Take a fresh look at your lifestyle.

ఎపి వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

విజయవాడ, సెప్టెంబర్‌ 26 :  ‌గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నారు. ప్రకాశం, కడప,గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. కర్నూలులో పలు వాగులు పొంగుతున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుంటడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో సుమారు లక్ష క్యూసెక్కులను దిగువ కృష్ణా కెనాల్‌తోపాటు సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల అధికారులు తెలిపారు. ఏపీవ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వాగులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా బండి ఆత్మకూరు మండలంలో 180.6 మిల్లిటర్ల వర్షపాతం నమోదయ్యింది. మహానంది -గాజులపల్లి మధ్య పాలేరు వాగు వంతెనపై నుండి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నంద్యాల – భీమవరం మధ్య వక్కిలేరు వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గడివేముల మండలం కోరటమద్ది వద్ద వాగు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వినుకొండ,  సీతయ్య నగర్‌లో వర్షానికి ఓ పెంకుటిల్లు కూలిపోయింది. రాజుపాలెం మండలం బలిజేపల్లి వద్ద ఎద్దు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజధాని గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద వాగు పొంగి పొర్లుతుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డెల్టా ప్రాంతంలో కుండపోత వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. కడప జిల్లా పెద్దముడియం మండలంలో కుందూ ప్రవాహం పెరుగుతుంది. లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు. నెమలిదిన్నె, బలపన గుడూరు, చిన్నముడియం, సిరిపాల దిన్నే, గర్శలూరు, ఉప్పలురు, పెద్దముడియం గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది.

పోరుమామిళ్ళ, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. పోరుమామిళ్ళ మండలంలో నాగలకుంట్ల, బూరగమానుప్లలె చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. గోపవరం మండలం మడకల వారిప్లలె రాచెరువుకు భారీగా వర్షపు నీరు చేరింది. ఐదేళ్ల తర్వాత చెరువుకు నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రొంపిచర్ల మండలం మునమాక, తుంగపాడు వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసరావుపేట వైపు రాకపోకలు బంద్‌ అయ్యాయి.  తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు పొంగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. కడప నగరంలోని ఆర్టీసీ గ్యారేజిలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరుకుంటోంది. అలాగే జిల్లాలోని కమలాపురం – ఖాజీపేట ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జిపై పాగేరు వంక పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  ప్రమాదకర స్థాయిలో కడప జిల్లా బుగ్గ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. నాలుగు గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. బుగ్గవంక పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. బుగ్గవంక కాలువ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌ ‌బాషా పర్యటించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ చెరువుకు గండి పడటంతో చీరాల – ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో  శ్రీనివాస థియేటర్‌ ‌వద్ద ఇళ్ల లోకి చేరిన వరద నీరు చేరడంతో ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. రాచెర్ల మండలంలో గుండ్లకమ్మ ఉగ్రరూప దాల్చింది. గిద్దలూరు-ఆకవీడుకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. బెస్తవారిపేట మండలంలో వాగులు పొంగిపొర్లు తున్నాయి. బాసినేపల్లి వద్ద వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని రావిపాడు వద్ద గండ్లకమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగులో ఒక ట్రాక్టర్‌ ‌కొట్టుకుపోయింది. పోలీసులు, ఫైర్‌ ‌సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ఏడుగురు ఉన్నట్టు సమాచారం.ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో భారీ వర్షానికి చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఎస్టీ కాలనీలోని ఇళ్లలోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. అలాగే వాగు ఉధృతికి ఆర్టీసీ బస్సు ఒరిగింది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను కాపాడారు. స్థానికులను అప్రమత్తం చేసిన పోలీసులు  వాహనదారులకు అంతరాయం లేకుండా సహాయక చర్యలు చేపట్టారు. బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తూర్పు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.

వాగు ఉధృతికి ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోగా.. స్థానికులు ఒకరిని కాపాడారు. మరొకరు మృతి చెందారు. అంబడపూడి గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి శ్రావణ్‌ ‌కుమార్‌ ‌మృతి చెందాడు. అనంతపురం జిల్లా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో కుండపోత వర్షం పడుతుంది. డోనేకల్‌ ‌వాగు పొంగిపొర్లడంతో గుంతకల్లు-బళ్లారి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరిలో  ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి వరద నీరువచ్చి చేరుతుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ ‌నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద నీటిమట్టం 5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ ‌వద్ద కు మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల ప్రభావం పెద్దగా లేకపోయినా గోదావరి కాస్త పెరిగితే లంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే ఐదు లక్షల క్యూసెక్కుల కు మించి వరదనీరు పెద్దగా వచ్చే అవకాశం లేదని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా శనివారం దేశంలోని పలు ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.  మరఠ్‌వాడ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, ఆంధప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని వెల్లడించింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. శనివారం డియాతో మాట్లాడుతూ రాగల రెండు రోజుల్లో పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు  నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత సూచనలు చేశారు.

Leave a Reply