Take a fresh look at your lifestyle.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు

  • ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం
  • వరదనీటితో నిండుకుండల్లా ప్రాజెక్టు
  • ధర్మపురికి నిలిచిన రాకపోకలు
  • వేములవాడలో 11 సెంటీటర్ల వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నది. ఇది మరింత బలపడడంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం, నిర్మల్‌, ‌జగిత్యాల, కరీంనగర్‌, ‌రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, ‌రూరల్‌, ‌జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్‌, ‌జూరాల, శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌సహా అనేక చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు పొంగి మత్తళ్లు పోస్తున్నాయి. కృష్ణా నదికి వరద పెరిగింది. ఎగువ నుంచి, నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది.

ఇప్పటికే డ్యామ్‌ ‌పూర్తిస్థాయిలో నీటితో నిండుకుంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్‌ ‌జలాశయానికి భారీగా ఇన్‌ప్లో వస్తోంది. జూరాల నుంచి శ్రీశైలానికి లక్షా 37 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ప్లో వస్తుండటం..ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో డ్యామ్‌ 9 ‌క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 80 వేల క్యూసెక్కులకుపైగా స్పిల్‌ ‌వే ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.58 అడుగులు టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌ ‌జలాశయం సైతం పూర్తిగా నిండటంతో 14 క్రస్టుగేట్లను ఎత్తి 2 లక్షల దిగువ పులిచింతలకు విడుదల చేస్తున్నారు. కుడికాల్వ, ఎల్‌ఎల్‌బీసీ, వరద కాల్వ, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 39 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ‌జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌నుంచి నీటిని వదలడంతో గోదావరి తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నదిలో చేపలు పట్టకూడదని, అటుగా ఎవరూ వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రాజెక్ట్ ‌గేట్లు ఎత్తిన దృష్ట్యా సందర్శకులు ఎవరూ ప్రాజెక్ట్ ‌వద్దకు రావద్దని నిషేధం విధించారు. కొరోనా వైరస్‌ ‌ప్రభావంతో సందర్శకులకు అనుమతి లేదని ప్రకటించారు. గోదావరికి భారీగా వరద పెరుగుతోంది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు వరద వస్తుండడంతో శ్రీరాంసాగర్‌ ‌జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,091 అడుగులు కాగా పూరిస్థాయిలో నిండింది. నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 90.31 టీఎంసీలు ఉంది. జలాశయం గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. అలాగే వరద కాలువ ద్వారా దిగువ మానేరులోకి సైతం నీటిని తరలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో భారీ వర్షాపాతం నమోదైంది. అలాగే పలు మండలాల్లోనూ వర్షం కురిసింది. వానకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనంతారం వాగుపై నుంచి నీరు ప్రవహించడంతో జగిత్యాల-ధర్మపురి మధ్య, చల్‌గల్‌ ‌వద్ద ఒర్రె ఉధృతంగా పారడంతో జగిత్యాల-రాయికల్‌ ‌మధ్య, గుల్లపేట-పొలాస మధ్య వంతెనపై నుంచి నీళ్లు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నాగిరెడ్డిపేటలో 118.5 మి. వర్షాపాతం నమోదైంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బోయినపల్లిలో భారీవర్షం కురిసింది. నారాయణపేట, మహబూబ్‌నగర్‌, ‌ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, హైదరాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌ అర్బన్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

ధర్మపురికి నిలిచిన రాకపోకలు
జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. 17 సెంటీటర్ల వర్షపాతం నమోదు కాగా శివారు కాలనీలు నీట మునిగాయి. జగిత్యాల జిల్లాలోని గోవింద్‌ ‌పల్లిలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా కురిసిన వర్షానికి కార్లు, పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. చుట్టు పక్కన ఉన్న చెరువులకు గండి పడింది. దీంతో జగిత్యాల, ధర్మపురికి రాకపోకలు నిలచిపోయాయి. అలాగే వర్షాలకు పంటలు నీట మునగగా కాలువలు, చెరువులకు గండ్లుపడ్డాయి.

వేములవాడలో 11 సెంటీటర్ల వర్షపాతం
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల వరద ధాటికి రోడ్లు తెగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. వేములవాడలో 11 సెంటీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు పునరావాస చర్యలు చేపట్టారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఒగ్గు మల్లేశంకు చెందిన 30 గొర్రెలు పిడుగు పాటుకు మృత్యువాత పడ్డాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!