుద్ధమైన నీటిని తాగాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలను సేవించాలని సూచిస్తున్నారు . ముఖ్యంగా పండ్ల రసాలు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణాన్ని తీసుకోవాలని, వడదెబ్బ తగిలితే వెంటనే సప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యుల సూచనలు పాటించాలని పేర్కొంటున్నారు.

Leave a Reply