Take a fresh look at your lifestyle.

‘‌భదాద్రి’ జిల్లాలో భారీ వర్షాలు

  • పంటపొలాల్లో వర్షం నీరు – వాగులను తలపిస్తున్న ప్రధాన రహదారులు
  • వర్షపు నీటిలో కొట్టుకుపోయి బాలిక మృతి

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భదాద్రి కొత్తగూడెం జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం ఉదయం నుండే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఎటు చూసిన రహదారులు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం, పాల్వంచ మండలాలు పూర్తిగా వరదనీటితో మునిగిపోయాయి. కొత్తగూడెంలోని రైల్వే బ్రిడ్జి క్రింద రహదారి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు బయటకు పోయే పరిస్థితి లేక నీరు ఎక్కడికక్కడే నిలిచి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లోతట్టు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. పాల్వంచ పట్టణంలోని పలు కాలనీలు వర్షపు నీటితో మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై నీటి ప్రవాహం వేగంగా ప్రవహిస్తుంది. దీని కారణంగా పాల్వంచ మండలంలో జయమ్మ కాలనీలో అంజలి అనే బాలిక వర్షపు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది.

స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కిలోమీటరు మేర కాలువలో కొట్టుకుపోయింది. స్థానికులు వెతికేసరికే ఆ బాలిక మృత్యువాత పడింది. దీనితో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే నారు వేసుకున్న పంట పొలాల్లో వర్షపు నీరు భారీగా రావడంతో పంట పొలాలు నీట మునిగాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులకు హెచ్చరికలు జారీ చేసారు. మండలాలు, గ్రామాలలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా భారీగా వర్షాలు వొస్తునందున రోడ్లపైకి ఎవరు రావద్దని సూచించారు. వర్షపు నీరు ప్రవాహం ఎక్కువగా ఉంటున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ‌కోరారు.

అలాగే గోదావరి, చెరువుల వద్దకు చేపలు పట్టేందుకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసారు. అలాగే నీరు ఎక్కువగా ఉన్నచోట సెల్ఫీలు తీసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. సోమవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో పంట పొలాలు వర్షపు నీటితో నిండిపోయాయి. లోతట్టు కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. సహాయం కోసం భాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరోమూడు రోజులు వర్షం కురిసేలా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

Leave a Reply