Take a fresh look at your lifestyle.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా.. దంచికొడుతున్న వానలు

పొంగుతున్న వాగులతో అంతటా జలకళ
సాగర్‌, ‌శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు
సింగూరుకు జలకళ..ఒక్కరోజులోనే 5 టిఎంసిల నీరు
ఏడుపాయల వద్ద జలజాతర
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ, కాగ్నా నదులు
వాగులో కొట్టుకుపోయి సంగారెడ్డిలో ఇద్దరు,
వికారాబాద్‌లో ఒకరు మృతి 

వికారాబాద్‌ ‌జిల్లాలో కాగ్ననది ఉధృతికి కొట్టుకు పోయిన రహదారులు…ఏడుపాయల వనదుర్గా ఆలయం వద్ద ఉధృతంగా ఆప్రవహిస్తున్న నది బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు దంచి కొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అంతటా జలకళను సంతరించుకుంది. పలు చోట్ల పంటలు నీటమునిగాయి. మొదక్‌ ‌జిల్లాలో తెల్లవారుజాము నుంచి వన దుర్గా ప్రాజెక్ట్ ‌పొంగిపొర్లుతున్నది. ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారి ఆలయం ముందు నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ నిజాంసాగర్‌ ‌వైపు పరుగులు పెడుతున్నది. సింగూరులోకి కూడా వరదనీరు చేరుతోంది. వికారాబాద్‌ ‌జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ, కాగ్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోటిపల్లి ప్రాజెక్టు అలుగు పారుతున్నది. భారీ వర్షాలకు ధారూర్‌ ‌మండలంలోని దోర్నాల్‌, ‌నాగసమందర్‌, ‌మంచన్‌ ‌పల్లి వద్ద తాత్కాలిక వంతెనలు మరోసారి కొట్టుకుపోయాయి. సంగారెడ్డి జిల్లాలో వాగులో పడి ఇద్దరు మృతి చెందారు. గురువారం ఉదయం కూడా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బుధవారం రాత్రి కేవలం 2 గంటల్లోనే 11 సెంటీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆకాశానికి చిల్లు పడిందేమో అన్నట్టు జడివాన కురిసింది. ఉరుములు, మెరుపులతో, గాలి తోడుగా వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలను నీళ్లతో నింపేసి, రహదారులను ముంచేసి నగరవాసులను బెంబేలెత్తించింది. వరద ధాటికి హకీంపేట్‌, ‌టోలిచౌకీ తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. రాజధానిలో ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. వాన ప్రభావానికి కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయింది. మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే గ్రేటర్‌లో నాలాల వద్ద రెస్క్యూ సిబ్బంది క్లీన్‌ ‌చేసే పనిలో పడ్డారు. భారీ వర్షానికి పలు చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువలను తలపించాయి. గ్రేటర్‌లోని పాతబస్తీ బహదుర్‌పురా, చందూలాల్‌ ‌బరాదరిలో అత్యధికంగా 11సెంటీటర్ల వర్షపాతం నమోదవ్వగా పటాన్‌చెరు, మహేశ్వరంలో అత్యల్పంగా 1 సెంటీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడనుండడంతో రాగల ఐదు రోజులు గ్రేటర్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

heavy rains in telangana

వాగులో కొట్టుకుపోయి సంగారెడ్డిలొ ఇద్దరు, వికారాబాద్‌లో ఒరకు మృతి
సంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు పొంగి పొర్లిన వాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని జహీరాబాద్‌ ‌మండలం సత్వార్‌ ‌గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం గ్రామ పరిధిలో భారీ వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రాజు (40), హద్నూర్‌ ‌గ్రామానికి చెందిన రాజు (40) వాగులో పడి కొట్టుకుపోయారు. గురువారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదల మధ్యలో మృత దేహాలను గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృత దేహాలను జహీరాబాద్‌ ‌దవాఖానకు తరలించారు. అల్పపీడ ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. వికారాబాద్‌ ‌జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మర్పల్లి మండలంలో కురిసిన వర్షానికి షాపూర్‌ ‌వాగులో కొట్టుకుపోయిన అనితా బాయి అనే మహిళ మృతి చెందింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

