Take a fresh look at your lifestyle.

అకాల వర్షాలతో కుంగిన రైతు.. ఆచరణకు నోచుకోని హామీలు

అకాల వర్షాల వల్ల తెలంగాణలో నాలుగు వేలకు పైగా గ్రామాల్లో  పంటలు  దెబ్బతిన్నాయనీ, దిగుబడి నష్టం రెండువేల కోట్ల వరకూ ఉంటుందని రాష్ట్ర  వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ కురుస్తున్నాయి. 19న మరో అల్పపీడనం ఉందన్న వార్త పిడుగులా  అందింది. రైతులను ఆదుకోవడానికి  ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏవేవో కొత్త పేర్లతో  పథకాలను  ప్రకటిస్తున్నప్పటికీ, అవి  క్షేత్ర స్థాయిలో అమలు అయ్యే నాటికి మరింత ఎక్కువగా రైతుల పరిస్థితి దిగజారుతోంది. ప్రభుత్వం అందిస్తున్న లెక్కలు కూడా నిఖార్సైనవి కావు.  క్షేత్రస్థాయిలో  పరిస్థితిని అధ్యయనం చేసినప్పుడే  వాస్తవాలు వెలుగులోకి వొస్తాయి. తెలంగాణ ప్రభుత్వం దృష్టి అంతా దుబ్బాక ఉప ఎన్నిక,  హైదరాబాద్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలపైనే ఉంది.    ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌, ‌బీజేపీలు చేస్తున్న కసరత్తులు ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీల మధ్య ఈ విధమైన పోటీ ఉండటం సహజమే అయినా, అనుకోకుండా కురిసిన వర్షాల వల్ల  రైతులను పలకరించేవారే కరువవుతున్నారు. ఒకరిమీద మరొకరు నిందలు వేసుకోవడం తప్ప అంతిమంగా బాధితులకు సాయం అందడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్షాల సమయంలో ఫోన్‌లు చేసి ముఖ్యమంత్రులకు హామీలైతే ఇస్తున్నారు కానీ, అవి అమలుకు నోచుకోవడం లేదు. తెలంగాణలో పంటల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెంటనే  13 వందల కోట్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కేంద్రాన్ని కోరారు. ఆంధప్రదేశ్‌ ‌కూడా ఇదే మాదిరి డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచింది. జిఎస్టి పరిహారం చెల్లింపు విషయంలోనే రాష్ట్రాల డిమాండ్‌కు కేంద్రం తక్షణమే స్పందించడం లేదు. ఇక వర్షాలు, వరదల బాధితులకు సాయం విషయంలో స్పందిస్తుందన్న ఆశ కనిపించడం లేదు. తెలంగాణలోని 350 మండలాల్లో  ఏడు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నీట మునిగింది. సిద్ధిపేట జిల్లాలో 65 వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. ఆ తర్వాత భువనగిరి, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలకు నాలుగు లక్షలకు పైగా ఎకరాలలో పంట దెబ్బతింది. చాలా చోట్ల నీరు ఇంకా తీయలేదు.  వ్యవసాయ శాఖ ఇప్పుడు అందించిన వివరాలు తాత్కాలికమే. ఇలాంటి సందర్భాలలోనే రైతులకు ఎంత సాయం చేసినా తక్కువే అనే భావం ప్రతి వారిలో కలుగుతుంది. కానీ, మన దేశంలో కేంద్రమూ, రాష్ట్రాలూ రైతుల సమస్యలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఉన్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానంలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలూ, ఆందోళనలూ వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయ రంగంలో ప్రయోగాలు చేస్తోంది. కార్పొరేట్‌ ‌వ్యవసాయం, కాంట్రాక్టు వ్యవసాయం విధానాల ద్వారా రైతులను శాశ్వతంగా పేదలుగా ఉంచేందుకు ఆలోచనలు చేస్తోంది. కష్టం రైతులదీ, ఫలితం కార్పొరేట్‌ ‌వ్యవసాయం చేసే వారిదీ అవుతుందన్న  నిపుణుల అనుమానాలు నిరాధారం కాదు. మోడీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఫసల్‌ ‌బీమా(పంటల బీమా) పథకం వల్ల కూడా రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ఈ రంగానికి చెందిన ప్రముఖులు చెబుతున్నారు. బీజేపీ, దాని మాతృక అయిన  భారతీయ జనసంఘ్‌ ‌మొదటి నుంచి పట్టణ ప్రాంతాలకు పరిమితమైన మేథావుల పార్టీగా ముద్ర పడింది. కార్పొరేట్‌, ‌పారిశ్రామిక రంగాల ప్రయోజనాల కోసమే బీజేపీ నిరంతరం పోరాడుతుందని మాజీ ప్రధాని చరణ్‌ ‌సింగ్‌ ‌గతంలో అన్న మాటల్లో అసత్యం లేదు. రైతుల సమస్యలపై కమలనాథులకు అవగాహన తక్కువని ఆయన నలభై ఏళ్ళ క్రితమే వ్యాఖ్యానించారు. జనతాపార్టీ నుంచి ఆయన నేతృత్వంలోని లోక్‌ ‌దళ్‌ ‌విడిపోవడానికి ప్రధాన కారణం అదే. ఆంధప్రదేశ్‌లో కూడా వ్యవసాయ రంగం భారీ వర్షాలకు బాగా దెబ్బతింది. అకాల వర్షాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు రైతుల, మధ్యతరగతి వర్గాలు, వేతన జీవుల సమస్యలపై దృష్టి పెట్టాలి. కానీ, ఇప్పుడు అన్నిపార్టీలూ వోట్ల రాజకీయాలనే అనుసరిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల  రంగు మారిన ధాన్యం రెండు లక్షల మెట్రిక్‌ ‌టన్నులు ఉండవచ్చని తెలంగాణ వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని పౌర సరఫరా శాఖ కొనుగోలు చేయదు. ఇది రైతులను ఆందోళన కలిగిస్తున్న విషయం. ఆంధ్రాలో కూడా రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకపోయినా, ప్రతిపక్షంలోకి రాగానే రైతుల సమస్యలపై గొంతెత్తేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్‌  ‌విషయంలో కఠిన వైఖరిని అనుసరించిన చంద్రబాబు ఇప్పుడు రైతులపై ఎక్కడ లేని ప్రేమనూ ఒలకబోస్తున్నారు. అలాగే, బీజేపీ, తదితర పార్టీల నాయకులు ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు రైతుల సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రకటనలు చేస్తున్నారు. రైతులకు నిజంగా సాయం అందించేదెవరూ, నిజమైన రైతు బాంధవులు ఎవరన్న ప్రశ్నలు  రైతుల నుంచి వినిపిస్తున్నాయి. వీటికి సమాధానం నోటి మాట కాదు. ఆచరణాత్మకంగా ఉండాలి.

Leave a Reply