Take a fresh look at your lifestyle.

తగ్గుతున్న గోదావరి

కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక
పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు

ఎడతెరుపులేని వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ఉదృతికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గత రెండు రోజులుగా వేగంగా పెరుగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రానికి 61.7 అడుగులు ఉన్న గోదావది నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతూ మంగళవారం సాయంత్రానికి 51.5 అడుగులకు చేరుకుంది. దీనితో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. భద్రాచలం పట్టణంలోని రెవెన్యూ కాలనీ , సుభాష్‌ ‌నగర్‌ ‌కాలనీ, చప్టాదిగువ ప్రాంతాలు ఇంకా జలమయంలోనే ఉన్నాయి. రామాలయం చుట్టూ వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. అలాగే రాజుపేట కాలనీ వద్ద కూడ వరద నీరు చేరుకుంది. దీనితో సోమవారం ఉదయం నుండే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి నీటిమట్టం కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికి పునరావాస కేంద్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. నన్నపనేని హైస్కూల్‌, ‌బిఇడి కాలేజ్‌, ‌జూనియర్‌ ‌కాలేజ్‌, ‌డిగ్రీ కాలేజ్‌ ‌ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొరోనా ప్రభావంతో కొంతమంది బాధితులు పునరావాస కేంద్రాల్లోకి వెళ్ళేందుకు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తుండటంతో పోలీసులే రంగ ప్రవేశం చేసి పునరావాస కేంద్రాలకు తరలించటం జరిగింది. కొద్దిగా వరద తాకిడి తగ్గుముఖం పట్టడంతో ఆయా ప్రాంతాలను గ్రామ పంచాయితీ సిబ్బంది బ్లీచింగ్‌ ‌చల్లే కార్యక్రమం చేపట్టారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తరువాత స్వంత ఇండ్లకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.

వరద ప్రాంతాలను పరిశీలించిన జడ్‌పిచైర్మన్‌, ఎస్పీ, ఐటిడిఏ పిఓ, ఏఎస్పీ
వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలను మంగళవారం భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో జడ్పీ చైర్మన్‌
‌కోరం కనకయ్య, ఎస్పీ సునీల్‌ ‌దత్‌, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ ‌పొట్రూ, ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర కలిసి పరిశీలించారు. వరద తాకిడికి గురైన గ్రామాలకు సహాయం అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. అలాగే దుమ్ముగూడెం, భద్రాచలం బూర్గంపాడు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను కలుసుకున్నారు. వారికి అందుతున్న సహాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సెక్టోరియల్‌ అధికారులు శ్రద్ధ చూపాలని ఐటిడిఏ పిఓ గౌతమ్‌ ‌పొట్రూ ఆదేశాలు జారీ చేసారు. వరద ప్రభావం తగ్గు ముఖం పట్టినందున ప్రజల భయాపడాల్సిన అవసరం లేదని అధికారులు దైర్యాన్ని ఇచ్చారు.

దేశంలోనే అత్యధిక వర్షపాతం..హన్మకొండ నగరంలో నమోదు  
దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన పది నగరాల్లో హన్మకొండ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. హన్మకొండలో 212 మి.. వర్షపాతం నమోదు కాగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మహారాష్ట్రలోని మహబలేశ్వరంలో 155 మి.., మూడో స్థానంలో మధ్యప్రదేశ్‌లోని ఉమరిలో 153 మి.. వర్షపాతం నమోదైంది. కాగా, వర్షం భారీగా కాకుండా ఐదు రోజుల పాటు ఓ మోస్తరు, ముసురు రూపంలో కురవడంతో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని, అలా కాకుండా భారీ వర్షం కురిస్తే జలప్రళయం ఏర్పడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా భారీ వర్షం కారణంగా నగరం తడిసి ముద్దయ్యింది. నీట మునిగి పోయింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!