కాలువలో చిక్కుకున్న రైతులు క్షేమం
నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా అచ్చంపేట మండలం, సిద్దాపూర్‌ ‌దిండి కాలువలో చిక్కుకున్న ఇద్దరు రైతు దంపతులను ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందం రక్షించింది. పొలంలో పనికోసం వెళ్లిన రైతు దంపతులు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. ఒడ్డుకు చేరలేక ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్‌ ‌శర్మన్‌, ఎస్పీ సాయి శేఖర్‌, ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాన్ని రంగంలోకి దింపి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సాగర్‌, ‌శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు
నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,45,651 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు సాగర్‌ 12‌గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు నెలల్లో మూడోసారి నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌కు ఇన్‌ప్లో 2,45,651 క్కూసెక్కులుగా ఉంది. అవుట్‌ప్లో 2,17,984 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 310.2522 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులకు చేరుకుంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండడం, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ‌రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి నీరు వచ్చి చేరుతోంది. అదనపు నీటిని క్రస్టుగేట్లు, జలవిద్యుత్‌ ‌కేంద్రం, కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ప్లో ఆధారంగా క్రస్టుగేట్లను పెంచుతూ తగ్గిస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ప్లో కొనసాగింది. మరోవైపు దుందుభి నదికి వరద పోటెత్తడంతో డిండి జలాశయం అలుగుపోస్తున్నది. మూడు రోజులుగా వరద రాకతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు ఎత్తు 36అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.45టీఎంసీలు. నీటిమట్టం బుధవారం ఉదయం ఆరు గంటలకు 36.6చేరడంతో అలుగు ప్రవహించింది. దుందుభి నది నుంచి సుమారు పది వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏడేండ్ల తర్వాత ప్రాజెక్టు అలుగు పోస్తుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఈ వానకాలం సీజన్‌లో డిండి ప్రాజెక్టు ఆయకట్టులో సుమారు పన్నెండు వేలకు పైగా ఎకరాల్లో వరి సేద్యానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి విడుదల సమయంలో ప్రాజెక్టులో 26అడుగుల మేర నీరు నిల్వ ఉండగా.. క్రమంగా తగ్గి 20అడుగులకు చేరింది. ఆగస్టు 12నుంచి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం ప్రారంభమై ప్రస్తుతం 33.6అడుగులకు చేరింది. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఎ•-‌లో 2,22,625 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ‌ఫ్లో 3,14,730 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు. పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ 215.80 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు జల విద్యుత్‌ ‌కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

సింగూరుకు జలకళ..ఒక్కరోజులోనే 5 టిఎంసిల నీరు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు ఇన్‌ ‌ప్లో పెరిగింది. ఇటీవలి వర్షాలతో సింగూరుకు చుక్కనీరు రాలేదు. తాజాగా కురిసన వర్షాలతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.99 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 8.520 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్ట్ ‌లోకి 45,282 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో వచ్చింది. వర్షాకాలం ముందు వరకు కేవలం అర టీఎంసీ లెవల్‌ ‌కి వాటర్‌ ‌పడిపోయిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో దాదాపు 5 టీఎంసీల నీరు చేరింది. తాగునీటి సరఫరాకే ఇబ్బందులు ఏర్పడుతున్న సమయంలో ఇన్‌ ‌ప్లో రావడం స్థానికంగా ఊరట నిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు జలకల సంతరించుకోగా సింగూరుకు ఇప్పుడు ఇన్‌ ‌ప్లో పెరుగుతున్నది. ఇన్‌ ‌ప్లో కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టం మరింత పెరగనున్నదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాను ముంచెత్తగా..వాగులు పారుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అలాగే, మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో పుల్కల్‌ ‌మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్ద నిర్మించిన చెక్‌డ్యాం మత్తడి దుంకింది. పాపన్నపేట మండల పరిధిలోని కందిపల్లి చెరువు అలుగు పారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగల్‌గిద్ద మండలంలో కురిసిన వర్షానికి ఎస్గీ-ఔదత్‌పూర్‌ ‌గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన వంతెన తెగిపోయింది. జహీరాబాద్‌ ‌పట్టణంలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారి వరద నీటితో మునిగిపోయింది. అలాగే, జిల్లా సరిహద్దు ప్రాంతం గుండా ప్రవహించే మంజీర నదిలో భారీగా వరద చేరుకున్నది. హుస్నాబాద్‌ ‌డివిజన్‌ ‌వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నీటి వనరులు నిండుకుండల్లా మారాయి. హుస్నాబాద్‌ ‌పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, ప్లలెచెరువులు జోరుగా మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలంలో అత్యధికంగా 108.5 మి. వర్షపాతం నమోదయ్యింది. కాగా, రామాయంపేట పట్టణంలోని హనుమచెరువు సుమారు 20 ఏండ్ల తర్వాత అలుగు పారుతుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

వనపర్తి జిల్లా బండరాయిపాకుల గ్రామంలో పెద్ద చెరువు తెగడంతో గ్రామంలోకి నీరు
రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో పెద్ద చెరువు తెగి నీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేవెల్లి ఎస్‌ఐ, అధికారులు గ్రామస్తులను తరలించేందుకు యత్నిస్తుండగా..గ్రామస్తులు నిరాకరించారు. పీఆర్‌ఎల్‌ఐ ‌నీళ్లు కూడా గ్రామం దగ్గరికి చేరుకోవడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు ఉన్నారు. పిఆర్‌ఎల్‌ఐలో బండ రాయిపాకుల గ్రామం ముంపునకు గురైంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply