Take a fresh look at your lifestyle.

భారీ వర్షాలు.. భారీ నష్టం

రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద నష్టాన్నే చవిచూడాల్సి వొచ్చింది. పంటలు, రహదారులు, ఇతర ఆస్తులకు తీవ్రంగా నష్టం జరిగింది. అనేక జిల్లాల్లో ప్రజల జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, నీటితో నిండిన ఇండ్లలో నిద్రాహారాలు మాని నిశ్చేష్టులైన వారెందరో. ఈసారి వర్షాకాలం ముందస్తు జల్లులు కురువగానే రైతాంగం ఎంతో సంతోషపడింది, తొలకరి జల్లు మొదలు, ఆగస్టు చివరి నాటివరకు నాట్లు వేసుకుంటూనే ఉన్నారు. నీరు సమృద్ధిగా లభిస్తుండడంతో ఈ సారి సాధారణం కన్నా సాగుబడి అధికంగా జరిగినట్లు తెలుస్తున్నది. నూటా పదిశాతం సాగు జరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులు కూడా రెట్టింపు ఉత్సాహంతో మంచి దిగుబడి వొస్తుందని బాగానే పెట్టుబడులు పెట్టారు. అయితే వారం రోజులకు పైగా వరుసగా కురుస్తున్న వర్షాలు వారి ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది. ఇప్పటికీ ఈ ప్రమాదం పోయిందని అనుకోవడానికి లేదు. వరుణుడు తాత్కాలికంగా శాంతించినప్పటికీ ఈ నెల 11వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది.

ఈ వర్షాల కారణంగా ఎంతలేదన్నా వెయ్యి కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా చోట్ల పొలాలు నీటితో నిండి ఉన్నాయి. మరి కొన్ని చోట్ల మట్టితో, ఇసుక మేట వేసి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాన తగ్గుముఖం పట్టడంతో ఎక్కడ ఎంత నష్టం జరిగిందన్న విషయాన్ని అంచనా వేస్తున్నారు. అయితే ఎంతలేదన్నా ఆరున్నర లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందన్నది ఒక అంచనా మాత్రమే. ఇందులో కూడా ఇప్పటి వరకు 1.20 లక్షల ఎకరాల్లోని పంటలైతే ఎందుకూ పనికిరాకుండా పోయాయనే లెక్కలు వొస్తున్నాయి. ఎక్కువ శాతం వరి పంటకు నష్టం వాటిల్లగా రెండవ పెద్ద పంట అయిన పత్తి, మిర్చి, మొక్కజొన్న రైతాంగం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వొచ్చింది. పెసర, కందులు, పసుపు, నువ్వుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లాక్‌డౌన్‌ ‌నుండి కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతుండగా ఇప్పుడు ఈ వర్ష ప్రభావం ఆ పంటలపై భారీగానే పడింది. ముఖ్యంగా ఆకుకూరలైతే ఎందుకూ పనికి రాకుండా పోగా టమాటా, బీర, వంకాయ పంటలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. పంటలు తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల పరిధిలోని పద్దెనిమిది జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనావేస్తున్నారు. జగిత్యాలలో అత్యధికంగా అంటే దాదాపు ఇరవై ఆరు వేల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లిందంటున్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో కూడా దాదాపు పదిహేడు వేల ఎకరాల పంటకు నష్టం వాటిల్లి ఉండవచ్చనుకుంటున్నారు.

అదే విధంగా వరంగల్‌లో పదహారు, ఖమ్మంలో పదిహేను, భూపాలపల్లిలో పదకొండు, సిద్ధిపేటలో పదమూడు, ములుగులో ఎనిమిది వేల ఆరు వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. రైతాంగానికి జరిగిన ఈ భారీ నష్టానికి సంబంధించి ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందన్నదే ఇప్పుడు ప్రధాన ంగా మారింది. గత ఏడాది కూడా సుమారు రెండు వేల అయిదు వందల కోట్ల రూపాయల విలువగల పంట నష్టం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం తన వంత ఆర్థిక సహాయాన్ని రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. అయితే తమకు మాత్రం నష్టపరిహారం అందలేదని నిన్న మొన్నటి వరకు నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఇలాంటి ప్రమాదాల కారణంగా రైతులు తమ పంటలను నష్టపోయినప్పుడు ఆర్థికంగా వెసులుబాటుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ ‌బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.

అయితే దాన్ని రాష్ట్రంలో అమలు పర్చలేదు. దీనివల్ల దాదాపు రెండేళ్ళుగా వివిధ కారణాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా సహకారం లభించకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు ప్రత్యామ్నాయ పథకమేదీ ఏర్పాటు చేయకపోవడం కూడా రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా అనేక జిల్లాలో రోడ్లు చెరువులను తలపించేవిగా మారాయి. పంచాయితీ, మున్సిపాలిటీల పరిధిలో సహాయక చర్యలు చేపట్టాలన్నా కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నది లేదు. దీంతో కాలనీలన్నీ నీటమునిగిపోయాయి. పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సిరిసిల్లలో మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా అక్కడి మహిళలు చూపించిన ఆగ్రహమే ఇతర జిల్లా ప్రజల్లో కూడా ఉంది. ఈ వరద నీటి నుండి రాష్ట్రం ఎప్పటికి బాగుపడుతుందో ఆ భగవంతుడికే తెలియాలి.

Leave a Reply