Take a fresh look at your lifestyle.

జంటనగరాల్లో భారీ వర్షం

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
  • రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణశాఖ

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృత్తమై చిరు జల్లులతో వర్షం ప్రారంభమైంది. నగరంలోని అమిర్‌ ‌పేట్‌, ‌పంజాగుట్ట, బేగంపేట్‌, ‌సికింద్రాబాద్‌, ‌బంజారా హిల్స్, ‌మెహిదీపట్నం తదితరల ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురియగా.. దిల్‌ ‌సుఖ్‌ ‌నగర్‌, ‌కొత్తపేట్‌, ఎల్‌ ‌బి నగర్‌, ‌చింతల్‌ ‌కుంట, వనస్థలిపురంలో భారీ వర్షం పడింది. దీంతో వర్షపు నీరు రహదారులపై చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బయటికెళ్లిన జనాలు తిరిగి ఇంటికెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు..రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లో సూచికను కూడా జారీ చేయడం జరిగింది.

నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని..ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌ ‌ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణలలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావము వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతములలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధప్రదేశ్‌ ‌తీరాలను చేరుకొనే అవకాశం ఉంది.

నిండుకుండలా సాగర్‌ ‌జలాశయం.. పదిగేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్‌ ‌జలాశయం కళకళలాడుతున్నది. ఈ క్రమంలో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ‌జలాశయం ఇన్‌ ‌ఫ్లో, ఔట్‌ ‌ఫ్లో 1,29,791 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్‌ ‌గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 312 టీఎంసీలు.

Leave a Reply