Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు

  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • ప్రాజెక్టుల్లోకి వొచ్చి చేరుతున్న వరదనీరు
  • పరిగి-వికారాబాద్‌ ‌మధ్య రాకపోకలకు అంతరాయం
  • ఎగువన వర్షాలతో శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వొచ్చి చేరుతుంది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించి పోయింది. మరోవైపు ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది. కందకుర్తి వద్ద నిండుగా గోదావరి ప్రవహిస్తోంది. శ్రీరాం సాగర్‌ ‌ప్రాజెక్టుకు 80,500 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో వొచ్చి చేరింది. ఎస్సారెస్పీ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1080 అడుగులకు చేరుకుంది. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుతం 50 టీఎంసీలకు చేరుకుంది.

ఇక హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు ఉండగా.. 642 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తి 3,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వొదిలారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువన ఛత్తీస్‌గడ్‌.. ‌తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి వరదనీరు జలాశయాల్లోకి చేరుతుంది. మొన్నటి వరకు ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసి అన్ని గేట్లు దించి జలాశయంలోకి వరదనీరు వొచ్చి చేరేలా గేట్లను మూసివేశారు. ప్రాజెక్టుకు 74 మిటర్ల గరిష్ట నీటి మట్టం వరకు వరద నీరు చేరుకోవడంతో బుధవారం ఉదయం 15 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 16వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు.

సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భారీగా వొస్తున్న వరదతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 642.5 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 645 ఫీట్లుగా ఉంది. దీంతో మొత్తం నాలుగు గేట్ల ద్వారా 2,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీ ప్రాజెక్ట్ ‌గేట్లు ఎత్తి వేయడంతో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్‌.‌భాస్కరన్‌ ‌హెచ్చరించారు. గేట్లు ఎత్తడంతో ఉధృతంగా ప్రవహించే నీటితో ప్రమాదం ఉన్నందున ఎవరూ చేపల వేటకు నదిలోకి వెళ్లొద్దని సూచించారు. మరోవైపు మూసీ ప్రాజెక్టకు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేట్‌ అడుగు మేర ఎత్తి ఏడు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ ‌ఫ్లో 5,500 క్యూసెక్కులు, అవుట్‌ ‌ఫ్లో 4,400 క్యూసెక్కులుగా ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వొస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటిని కిందికి వొదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 529.80 అడుగులకు చేరుకుంది. సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 167.7568 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్‌ ‌ఫ్లో 15,444 క్యూసెక్కులు, అవుట్‌ ‌ఫ్లో నిల్‌గా ఉంది.

ఎల్లంపల్లి పూర్తి నీటినిల్వ 20.175 టీఎంసీలు. ప్రస్తుతం 19.0362 టీఎంసీలకు చేరుకుంది. ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696.17 అడుగుల వద్ద నీరు ఉన్నది. అదే విధంగా ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.473 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయం 4 వరద గేట్ల ద్వారా 23,677 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ నుంచి భారీగా వరద వొస్తుండటంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని కిందికి వొదిలేస్తున్నారు. పరిగిలోని బీసీ కాలనీ నీటమునిగింది. వికారాబాద్‌లో కాలనీలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. పరిగిలో నస్కల్‌ ‌వాగు పొంగిపొర్లుతున్నది. దీంతో పరిగి-వికారాబాద్‌ ‌మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కందనెల్లి సమిపంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో తాండూరు- హైదరాబాద్‌ ‌రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని కాగ్నా నదితో పాటు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. లెండి వాగు పొంగడంతో గోజెగావ్‌-‌మద్నూర్‌ ‌మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బిచ్కుంద మండలం రాజోల వద్ద వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాజోల-బిచ్చుంద మధ్య వాహనాలు నడవడానికి వీలులేకుండా పోయింది.

ఎగువన వర్షాలతో శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్కుల నీరు వొస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. భారీగా వరద వొస్తుండటంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 1079.40 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 50.779 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరికి వరద పెద్దఎత్తున వొస్తున్నది. గోదావరి, మంజీరా నదుల ద్వారా వరద వొస్తుండడంతో ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడింది. గడిచిన మూడు రోజులుగా మహారాష్ట్రతో పాటు ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరామసాగర్‌ ‌ప్రాజెక్టులోకి 92,590 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో పాటు పై నుంచి వరద వొస్తుండడంతో గేట్లను ఎత్తి దిగువకు వొదులుతున్నారు. ఆ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వొస్తున్న వరద ఆధారంగా గేట్లను తెరుస్తున్నారు. కిందనున్న ఎస్సారెస్పీ అధికారులతో పాటు సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌ అధికారులకు సమాచారం అందిస్తున్నారు.

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రాజెక్టుకు మరింత వరద పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు. ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం సగానికిపైగా నీళ్లు వచ్చి చేరడంతో ఆయకట్టుకు ఢోకాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు ఎగువతో పాటు ఆయకట్టు పరిధిలో భారీ వర్షాల వల్ల ఆయకట్టు పరిధిలో నీటి విడుదల అవసరం లేకున్నా వర్షాలు తగ్గితే నీటి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టులో ప్రతీ సంవత్సరం 40 టీఎంసీలకు పైగా నీళ్లు ఉంటేనే వానాకాలం పంటకు నీటిని విడుదల చేస్తారు. యాసంగిలో 60 టీఎంసీలకుపైగా ఉంటే ఇస్తారు. ఎస్సారెస్పీకి ప్రస్తుతం వొసున్న వరదతో మరో రెండు రోజుల్లో పది టీఎంసీలకుపైగా చేరే అవకాశం ఉంది. ఇప్పటికే లక్ష్మి, గుత్ప, అలీసాగర్‌ ఆయకట్టుకు ప్రాజెక్టు నుంచి రెండు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు దిగువన కరీంనగర్‌ ఎల్‌ఎం‌డీలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో నీటి విడుదల చేశారు. ఎల్‌ఎం‌డీ ఎగువన రైతుల అవసరాలను బట్టి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ నిండుగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో విష్ణుపురి గేట్లు ఎత్తడంతో పాటు భారీగా కురిసిన వర్షానికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మంజీర, హరిద్ర నదులు కూడా నిండుగా ప్రవహిస్తున్నాయి.

Leave a Reply