*నగర పౌరులకు తప్పని తిప్పలు
*క్యుములోనింబస్ మేఘాల ప్రభావం
బార్కస్ బాబానగర్‌లో శనివారం కురిసిన వాన వరదలో కొట్టుకుపోతున్న ఆటో..
చైతన్య పురి లో..
ఇటీవల కురిసిన భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ వర్షం కురిసింది. రెండు రోజుల విరామం తర్వాత శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో మరోసారి మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది. విద్యానగర్, గోల్నాక, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, అంబర్‌పేట, కాచిగూడలో మోస్తరు వర్షం కురిసింది. దిల్సుఖ్నగర్, మలక్‌పేట, కొత్తపేట, సరూర్‌నగర్, సైదాబాద్, చంపాపేట, ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, హబ్సిగూడ, వనస్థలిపురం, హయత్‌నగర్, బీ.ఎన్.రెడ్డి ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, రాయదుర్గం, పాతబస్తీ పరిధిలోని షేక్‌పేట, మదీనా, చార్మినార్, గోల్కొండ, టోలిచౌకి, లంగర్‌హౌజ్, మెహదీపట్నం, కార్వాన్, బహదూర్‌పుర, జూపార్క్, పురానాపూల్ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షంతో చేరిన వరద నీరు పోయినప్పటికీ బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టోలీచౌకి వద్ద వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో బయో-డైవర్సిటీ, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని పోలీసులు తెలిపారు. నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర సహాయ బృందాలను అప్రమత్తం చేసినట్లు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. నగర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వరద ప్రభావంతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బందిని పంపించినట్లు చెప్పారు. రహదారులపై నీరు నిల్వ ఉండకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రెండు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములో నింబస్ మేఘాల ఏర్పడడం వల్ల వర్షాలు పడుతున్నాయని, నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.